పుట:భీమేశ్వరపురాణము.pdf/81

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము 61

సీ. సోమతీర్థమునందు సుస్నాన మొనరించి, శ్రీసోమశంబు భజించు ధన్యుఁ
డిహజన్మమునయందు నేపాప మొనరించెఁ, బాప మెద్ది యొనర్చెఁ బ్రాగ్భవమున
నదియశేషంబును నాక్షణంబునఁ బాసి, దేహాంతమునఁ గూడుఁ ద్రిపురహరుని
ద్యాగంబు భోగంబు దానంబు సత్యంబు, భాగ్యంబు కీర్తి సౌభాగ్యలక్ష్మి
తే. బుద్ధి తత్సేన నత్యంతవృద్ధిఁ బొందు, నతతధర్మంబు నిచ్చు నక్షయఫలంబుఁ
దతఫలంబులు పిత్రౌర్ధ్వదైహికములు, సత్య మిది సోమనాథప్రసాదమహిమ. 151

క. సురలును విద్యాధరులును, గరుడోరగకిన్నరులును గంధర్వులు కిం
పురుషులు యక్షులు సోమే, శ్వరదేవునిఁ గొల్తు రధికవరభక్తిమెయిన్. 152

వ. మఱియు మాహేశ్వరతీర్థంబు సర్వదేవనమస్కృతంబు మునిసిధ్ధచారణవిద్యాధరులచేతఁ ప్రతిష్ఠితం బైనయది పితృపిండదానం బేకవింశతికులంబునకుఁ దృప్తికరంబు. 153

తే. సప్తగోదావరంబు సారతీర్థ, ముత్తమోత్తమ మందు మర్త్యుండు చేయు
శ్రాద్ధతిలతర్పణాదు లయక్షఫలములు, తత్సదాసేనవనము శివస్థానదంబు. 154

తే. దత్తమిష్టంబు హుతమధీతంబు నరుల, కచట నక్షయఫలముఁ జేయంగఁజాలు
శ్రాద్ధపిండప్రదానాది సకలవిధులు, నందు ఫలియించు నగ్గయయందుఁబోలె. 155

క. మఱి రామేశ్వరతీర్థము, కఱకంఠున కాటపట్టు కామితఫలముల్
తఱుఁగనిధాన్యము లగుచును, నెఱయంగ ఫలించు నందు నిష్ఠయుఁ గలుగున్. 156

క. శ్రీరుద్రపాదయుగళీ, శ్రీరామేశ్వరసమీపసీమం బితృయ
జ్ఞారంభం బొనరింప న, పారఫలప్రాప్తి చెందుఁ బంచజనులకున్. 157

తే. ప్రథిత మగు సప్తగోదావరంబునకును, నభవునకు భీమనాథున కంతరమున
నేమి సుకృతంబు చేసిన నేకతంబ, వేయు విధముల ఫలియించు వేయునేల. 158

సి. వినుము పారాశర్య వేవేలమాటలఁ, బనియేమి తీర్థముల్ పదియు రెండు
నని చెప్పనేల దక్షారామమండలిఁ, దీర్థంబుగాని ప్రదేశ మెద్ది
సప్తగోదావరోత్సంగస్థలమునకుఁ, గాశి కేదార మక్షయవటంబు
తరముగా కితరతీర్థమ్ములు సాటియె, భోగమోక్షములకుఁ బుట్టినిల్లు
తే. రుద్రవాటిక భీమేశ్వరునినివాస, మందు రామేశ్వరస్థాన మభ్యధికము
రామతీర్ధంబునందు సారంబుసాటి, ధర్మ మర్మంబు రుద్రపాదస్థలంబు. 159

అగస్త్యుండు వ్యాసునకుఁ బంచతీర్థంబుల వివరించుట


వ. మఱియుఁ బంచతీర్థంబులు వివరించిన నవహితుండవై యాకర్ణింపుము. 160

చ. అహిపతికంకణుండు తన యల్లుఁడుగా మదిఁ గోరి నిష్ఠతో
దుహినధరాధరేంద్రుఁడు చతుర్దశదివ్యమహాబ్దముల్ సుదు