పుట:భీమేశ్వరపురాణము.pdf/80

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

60 శ్రీ భీమేశ్వరపురాణము

ఉ. చిక్కఱి కాలభైరవుని చేతివిధాతృకపాలపాత్ర యే
చక్కటియందు జాఱిపడె సప్తనదీతటభీమభూమియం
దక్కడ నుద్భవించిన శశాంకకిరీటుఁ గపాలి శంభు స
మ్యక్కృతి గొల్చు మానవుల మానుగఁ జేరవు పాతకౌఘముల్. 140

తే. ఆకపాలమోచనాభిధానం బైన, పుణ్యతీర్థరాజమునను జలుపఁ
గడిఁదిఁ గోటిఫలముఁ గాంచునొక్కొక్కటి, దానహోమయజ్ఞతంత్రవిధులు. 141

చ. అట వరుణేశ్వరం బన ననాదిఁ బ్రచేతసుచేత వాహినీ
తటమునఁ దొంటి నిల్పఁబడి దక్షమహేశకరారవిందసం
పుటమునకున్ నరాటకము వోలె వెలింగెడు బాలతారకా
విటమకుటావతంసునకు విశ్రమకారణ మై తపోనిధీ. 142

తే. వరుణలింగంబునకుఁ దీర్ఘవారిధార, వేయిఘటముల నభిషేకవిధి యొనర్ప
వఱపుదోసంబు వాయంగ వానగురియుఁ, గొండ్రలంబండు నారబకోటులెల్ల. 143

ఉ. కుక్కుటపక్షిసంఘము లకుంఠితభక్తిఁ బ్రదక్షిణంబు స
మ్యక్కృతిఁ జేసి యెవ్వని కృపాతిశయంబున మోక్షసత్పదం
బెక్కె సమస్తలోకముల కెల్లఁ బ్రియుం డరుణేందుశేఖరుం
గుక్కుటనాథదేవు ఫణికుండలునిం గొలువుండు మానవుల్. 144

తే. ఒక్క పక్షంబులెంతయు నుర్విమోవ
గుడిఁ బ్రదక్షిణ మొనరించు కుక్కుటముల
కక్షయంబగు మోక్ష మేయయ్య యొసఁగె
నట్టిశివుఁ గుక్కుటేశ్వరు నాశ్రయింతు. 145

కం. చరణాయుధేశ్వరేశ్వరు, శరణాగతకల్పతరువు సంపూర్ణమహా
కరుణావరుణాలయునిం, గరుణామృతకిరణధరుని దర్శింపననా. 146

క. కోణార్కక్షేత్రము వా, రాణశి కేదారతీర్థరాజము కుంభీ
కోణంబు కుక్కుటేశ, స్థాణుస్థానంబు మోక్షధామము లెందున్. 147

తే. అచట దానంబు హోమ మధ్యయనవిధులు
శ్రాద్దమును దేవతాసమర్చనము వ్రతము
లొక్కటొక్కటి కోటిగుణోపలబ్ధి
సంభవించును సతతంబు సాధకులకు. 148

వ. మఱియు సోమేశ్వరతీర్థంబు సర్వదేవతానమస్కృతంబు. 149

క. అమృతమయుఁ డైనసోముఁడు, సమయంబున నే మహేశు సంస్థాపించెన్
విమలసుధాజ్యోతిర్లిం, గము సోమేశ్వరుని గరళకంఠు భజింతున్. 150