ద్వితీయాశ్వాసము 37
వ. అనిన నవ్వాలుఁగంటికి నిట్లంటి. 119
శా. తల్లీ! యిన్ని దినాల కేనియు సుధాధారారసస్యందియై
యుల్లంబున్ సుఖయింపఁజేయు పలు కెట్లో వింటి నివ్వీటిలో
బెల్లాఁకొన్నతవాన నే నొకఁడనే భిక్షానకున్ వత్తునో
యెల్లన్ శిష్యులఁ గొంచు వత్తునొ నిజం బేర్పాటుగాఁ జెప్పుమా. 120
తే. ఈవు పెట్టిన భిక్ష మే మిందఱమును
బంచుకొని చేయువారము ప్రాణరక్ష
నాతి యందఱవియును బ్రాణములు కావె?
నాయదియె ప్రాణమని వత్తునా! భుజింప. 121
వ. అనిన మందస్మితవదనారవిందయై యయ్యిందుబింబానన యిట్లనియె. 122
శా. అంతేవాసులు నీవుఁ గూడుకొని మధ్యాహ్నాభిషేకక్రియల్
శాంతస్వాంతతజాహ్నవిం జలిపి పెల్చన్ రండు నే నింతలో
నంతర్గేహమునన్ సమగ్రముగ మీ కాహారము ల్వేగఁ గ
ల్పింతున్ భోజనమిష్ట మిందఱకు దృప్తిన్ బొందఁగాఁ బెట్టెదన్. 123
క. ఆఁకొంటి రిన్నిదినములు, పోఁకంతయు భిక్ష వీటఁ బుట్టక యునికిన్
ఆఁకట దూఁకట నలిగితి, రేఁకట వాయంగ భిక్ష లిడియెద రండీ. 124
వ. అనిన నేమును వియల్లోకల్లోలినికిం జని యాప్లవనం బాచరించి యుభయపవిత్రంబులు ధరియించి వేదంబులు పఠించుచు వచ్చి యమ్మచ్చకంటి యింటి మొగసాల గూర్చింటిమి. 125
క. మున్నూరు శిష్యులను నే, నన్నెలఁతుకతోడ మాటలాడిన యయ్య
భ్యున్నతసౌధముమీఁదను, సున్నమునిగిడించినట్టి జోడరఁగులపై. 126
వ. ఉండి యాసారప్రసారంబులు చేయు శంభళీజనంబుచేతను మారాక యెఱింగించిన నబ్బోటి హాటకమయంబైన గొడుగుపావలు గిలుకలు గులుకరింపఁ గుసుమకోదండసమ్మొహనకాండంబునుఁ బోని యొక్క రెండవవయసుతాంబూలకరండవాహినిం గైదండపట్టుకొని యేతెంచి రండు విచ్చేయుండని సబహుమానంబుగాఁ దోడ్కొనిపోయి చంద్రికాసంకాశకౌశేయశతసహస్రసందానితవితానోపశోభితంబును, గాలాగురుధూపధూమవాసనాసనాథంబును, గర్పూరరచితంరంగవల్లీవేల్లితంబును, గస్తూరికాలేపనసురభిశశికాంతమణిశిలాకుట్టిమంబును నగు చతుశ్శాలాభోజనమందిరంబున వృద్ధానుపూర్వకంబుగ నుచితాసనంబులం గూర్చుండ నియమించిన. 127