పుట:భీమేశ్వరపురాణము.pdf/76

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

56 శ్రీ భీమేశ్వరపురాణము

నాకలోకాధిరాజ్యైకకారణములౌ, నయమార సాధారణస్థలములఁ
గళ్యాణభోగమోక్షనివాసమైన యీ, దక్షవాటిపురస్థానభూమిఁ
తే. జెప్పనేటికి సకలసంసిద్ధిఁ గోరి, దక్షిణాంభోనిధానంబు తటమునందు
సంప్రతిష్ఠింపుఁ డీశానుఁ జంద్రమౌళి, విశ్వలోకాధినాథు నో విబుధులార. 99

క. సిద్ధించు మీ కభీష్టము, సిద్ధ మిది యమర్త్యులార శీఘ్రమున జటా
రుద్ధశశి మహోపనిష, త్సిద్ధాంతరహస్యమును బ్రతిష్ఠింపుఁ డికన్. 100

తే. దర్శనముకంటె మేలు సంస్పర్శనంబు, సంస్పృశించుటకంటె నర్చనము లెస్స
యర్చనము సేయుకంటె ననంతఫలద, మసితగళుని బ్రతిష్ఠించు టమరులార. 101

సీ. సకలలోకప్రపంచమును లింగమయంబు, త్రిజగంబు లింగప్రతిష్ఠితంబు
సంభవస్థితిలయస్థానంబు లింగంబు, లీనార్థగమకంబు లింగ మనఁగ
లింగప్రసాదంబు లేక సిద్ధింపవు, భోగమోక్షంబు లేయోగములను
లింగాజ్ఞవెలిగాఁగ లేశమాత్రంబును, సంచలింపదుపో తృణాచలంబు
తే. మంటినైనను లింగంబు మలిచి కొలుఁడు, ఇసుకనైనను లింగంబు నేర్చి కొలుఁడు
పేఁడనైనను లింగంబుఁ బెట్టి కొలుఁడు, నీటనైనను లింగంబు నిలిపి కొలుఁడు. 102

వ. అని యుపన్యసించి యింద్రుండు తానును లోకపాలకులును దివిజులునుం దమతమపేర శివలింగంబులఁ బ్రతిష్టించిరి. 103

మ. హిమధామార్ధటాజటాకిరీటుఁ డభవుం డింద్రేశ్వరు డింద్రుచే
నమరవ్రాతముతోడఁ గూడగఁ బ్రతిష్ఠాంతంబునం భక్తిసం
భ్రమతాత్పర్యసమగ్రుచేఁ గయికొనెన్ బాథోధివధ్వాపగా
విమలస్వర్ణసరోజపూజ హృదయావిర్భూతసంతుష్టుఁడై. 104

ఉ. ఆగమమంత్రతంత్రములు సాంగములై నడువంగ సర్వవి
ద్యాగురుఁడైన ప్రెగ్గడ బృహస్పతి తోడుగ వీతిహోత్రది
గ్భాగమునం బురందరుఁడు భక్తిఘటించిన వాసవేశ్వరున్
భోగివిభూషణుం గొలుచుపుణ్యుల కబ్బును భోగమోక్షముల్. 105

తే. ఇంద్రుఁ డేఁటేఁట జాతర కేగుదెంచి, సప్తగోదావరమున సుస్నాతుఁ డగుచు
భుజగభూషణు నింద్రేశుఁ బూజసేయు, ధవళమందారతరుపుష్పదామములను. 106

క. ఇంద్రప్రతిష్ఠితుం డగు, నింద్రేశ్వరుఁ గొలువ నెవ్వఁ డేకాగ్రతమై
రుంద్రమతిసప్తసింధునువు, నం ద్రిషవణమాడునతఁడు నాకం బెక్కున్. 107

క. సకృదాలోకనమున మఱి, సకృదర్చన సకృదుపాస సకృదానతులన్
సకృదాలయప్రదక్షిణ, సకృజ్జపంబుల మహేంద్రశంభుఁడు మెచ్చున్. 108