పుట:భీమేశ్వరపురాణము.pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము 57

తే. ఐంద్రపదభోగ మెవ్వఁడే నభిలషించు, నతఁ డింద్రేశ్వరేశ్వరునాలయమునఁ బ్రణవపంచాక్షరీమంత్రపాఠనియతి, నమ్మహాఫల మొందుఁ దత్త్వార్థ మిదియు. 109

తే. స్నానదానాగ్నిహోత్రదీక్షావిధాన, మంత్రవాదము లైనకర్మంబులొకటి
కోటిగుణితంబు శ్రీదక్షవాటియందు, సప్తగోదావరేంద్రేశ సవిధభూమి. 110

వ. అటమీఁద సిద్ధేశ్వరస్థానంబు సిద్ధలింగాధిష్ఠితంబు ధర్మార్థకామమోక్షపురుషార్థసంసిద్ధికై యాసిద్ధలింగంబు సిద్ధులచేతఁ బ్రష్ఠింపంబడి సిధ్ధసాధ్యగంధర్వగీర్వాణవిద్యాధరారాధ్యంబై యుండు నా స్థానంబు దక్షయజ్ఞప్రాగ్వంశక్షేత్రంబు. 111

క. జపహోమదానయజ్ఞము, లుపవాసాదివ్రతంబు లొక్కొక్కటి కో
టిపరిమితంబులు సిద్ధే, శపదంబున సాధకులకు సత్యం బరయన్. 112

వ. మఱి యోగీశ్వరంబను స్థానంబునందు యోగేశ్వరేశ్వరుండు సనకసనందనాదియోగీశ్వరులచేతఁ బ్రతిష్టితుండని చెప్పంబడును. 113

గీ. అది భవాబ్ధితరణి యది సాధకవ్రాత, కల్పవృక్ష మది జగత్ప్రసిద్ధ
మది యుపాసకులకు నణిమాదికైశ్వర్య, లాభమునకుఁ గరతలంబున పసిఁడి. 114

సీ. మంకణుం డను మహామౌనియోగీశ్వర, శ్రీమహాదేవుని శివు భజించి
బ్రహ్మసాక్షాత్కారపర్యంతమైన ప్ర, బోధసంపదముక్తిపొలము గాంచె
నొకమాఱు సప్తసింధూదకంబులఁ గ్రుంకి, నరుఁడు యోగీశ్వరేశ్వరుని గాంచ
నణిమాదికాష్టవిధైశ్వర్యసంసిద్ధిఁ, బొందు యోగీశు నర్ధేందుధరుని
తే. సప్తగోదావరమునీట జలక మార్చి, పుష్పగంధాక్షతంబులఁ బూజ చేసి
కలిభవంబైన కలుషంబు గ్రాఁచిపుచ్చి, మర్త్యుఁ డొందును వేగం బమర్త్యపదవి. 115

వ. మఱియు యమేశ్వరలింగంబు యమప్రతిష్ఠితంబు సకృద్దర్శనమాత్రంబున మర్త్యుండు యమభయంబునం బాయు వెండియు. 116

సీ. యజ్ఞతటాకంబునందుఁ గ్రుంకులు వెట్టి, బ్రహర్షిపితృతృప్తి బ్రస్తరించి
యమలింగసన్నిధి నష్టోత్తరసహస్ర, సంఖ్య మృత్యుంజయజపముఁ జేసి
జపవిధానమునందు సరవిమృత్యుంజయు, నపమృత్యుభయశాంతి నర్థి నడుగ
నపమృత్యుదేవతాహంకారభవమైన, సంత్రాస మొందఁడు సాధకుండు
తే. శ్రాద్ధపిండోదకాదివిశ్రాణనముల, శ్రీయమేశ్వరతీర్థానఁ జేసి మనుజుఁ
డుద్ధరించును నరకకూపోదరముల, బెగ్గడిలు నేడుతరముల పితృగణముల. 117

క. శ్రీకాళేశ్వరుసన్నిధి, నేకాంతము జపము వ్రేల్మి యీగియు శ్రాద్ధం
బేకైకము కోటిగుణం, బై కలిగించును సమగ్ర మైనఫలంబుల్. 118