పుట:భీమేశ్వరపురాణము.pdf/94

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

74 శ్రీ భీమేశ్వరపురాణము


స్ఫీతిఁ బ్రతిష్ఠ చేసి యభిషేకజలార్థము తోడితెచ్చి ర
న్వీతసమస్తతీర్థమయి విశ్రుతి కెక్కిన సప్తసింధువున్.

24


మ.

తనతీరంబునఁ బాయకున్న దనపాథ:పూరముల్ గ్రోలినం
దనవీచీతతిఁ దేలినం దనమరుద్వ్రాతంబు సేవించినం
దనుఁగీర్తించిన లోకపావనునిఁగా ధన్యాత్ముఁగాఁ బుణ్యుఁగా
నొనరించున్ నరు సప్తసింధు వది యంహోభంజనప్రౌఢిమన్.

25


క.

చూడుం డాస్వాదింపుం, డాడుఁడు భీమేశ్వరేశ్వరాకృతిఁ దటినీ
చూడారత్నము జడధి, క్రోడాభరణంబు సప్తగోదావరమున్.

26


సీ.

పాతాళశ్రీకాలభైరవస్వామికి, నందికి నభివాదనం బొనర్చి
నాకులేశ్వరదేవునకుఁ దాండవాకార, గణనాయకునకును బ్రణతి చేసి
కొమరసామిని విష్ణుఁ గొల్చి విరూపాక్షు, నాగేంద్రులకు వందనంబు నడిపి
నీహారగిరినందనికి మహాలింగంబు, భీమనాథేశ్వరస్వామి కెరఁగి


తే.

మర్త్యుఁ డేకాదశేంద్రియమదవికార, సంభృతములై యనన్యైకసాధ్యములయి
జన్మజన్మాంతరంబులఁ జాగుచుండు, కల్మషంబులం బాయుఁ దత్క్షణమునంద.

27


శా.

జ్ఞానాజ్ఞానకృతంబు లైన యఘముల్ సర్వంబు నొక్కెత్తున
న్మాను న్మానవకోటి కుద్ధురగతి న్సప్తాపగాతీరసం
స్థానావాసుని రామనాథుని జటాఝూటాటవీవాటికా
స్థానాధిష్ఠితదుర్గకంఠనవముగ్ధస్నిగ్ధకీర్తిద్యుతిన్.

28


తే.

ద్వాదశక్షేత్రశివలింగదర్శనమున, నెట్టిసుకృతంబు సిద్ధించు నట్టిసుకృత
మాక్షణంబున సిద్ధించు దక్షవాటి, రామనాథేశుఁ గన్నులారంగఁ గనిన.

29


తే.

ద్వాదశక్షేత్రతీర్థయాత్రాభివృద్ధి, నిర్జితేంద్రియులై సేయనేర్చిరేని
పాపములు చేసినట్టి నిర్భాగ్యులైన, డాయబోవరుఁ జమునిపట్టనముగవిని.

30


ఉ.

దక్షిణకాశికాతుహినధామకిరీటునిదిక్కు సీమగా
దక్షపురంబునందు బహూధామములన్ శివలింగముల్ సహ
స్రాక్షహుతాశనాదివివిధామరముఖ్యప్రతిష్ఠితంబులై
లక్షలసంఖ్య లున్నవి యలక్ష్యము లయ్యును గానవచ్చియున్.

31


సీ.

వలవ దగ్నిష్టోమవాజపేయాదుల, ధూమపానముఁ జేసి దుఃఖపడఁగఁ
దీర్థసేవార్థమై దేశాంతరంబులు, గాలుచేడ్పడఁ దనకేల తిరుగ
నశ్వగోమహిషరూప్యసువర్ణవస్త్రంబు, లెన్ని వెచ్చించిన నేమిఫలము
సంతతంబును గృఛ్రచాంద్రాయణాదుల, వరటుచునుంట యెవ్వరికి మెచ్చు


తే.

దూరమున నుండి తలఁచిన దురితహరుని, జేరి కొలిచిన సకలార్థసిద్ధికరుని
నంత్యమావస్థమోక్షదీక్షైకగురుని, భీమనాథేశ్వరేశ్వరస్వామిఁ గొలుఁడు.

32