పుట:భీమేశ్వరపురాణము.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

2 శ్రీ భీమేశ్వరపురాణము

తే. మందరాచలకందరమథ్యమాన, దుగ్ధపాథోధిలహరికోద్భూతయైన
[1]లలితసాహిత్యసౌహిత్యలక్ష్మి నొసఁగు, వరదయై మాకు [2]వినతగీర్వాణి వాణి. 4

పురాతనకవీంద్రగుణకీర్తనము

శా. శ్లోకంబుల్ శతకోటిఁ గాండములుగా సూత్రించి రామాయణం
బేకైకాక్షర మెల్లపాపముల మాయింపంగి నిర్మించి [3]సు
శ్లోకుండైన పురాణసంయమివరున్ జూతు న్మనోవీథి వా
ల్మీకిన్ బ్రహ్మప[4]దావతీర్ణకవితాలీలావతీవల్లభున్. 5

మ. తలఁతున్ భారతసంహితాధ్యయన విద్యానిర్మితిప్రక్రియా
నలినప్రోద్భవునిన్ [5]గళిందతనయాంతర్వేదిపుణ్యస్థలీ
పులినాభోగకృతావతారు నపరాంభోజాక్షు నక్షీణని
ర్మలసాహిత్యకళాసమృద్ధికయి పారాశర్యమౌనీశ్వరున్. 6

సీ. ప్రణుతింతు రసభావభాననామహనీయ, కవితాసముల్లాసుఁ గాళిదాసు
గణుతింతు నిరవద్యగద్యపద్యనిబంధ, [6]పరితోషితస్థాణు భట్టబాణు
భజియింతు సాహిత్యపదవీమహారాజ్య, భద్రాసనాసీనుఁ బ్రవరసేను
వర్ణింతు నంభోధి[7]వార్వీచిగంభీర, తాసారవాక్సముత్కర్షు హర్షు
తే. భాస శివభద్ర సౌమిల్ల భల్లులకును, మాఘ భారవి బిల్హణ మల్హణులకు
భట్టి చిత్తవకవి దండి పండితులకుఁ, గీలుకొలుపుదు నొసలిపైఁ గేలుదోయి. 7

క. నెట్టుకొని కొలుతు నన్నయ, భట్టోపాధ్యాయసార్వభౌమునిఁ గవితా
పట్టాభిషిక్తు భారత, ఘట్టోల్లంఘనపటిష్ఠగాఢప్రతిభున్. 8

ఉ. పంచమవేదమై పరఁగు భారతసంహిత నాంధ్రభాషఁ గా
వించెఁ బదేను పర్వములు విశ్వజగద్ధితబుద్ధి నెవ్వఁ డ
క్కాంచనగర్భతుల్యున కఖండితభక్తి నమస్కరింతు ని
ర్వంచితకీర్తివైభవవిరాజికిఁ దిక్కన సోమయాజికిన్. 9

మ. కనకక్ష్మాధరధీరు వారిధితటీకాల్పట్టనాధీశ్వరున్
ఘనునిన్ బద్మపురాణసంగ్రహకళాకావ్యప్రబంధాధిపున్
[8]వినమత్కాకతి సార్వభౌముఁ గవితావిద్యాధరుం గొల్తు మా
యనుఁగుందాతఁ బ్రదాత శ్రీకమలనాభామాత్యచూడామణిన్. 10

  1. లలితసాహిత్యసాహిత్యలక్ష్మి = మనోజ్ఞమైన సాహిత్యము యొక్క సంపూర్ణసంపద
  2. వినతగీర్వాణి = మొక్కుచున్న దేవతా స్త్రీలుగలది
  3. సుశ్లోకుండు = మంచికీర్తిగలవాఁడు
  4. అవతీర్ణ = దిగిన; కవితాలీలావతీ = కవితయనియెడు స్త్రీ
  5. కళిందతనయ = యమునానది
  6. పరితోషిత స్థాణు = శివుఁడు ఎవనిచే సంతోషింపఁజేయఁబడినవాఁడు
  7. వార్వీచి = నీటియలలు
  8. వివమజ్జ్యాంతరసౌర్వభౌము, అనిపాఠ. వినమత్ = నమ్రుఁడైన