పుట:భీమేశ్వరపురాణము.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

6 శ్రీ భీమేశ్వరవురాణము

గ్రామణులన్ ద్రిలింగభూమండలాఖండలులను బోలయవే మాన్నపో తాన్నవేమకుమారగిరీశ్వరాదులం బూజ్యసామ్రాజ్యపీఠస్థులంగాంచె. తత్సంబంధబాంధవంబున వసుంధరాభారధౌరంధర్యంబునం గంధసింధురఘటాకూటకపటకిటికచ్ఛపావతారనారాయణ భుజంగ భూధరంబులకుఁ దోడుజోడై రాయగురుపరమేశ్వర సాధుజనవిధేయ ఖోడెరాయ సకలకళాధామాదిబిరుదభాస్వరుండై భీమయగురువరేణ్య పుణ్యకారుణ్యకటాక్షవీక్షాలబ్ధ సుస్థిరెశ్వర్యధుర్యుండై విజయధాటీసమాటీకనంబు దిశలల్లాడ నల్లాడభూవల్లభుండు రాజమహేంద్రంబు రాజధానిగా సింహాద్రిపర్యంతం బుత్కళకళింగయవనకర్ణాటలాటాంతర్దీపంబైన ప్రతాపంబున దిలీప నల నహుష నాభాగ భరత భగీరథ మాంధాతృ ధుంధుమార పూరు పురూరవఃప్రభావుండై విశ్వవిశ్వంభరాభువనమండలంబుఁ బరిపాలించెఁ దదనంతరంబ. 32

గీ. రాజరఘురాము లల్లాడ రమణసుతులు, ధాత్రిఁ బాలింతు రాచంద్రతారకముగ
వేమభూవల్లభుండును వీరవిభుఁడు, నన్నదమ్ములు హరియును హరుఁడుఁబోలె. 33

ఉ. తమ్ముని వీరభద్రవసుధాధిపు విక్రమవీరభద్రుని
న్సమ్మదలీల రాజ్యభరణస్థితిఁ బట్టముఁగట్టి బాహుద
ర్పమున వేమభూవరుఁడు వ్రాసె జగద్విజయప్రశస్తివ
ర్ణమ్ములు దిగ్ధురంధరసురద్విపకుంభవిషాణమండలిన్. 34

సీ. పాతాళభువనాధిపతికి శేషాహికిఁ, బ్రియలతో మసకానఁ బెనఁగఁగలిగె
దిక్సింధురములకు దివ్యవాహినిలోనఁ, దేఁటి రాయిడి మానఁ దేలనొదవె
నుర్వీధరములకు నుదధిలోఁ గాఁపున్న , కొలముసాములయిండ్లఁ గుడువనబ్బెఁ
గుహనాకిటికిలక్ష్మికుచకుంభములమీఁది, కుంకుమంబున నుసుల్ కొనఁగఁగూడె
తే. రాయవేశ్యాభుజంగవీరప్రతాప, భాసి యల్లాడవిభువీరభద్రనృపతి
సర్వసర్వంసహాచక్రసర్వభరము, పృధుభుజాపీఠమున సంభరించుటయును. 35

క. ఏరీ ధరణిపు లల్లయ, వీరక్ష్మాపతికి సాటి వితరణగరిమన్
ధారాధరధారాధర, ధారాధరవాహదానధారానిధికిన్. 36

మహాస్రగ్ధర. ఫణిరాజస్తబ్ధరోమప్రకటకమఠరాట్పర్వతశ్రేణిదిగ్వా
రణదౌరంధర్యధారారభటిసమధికప్రౌఢబాహాప్రతాప
ప్రణతప్రత్యర్థిపృథ్వీపతిమకుటమణీభాసమానాంఘ్రిపీఠున్
బ్రణుతింతున్ వీరభద్రుం బ్రతిభటధరణీపాలకాలాగ్నిరుద్రున్. 37

సీ. [1]పండువాసురతాణి పావడం బిచ్చిన, భద్రేభములు వీథిఁ బాలె ముండు
నొడ్డె ధాత్రీనాథుఁ [2]డుపద పుత్తెంచిన, బింబారుణోష్ఠి [3]సంబెళవహించుఁ

  1. పండువాసురతాణి = పండువాదేశపురాజు; పావడము = కానుక
  2. ఉపద = కానుక
  3. సంబెళ = వక్కలాకులతిత్తి