పుట:భీమేశ్వరపురాణము.pdf/79

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము 59

సీ. భీమనాథేశ్వర శ్రీమన్మహాలింగ, భాస్వత్పరబ్రహ్మభవనమునకుఁ
గల్పాంతసమయభీకరసాగరౌద్ధత్య, భీతత్రిలోకమహాతరికిని
ద్వాదశక్షేత్రతీర్థపలాశమండల, వ్యాకోచనవపుండరీకమునకు
జంబూతరుద్వీప సర్వసర్వంసహా, పాటీరలేపనైపథ్యమునకు
గీ. శివకళత్రమునకు శివక్షేత్రమునకు, శివునిమూర్తికి శ్రీసదాశివునికీర్తి
కితరతీర్థంబు సరిపోల్ప నెట్లు వచ్చు, దక్షవాటంబునకు మహాస్థానమునకు. 129

క. మంకణమహామునీశ్వర, సంకల్పవితీర్ణకల్పశాఖికి భువనా
లంకృతికి దక్షవాటికి, శంకరనటనటననాట్యశాలను జేజే. 130

క. కాశీప్రతిబింబమునకుఁ, గాశీప్రతినిధికిఁ గాశికాప్రకృతికినిం
గాశీప్రతిమకు దక్షిణ, కాశికి శ్రీదక్షవాటికటకంబునకున్. 131

క. మోక్షస్థానంబునకున్, దక్షారామముస కమృతధామంబునకున్
దక్షాధ్వరక్రియోచిత, దీక్షాక్షేత్రమున కభవుదేవికి జేజే. 132

వ. అని నమస్కరించి శతానందుండు. 133

మ. శివలింగంబుఁ బ్రతిష్ఠ చేసి కణఁకన్ శ్రీసప్తగోదావరాం
బువులం జేసెను మంత్రపూర్వకముగాఁ బుణ్యాభిషేకంబు వై
భవముల్ పెక్కువిధంబులం జరపె శ్రీబ్రహ్మేశ్వరుం డంబుజో
ద్భవవంద్యుం డది యాదిగాఁ గరుణమైఁ బాలించు భక్తావళిన్. 134

వ. అంత దేవసిద్ధసాధ్యవిధ్యాధరగంధర్వోరగాదులును దమతమ నామధేయంబుల లింగంబులం ప్రతిష్టించిరి తదనంతరంబ. 135

సీ. బ్రహ్మప్రతిష్ఠితు బాలేందుశేఖరుఁ, బురుహూతుఁ డతిభక్తిఁ బూజ చేసె
నలువ యర్చించె నానాప్రకారంబుల, హరిహయస్థాపితుం డగుమహేశు
దక్షవాటికఁ జూచి దక్షప్రజాపతిఁ, బొగడె నల్మోర్ల నంభోజభవుఁడు
ప్రణమిల్లె దక్షుఁడు భారతీభర్తకు, నాత్మప్రశంసకు నణఁగి మదిని
తే. వేల్పులందఱు దానును నిల్పినట్టి, శంభులింగంబులకు మ్రొక్కి చనిరి దివికి
సరసిజాననుచే ననుజ్ఞాతుఁ డగుచు, సత్యలోకంబునకు నర్థి జనియె విధియు. 136

క. బ్రహ్మప్రతిష్ఠితుండగు, బ్రహ్మేశ్వరదేవుఁ గొలుచు భాగ్యాఢ్యులకుం
బ్రహ్మక్షత్రాదులకును, బ్రహ్మాచ్యుతశంభుభవనపదవులు గలుగున్. 137

క. అధ్యయనశ్రుతదానత, పోధ్యానసమాధిమంత్రపూజాదిమహా
విధ్యనుసంధానమున న, సాధ్యంబులు లేవు బ్రహ్మశంకరుపదవిన్. 138

వ. మఱియుఁ గపాలేశ్వరస్థానంబు. 139