Jump to content

పుట:భీమేశ్వరపురాణము.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

18 శ్రీ భీమేశ్వరపురాణము

ఖ్యదేవాలయంబగుట శతమఖనగరంబును, నక్షయజీవనధృతియగుట ధర్మపాలమండలంబును, ననధిగతకంటకరుచిరంబగుటం బ్రజాభాగ్యఘంటాపథంబును, బ్రచురసన్మణివాసంబగుట వసుంధరాధిపస్థానంబునునై; గుహ్యకనగరంబునుంబోలె వివిధమనుష్యధర్మచరితపవిత్రంబును లంకానగరంబునుంబోలెఁ బుణ్యజనాధ్యుషితసన్నివేశంబును గార్తవీర్యార్జునమూర్తియునుంబోలె నవిరళకరభూషితంబును నృసింహలీలాడంబరంబునుంబోలెఁ బ్రథితహిరణ్యకశిపుక్షయంబును శరత్కాలంబునుంబోలె విలసత్ప్రకాశంబును బ్రాహణజాతిధర్మంబునుంబోలె నిగమశాలియునునై; మహాభూషాన్వితంబయ్యను నిరాక్రోశంబును బ్రకటభుజంగప్రచారంబయ్యును సదాహితాభయంబును బలిరాజనిలయభూతంబయ్యును గంధర్వభూమియునై; వర్ణసాంకర్యంబు వాసవకోదండంబునంద, యహిభయంబు వల్మీకంబులయంద, జీవనసంశయంబు వారిదంబులయంద, వృషాతిక్రమంబు గృహంబులయంద, పరదర్శనంబు యతులయంద, దోషోల్లాసంబు కువలఁయంబులయంద, కౌరవపదానుసరణంబు కిరాతులయంద, తరళత్వంబు కరికరసంతానంబులయంద, విపక్షక్షోభంబు కొలంకులయంద, యాత్తగంధత్వంబు చందనంబులయంద, కానితనయందుఁ బొందనీక విభవంబునకుఁ బ్రభవంబును విలాసంబునకు నివాపంబును సపర్గంబునకు సర్గంబును ధర్మంబునకు మరంబును దానంబునకు నిధానంబును సానందంబునకు మూలకందంబును విద్యకు నిషద్యయు విశ్రామంబునకు ధామంబును నై యొప్పు నప్పట్టనంబున కధీశ్వరుండు. 110

సీ. హాలాహలంబను నల్లొనేరెడుపండు, మిసిమింతుఁడునుగాక మ్రింగినాఁడు
పెనువ్రేలికొనగోర బిసరుహాసనుమోముఁ, గెందమ్మివిరివోలె గిల్లినాఁడు
పంచవన్నియతోడఁ బ్రసవనారాచుని, నెఱ్ఱచిచ్చఱకంట జుఱ్ఱినాఁడు
మెఱఁగుఁగోఱలు డుల్ల మృత్యుదేవతనోరు, ధట్టించి యఱికాలఁ దన్నినాఁడు
తే. త్రిపురదైతావరోధనారీవిలాస, దంతతాటంకముల కెగ్గు దలఁచినాఁడు
దక్షపురిసానికూఁతుల దవిలినాఁడు, విశ్వలోకకుటుంబి భీమేశ్వరుండు. 111

మ. ఎనయంగల్గినకూర్మి భృంగిరిటిఁగానీ తండుఁగానీ నికుం
భునిఁగానీ కయిదండ పట్టుకొని సంభోగేచ్ఛ నంతఃపురాం
గనలం గన్నుమొఱంగి యప్పురమునం గన్నేఱు[1]కాఁదారి ప్రొ
ద్దున భీమేశుఁడు సానివాడ కరుగున్ ధూర్తప్రకారంబునన్. 112

క. పదునాల్గు మహాయుగముల, ముదుకగు భీమేశ్వరునకు మొగచాటైయుం
డదు సానిపెండ్లి యెప్పుడు, నది దక్షారామమహిమ మగునో కాదో? 113

  1. కాదారి = నడురేయి