పుట:భీమేశ్వరపురాణము.pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

54 శ్రీ భీమేశ్వరపురాణము

చ. అమృతపయోనిధానమున యందుదయించెఁ గళాసమృద్ధిఁ ద
న్పమరసుధాకరుండు నిజమారఁగఁ జూచిన దక్షవాటికా
రమణుఁడు భీమనాయకుఁడు రాజశిఖాభరణుండు గానినాఁ
డమరమునీంద్రసంఘముకరాంబుజముల్ మొగుడంగ నేర్చునే. 80

తే. విమలపాథోధిఁ బుట్టిన యమృతమూర్తి, భీమనాథుఁడు మాస్వామి కేమిచోద్య
మహరహంబును బాదసేవానురక్త, భక్తిజనలోకభవరోగభంజనంబు. 81

తే. భీమనాథునిఁ ద్రిభువనస్వామినాథుఁ, బార్వతీనాథుఁ శశ్వత్కృపాసనాథు
దక్షవాటాధినాథు వేదత్రయైక, నాథు నానాధుఁ గొలుతు శ్రీనాథునాథు. 82

సీ. భవు భవానీభర్త భావసంభవవైరి, భవరోగభంజను భాలనయను
భోగప్రదుని భోగిరాజవిభూషు, భూనభోభివ్యాప్తు భువనవంద్యు
భగవంతు భర్గుని భసితాంగరాగుని, భానుకోటిప్రభాభాసమాను
భాగీరథీమౌళి భగదృగ్విపాటను, భూరథాంగుని భధ్రభూతిధరుని
తే. భామినీసువిలాసార్ధవామభాగు, భక్తితోడ భజింపరో భవ్యమతులు
భావనాభాజుల కతండు ఫలము లొసఁగు, భాగ్యసౌభాగ్యవైభవప్రాభవములు. 83

క. తేజితవిష్ణుశిలీముఖుఁ, దేజఁప్రదు దక్షవాటి తీర్ధైకమహా
రాజాధిరాజరాజును, రాజకళాధరు భజింప రారో విబుధుల్. 84

క. రారో ప్రియశుద్ధాంతవ, రారోహాసహులు విబుధు లంబుజహంస
క్షీరామలదేహుని ద, క్షారామపురీనివాసు నభవునిఁ గొలువన్. 85

ఉ. నందివినాయకాదిగణనాథులు గూడి ధృతాస్త్రశస్త్రులై
యెందఱు పాలెముందురు మహీధరకన్యకు సావధానులై
నందివినాయనాదిగణనాథులు గూడి ధృతాస్త్రశస్త్రులై
యందఱు పాలెముందురు మహాప్రభువీటికి దక్షవాటికిన్. 86

సీ. భానుమండలములు పండ్రెండు నుదయించి, కరపాళి బిఱ్ఱెండ గాయకుండ
సంరంభమున నేడు ఝంఝానిలంబులు, నెగ్గలం బగు మ్రోత విసరకుండఁ
బుష్కలావర్తకంబులు లోనుగాఁగల, క్రొమ్మేఘములు వృష్టి గురియకుండఁ
బరపి లంఘించి సప్తమహార్ణవంబులు, విన్నంది పెనువెల్లి విరియకుండ
తే. నాజ్ఞవెట్టించుఁ బ్రమథనాయకులచేత, విశ్వపతి యైన భీమేశ్వరేశ్వరుండు
దక్షవాటికి నాత్మశుద్ధాంతమునకు, నవహితస్వాంతుఁ డగుచుఁ గాలాంతవేళ. 87

తే. భైరవుం డర్ధరాత్రంబు ప్రహరిఁ దిరుగుఁ
బాయకుండును నడురేయి బ్రమథగణము