పుట:భీమేశ్వరపురాణము.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

40 శ్రీ భీమేశ్వరపురాణము

విశ్వనాథుఁడు పార్వతితోడ వ్యాసాదులుండిన వేదికకడకు విజయము చేయుట

సీ. చంద్రబింబానన చంద్రరేఖామౌళి, నీలకుంతలభార నీలగళుఁడు
ధవళాయతేక్షణ ధవళాఖిలాంగుండు, మదనసంజీవని మదనహరుఁడు
నాగేంద్రనిభయాన నాగకుండలధారి, భువనమోహనగాత్ర భువనకర్త
గిరిరాజకన్యక గిరిరాజనిలయుండు, సర్వాంగసుందరి సర్వగురుఁడు
తే. గౌరి శ్రీవిశ్వనాథుండు కనకరత్న, పాదుకలు మెట్టి చట్టలు పట్టికొనుచు
నేగుదెంచిరి యొయ్యార మెసక మెసఁగ, విహరణక్రీడ మా యున్న వేది కపుడు. 148

తే. జయయు విజయయు నొకవంక సరస రారు
నందికేశుండు ముందర నడచి రాఁడు
ప్రథమదంపతు లేమి సంభ్రమము లేక
యరుగుదెంచుట యద్భుతమయ్యె మాకు. 149

శా. గౌరిం జూచినయప్పు డంచితమహాకారుణ్యసంసత్తియుం
దారాసాయకమౌళిఁ జూచినపు డుద్యత్క్రోధసంరంభముం
దోరంబై యపు డంతరంగముల సంతోషంబు సంత్రాసముం
బూరించె న్విను మేమి చెప్పుదు మహాపుణ్యాత్మ కుంభోద్భవా. 150

తే. కాశీ శివునకు శుద్దాంతకాంతగాన
దానిపై నల్గి కోపపాత్రంబ నైతిఁ
గాశి గారికి సవతియౌఁ గాన నేను
దానిపై నల్గి ప్రేమపాత్రంబ నైతి. 151

వ. అనంతరంబ యేము ప్రత్యుత్థానంబు చేసి యాపురాణదంపతులకుఁ బ్రణామంబు లాచరించి మడిసందులం జేతులిడి యొక్కకెలన నిలిచి యుండితిమి. పార్వతీపరమేశ్వరులు వేదికాస్థలంబున విజయం చేసి కూర్చుండి రప్పుడు శంభుండు కోపసంరంభంబున నాదిక్కు చూచి ధిక్కరించి యిట్లనియె. 152

శంభుండు వ్యాసుని శిష్యులతోడఁ గాశి వెడలిపొమ్మనుట

సీ. ఓరి దురాత్మ! నీవారముష్టింపచా, భాస! యోజనగంధ ప్రథమపుత్ర!
దేవరన్యాయదుర్భావనాపరతంత్ర! బహుసంహితావృథాపాఠపఠన!
భారతగ్రంథగుంభనపండితంమన్య! నీవా మదీయపత్నికి నశేష
కైవల్యకల్యాణఘంటాపథమునకుఁ, గాశికాపురికి నిష్కారణంబ
తే. శాప మిచ్చెద నని యనాచారసరణి
నడుగుపెట్టినవాఁడ వహంకరించి