పుట:భీమేశ్వరపురాణము.pdf/92

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరామాయనమః
శ్రీమహా గణాధిపతయేనమః
శ్రీ మాణిక్యాంబాసమేత శ్రీ భీమేశ్వరస్వామినేనమః

శ్రీ భీమేశ్వరపురాణము

చతుర్థాశ్వాసము

శ్రీధామ యశేషదిశా
సౌధాగ్రస్ఫటికకుంభసంభారకళా
సాధీయస్స్థితకీర్తిబు
ధాధార యరేటియన్నయామాత్యమణీ.

1


వ.

అక్కథకుండు శౌనకాది మహామునుల కిట్లనియె.

2


గీ.

బాదరాయణునకుఁ గుంభభవుఁడు చెప్పి
నట్టి యాత్రాక్రమం బిది యనఘులార
యమరముని నారదుఁడు మునీంద్రాదులకును
నర్థిఁ జెప్పినపరిపాటి యది వినుండు.

3


వ.

మీర లడిగినయర్థంబుఁ బర్యాయక్రమంబున వినిపించెద.

4


తే.

పోయె వారణాశికి బాదరాయణుండు, శిష్యులును దాను గైవల్యసిద్ధిఁ గోరి
మనము పోదము గాకంచు మనసు వేడ్క,నరిగి రభ్యర్హితులు వసిష్ఠాదిమునులు.

5


క.

యాత్రాజిగీషఁ బుణ్య, క్షేత్రంబులమీఁదఁ దీర్ఘసేవాపరులై
మైత్రావరుణబృహస్ప, త్యత్రిభరద్వాజముఖ్యు లగుమునిఋషభుల్.

6


ఉ.

కాశీకి నేగుదెంచి మణికర్ణికయందుఁ బ్రయాగయందు నా
కాశనదీ ప్రవాహమునఁ గాయము దొప్పగఁ దోఁగి శంభు వి
శ్వేశు శశాంకశేఖరు ననేకవిధంబులఁ గొల్చి సంతత
క్లేశవినాశహేతువునఁ గేవలతానుఖ మిచ్చఁ గోరుచున్.

7


క.

కేవలతాయకరంబును, భావలతావాటిమలయపవనాగమమై
కేవలతాలీలావతి, కే వల తాకాశి మరగు కృతమతి మనసా.

8


వ.

అని కాశీనగరంబునందుఁ గైవల్యాపేక్షఁ బెద్దగాలం బుండ నిశ్చయించి సాత్యవతేయు వెదకి యెచ్చటం గానక.

9