పుట:భీమేశ్వరపురాణము.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

36 శ్రీ భీమేశ్వరపురాణము

వ. ఆసమయంబునఁ గాశికానగరసోమవీథికాభవనవాటికామధ్యంబున నొక్కయింటి మచ్చకంటి పంచాశద్వర్షదేశీయపలితసారంబైన వేణిభారంబు గైవడ ముదుసలిచక్రవాకంబులతో నెకసక్కెంబాడు వీఁగుచన్నుల వ్రేగుఁదనంబునఁ దనతనూవల్లి జలదరింపఁ గంకణఝణఝణత్కారంబు దోరంబుగాఁ గ్రక్కున గోపురద్వారంబు బోరుతలుపు వాయందట్టి యందియలరవళితోడం గూడి మట్టియలమ్రోత త్రిభువనంబులు నురుజగొనం దేరుగడుపయోలం జరణపల్లవంబుఁ జాఁచి యనంగధ్వజపటకఠోరపాఠీనచ్చాయాదాయాయంబులైన వెణఁదకన్నులు తలచుట్టునుంబలిసి పొలయ కలమధురవీణాక్వాణపాణింధమంబైన యెలుంగు నెత్తి యో బ్రాహ్మణోత్తమా! శాప ముపసంహరించి యిటు రమ్మని నన్ను జేరం బిలిచిన. 110

ఉ. సంతసమంది యే నపుడు శాపజలంబులు పాఱఁజల్లి వే
దాంతవచోమహోపనిషదర్థమయిన్ శుభరూపవృద్ధసీ
మంతినిఁ గాశికానగరమధ్యనివాసిని విశ్వనాథుశు
ద్దాంతము డాయఁబోయితిఁ బ్రియంబును భక్తియునుం దలిర్పగన్. 111

ఆ. డాయఁబోయి యప్పు డాయమ్మ యెవ్వరె, యేకులబునదియొ యెఱుఁగకయును
నే జోహారునిడితి (హృదయంబ నేరుచు, నెదురు ప్రాభవంబు నేర్పరింప.) 112

వ. అంత నన్నుం జేరఁబిలిచి యక్కాంత యిట్లనియె. 113

తే. భిక్ష లేదని యింత కోపింతురయ్య? కాశికాపట్టనముమీఁదఁ గానినేయ
నీమనశ్శుద్ధిఁ దెలియంగ నీలకంఠుఁ, డింత చేసెను గాక కూ డేమి బ్రాఁతి. 114

తే. శ్రీవిశాలాక్షి బంగారుతెడ్డునందు, నమృతపాయస మొసఁగు నభ్యాగతులకుఁ
గాశికాపురి మధ్యాహ్నకాల మనఁగ, వినియు నెఱుంగవే యాతిథ్యవేళలందు. 115

ఉ. ఏడు దినంబు లన్నమున కెడ్డము పుట్టిన యంతమాత్రలో
నేడుచుచున్నవాఁడవు మునీశ్వర నేఁడును నీదు ధీరతల్
పాడఱిపోయెనే శివునిభార్యకుఁ గాశికిఁ బుణ్యరాశికిం
గాడు నొనర్పఁ జూచెదవు • కంఠపుఁగ్రోధము పెచ్చులెచ్చఁగన్. 116

ఉ. క్రొన్నెలపువ్వుదాల్పునకుఁ గూరిమిభోగపురంధ్రి కక్కటా
యిన్నగరీలలామమున కీపరిపాటికి నిట్టికోప మే
లన్న! ఘటించె దో మునికులాగ్రణి నిక్కమువో బుభుక్షితః
కిన్నకరోతి పాపమను కేవలనీతిఁ దలంచి చూడఁగన్. 117

తే. కాశిపైఁ గోపగింపఁగఁ గాదు నీకు, నెంత కోపించునో యింత కిందుమౌళి
విప్రుఁడవు గాన నేరము వెదకఁ దగదు, భిక్షఁ గొనరమ్ము మాటలు పెక్కు లేల. 118