58 శ్రీ భీమేశ్వరపురాణము
తే. వీరభద్రాదిదేవతావీరగణము, శంభులింగంబు నిలిపెఁ బ్రశస్తవేళ
దక్షవాటిఁదదాఖ్యసంస్థాపనమున, వీరభద్రేశుఁ డయ్యె నవ్వేల్పుఱేఁడు. 119
క. శ్రీవీరభద్రలింగము, సేవించిన మానవుండు చిరకాలమునం
గేవలగాణాపత్యమ, హావిభవము నొందు శివుని యాస్థానమునన్. 120
తే. వీరభద్రేశదేవతావిభునియాజ్ఞ, గలుగు ధర్మార్థకామమోక్షములు జనుల
కక్షయంబైన దక్షవాటాభిధాన, భోగమోక్షర మాజన్మభూమియందు. 121
తే. అగ్నిహోత్రంబు దాన మధ్యయనజపము, లాది యగునిత్యనైమిత్తికాదివిధులు
బహుఫలంబుల నొసఁగు సద్భక్తియుక్తి, దక్షవాటిక వీరభద్రస్థలమున. 122
ఉ. యాగతటాకతీర్థమునయందును నంబుధిసార్వభౌమది
గ్భాగవిభూషణం బయిన పద్మినియందును దీర్థమాడి ని
ష్ఠాగరిమంబునం ద్రిపురశాసను దక్షపురోపకంఠధా
త్రీగృహమేధిఁ గొల్వుఁడు ప్రతిష్ఠితభర్గుని వీరభద్రునిన్. 123
వ. తొల్లి బ్రహ్మాదు లగుదేవతలు సురేంద్రవిహితవిభవుండైన భీమనాథేశ్వరు దర్శించు వేడుకం జేసి బ్రహ్మలోకంబుననుండి భోగమోక్షక్షేత్రం బైనదక్షారామంబునకు వచ్చి సప్తగోదావపంబునఁ బంచతీర్థంబులాడి పండ్రెండు దివ్యలింగస్థానంబులు దర్శించి యమృతమయస్వయంభూజ్యోతిర్లింగమూర్తి నిఖిలదేవతాచక్రవర్తి యగు భీమేశ్వరేశ్వరు దర్శించి పరమానందకందళితస్వాంతులై యిట్లనిరి. 124
బ్రహ్లాదులు భీమేశ్వరు వర్ణించుట
శా. ఆహా! యింత మనోహరం బగునె దక్షారామ మివ్వీటిలో
నీహారాంశుకళాకిరీటుండు భవానీభర్త దివ్యాప్సరో
వ్యూహంబుల్ ప్రతిసంధ్యముం గొలువఁగా నున్నాడు గోదావరీ
వాహిన్యబ్ధిసమీరపానకలనావర్ధిష్ణుకేయూరుఁడై. 125
క. ముంగిటను సప్తసింధువు, చెంగటఁ గ్రతుసరసి నడుమ శ్రీభీమమహా
లింగము దక్షారామము, సంగతి నెన్నంగఁ బురము జగతిం గలదే. 126
తే. శివశివా యెంత భాగ్యంబు చేసినారొ, దక్షవాటీపురీమహాస్థానజనులు
కన్నులారంగ వీక్షించుచున్నవారు, భీమనాథేశ్వరేశ్వరస్వామిమూర్తి. 127
చ. అహహ! దయారసానుగతమైన మనంబున దక్షవాటికా
గృహపతి భీమనాయకుఁడు కీటపతంగసరీసృపాళికిన్
సహజగళత్సమీరమగు సంకటకాలము వీనులం దను
గ్రహ మొనరించునట్టె మధురంబగు తారకమంత్రరాజమున్. 128