పుట:భీమేశ్వరపురాణము.pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము 39

శా. ఆముతైదువ యాజ్ఞ విప్రనికరం బాపోశనం బెత్తినన్
సామర్థ్యం బది యెట్టిదో నిఖిలమున్ సంపూర్ణమై పత్రపా
త్రీమధ్యంబునఁ బిండివంటకములుం దివ్యాన్నముల్ షడ్రసీ
సామగ్రీరుచిమత్పదార్థచయము ల్సంధిల్లె నొక్కుమ్మడిన్. 139

ఉ. పప్పును బిండివంటలును బాయసముల్ ఘృతముల్ గుండంబులుం
గుప్పలుగాఁగఁ జుట్టునను గూర్పఁగఁ గూడిన యేరుఁబ్రాలతె
ల్గప్పురభోగివంటకము గమ్మని తాలిపు సొజ్జెపిండితో
నొప్పులుగా భుజించిరి బుధోత్తము లాఁకటిచిచ్చుపెచ్చునన్. 140

క. తరుణి యిది యన్నపూర్ణా, పరమేశ్వరి గాని యితరభామిని గాదం
చరవాయి గొనక మెసఁగిరి, పరమమునీశ్వరులు పంచభక్ష్యాన్నంబుల్. 141

శా. ద్రాక్షాపానకఖండశర్కరలలో రంభాఫలశ్రేణితో
గోక్షీరంబులతోడ మండెఁగలతో గ్రొన్నేతితోఁ బప్పుతోఁ
నక్షయ్యంబగు నేరుఁబ్రాలకలమాహారంబు నిశ్శంకతం
గుక్షుల్ నిండఁగ నారగించితిమి యక్షుద్రక్షుధాశాంతికిన్. 142

ఆ. ఎవ్వఁ డేపదార్థ మెంతేనిఁ జింతించు, నతని కాపదార్థ మంత గలిగి
యరఁటియాకుమీఁద నవతారమై యుండు, నిట్టిమహిమ చూడ మెన్నఁడేని. 143

ఉ. వేలుపుగిడ్డియుం బరుసవేదియుఁ గల్పకుజంబుఁ దోడ రా
లాలితపాదనూపురఝుళంఝళనాదము లుల్లసిల్లఁ బైఁ
జేలచెఱంగు దూలఁగ విశృంఖలవృత్తి జరించుచుండె నీ
లాలక యన్నపూర్ణ యమృతాన్నముఁ బెట్టుచు నన్నిపంక్తులన్. 144

వ. ఇవ్విధంబున నాజ్యధారాప్రవాహంబును,శర్కరాక్షోదసికతాంచితంబును, బాయసాపూపసంపన్నంబగు కలమాన్నపూర్ణంబును, ద్రాక్షాగోక్షీరక్షౌద్రపుండ్రేక్షుఖండమండితంబును, రంభానారికేళఫలపాకశాకసాకల్యకల్యంబును, షాడబరసావళీపానకప్రచురంబును, శరచ్చంద్రచంద్రికాధవళదధిసమృద్ధంబును నైన
భోజనోత్సవంబు వైశంపాయసవమనః ప్రమోదసంపత్సంపాదనలంపటంబును, సుమంతుసంతోషకారణంబును, బైలరసనాతపఃఫలంబును, జైమినికామనాకామధేనువును, దేవలముదావహంబును, రోమహర్షణహర్షోత్కర్షావహంబును, సూతకౌతూహలహేతుభూతంబును, నస్మన్మనోరథవిహారఘంటాపథంబునునై ప్రవర్తిల్లెఁ దదనంతరంబ. 145

ఆ. హస్తములను గడిగి యాచమనక్రియా, వ్యాప్తి దీర్చి దేవి యాజ్ఞ మేము
విమలసౌధమధ్యవేదికాస్థలమున, విశ్రమించియున్నవేళయందు. 146

వ. అభ్యంతరభవనంబునందుండి. 147