పుట:భీమేశ్వరపురాణము.pdf/34

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

14 శ్రీ భీమేశ్వరపురాణము

సంధానక్రమదివ్యమంత్రకములన్ సాయాహ్నకాలంబులన్
గంధర్వాప్సరసల్ పురోపవనికాకల్పద్రుమచ్ఛాయలన్. 91

సీ. చరణద్వయీభూరిసౌభాగ్యసంపదఁ, బరిభవింతురు హేమపద్మవనము
ఘనవితంబస్థలీగౌరవాభ్యున్నతి, సంప్రతింతురు నదీసైకతములు
గంభీరతరనాభిగర్తవిభ్రమముల, వ్రక్కలింతురు జలానర్తశోభ
గురుపయోధరభారపరిణాహవిస్ఫూర్తి గుద్దలింతురు హేమకుంభగరిమ
తే. గారవింతురు కంఠోపకంఠకాంతిఁ
గంబుమణికాంతి బిబ్బోకడంబరంబు
మచ్చరింతురు ముఖచంద్రమండలములఁ
బూర్ణశశిమండలముతోడఁ బురముసతులు. 92

శా. దక్షారామవిలాసినీతతుల సౌందర్యంబు వర్ణింపఁగాఁ
జక్షుశ్శోత్రకులాధినాయకునకున్ శక్యంబె? తచ్చారుఫా
లక్షేత్రంబును బోలలేక మునిఁగెం లజ్జాభరక్రాంతుఁడై
నక్షత్రేశుఁడు శంభుశేఖరసుధాంధస్సింధుపూరంబులన్. 93

సీ. అంబుధరశ్రేణి హరిణలాంఛనరేఖ, కమ్రకార్ముకవల్లి కామతల్లి
జలచరద్వంద్వంబు చంపకప్రసనంబు, బింబంబు దాడిమబీజరాజి
శష్కులీయుగళంబు చారుదర్పణములు, శంఖంబు బిసములు జలరుహములు
పసిఁడికుంభంబులు బయలంబువీచులు, పుష్కరావర్తంబు పులినతలము
తే. కదళికాహేమకాహళకచ్ఛపములు, మణులబంతులు తారకామండలములు
సంఘటించి పురంబు వేశ్యల సృజించె, జాణదేవరశ్రీపంచశరవిరించి. 94

సీ. ముడువంగ నేర్తురు మూలఁగమ్మనితావి, గలుగు క్రొవ్విరులు లోఁ గందకుండ
మురియంగ నేర్తురు మోహనాస్పదమైన, మొగలివాకిటిచాయ నరగవీథి
వలపింప నేర్తురు నలరాజు గెలిచిన, పెద్దగాలమువేల్పు భీమనాథుఁ
బలుకంగ నేర్తురు పాటలాధరముల, మొల్కలేనగవులు ముద్దుగురియఁ
తే. జందురునితోడఁ గల్పవృక్షములతోడఁ, దారతో లక్ష్మితో నమృతంబుతోడఁ
గౌస్తుభముతోడ మున్నీఁటఁ గలిగినారు, విబుధగంధర్వజాతు లవ్వీటిసతులు. 95

క. పూఁబోణులకును విటులకు, [1]వేఁబోకలఁదలరుసొంపు వీడ్కొలుపుఁ బురిన్
[2]లేఁబోకఁబోఁకతోఁటల, [3]పూఁబాళలకమ్మతావిఁ బొదలినగాడ్పుల్. 96

ఉ. వీటికి నాల్గువంకలను వెన్నెలతేటలఁబోలు నీళ్ళతో
హాటకపద్మమండితములైన కొలంకులు చూడనొప్పగున్

  1. వేఁబోకల = ఉదయకాలములందు
  2. లేఁబోఁక = తిన్ననినడక
  3. పూఁబాళ = పుష్పగుచ్ఛము