పుట:భీమేశ్వరపురాణము.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరస్తు
శ్రీరామాయనమః.
శ్రీమహా గణాధిపతయేనమః.
శ్రీమాణిక్యాంబాసమేత శ్రీభీమేశ్వరస్వామినేనమః

శ్రీ భీమేశ్వరపురాణము

ప్రథమాశ్వాసము

[1]శ్రీస్తనగంధసార పరిషేకసమంచిత సాయకప్రయో
గాస్తమహాపురత్రయుఁ డహార్యధనుర్ధరుఁ డర్కకోటి దీ
ప్తిస్తవనీయవిగ్రహుఁడు భీమయదేవుఁడు దక్షవాటికా
వాస్తుఁడు ప్రోచుఁగావుత ధ్రువంబుగ దేవయయన్న ధీమణిన్. 1

ఇష్టదేవతాప్రార్థనము

ఉ. ఏనికమోముతా ల్పెలుకనెక్కినరావుతురాజు సౌరసే
సానియనుంగుఁబెద్దన వినాయకదేవుఁడు కర్ణతాళఝం
ఝానిలతాడనంబున నిరంతరమున్ బ్రబ[2]లాంతరాయసం
తానమహాఘనాఘనకదంబములన్ విదళించుఁ గావుతన్. 2

ఉ. [3]బాలిక మోము మత్తవనబర్హికిశోరకలాస్యలీలఁ బై
వాలిచి పచ్చకప్పురపువాసనతోడి ముఖారవిందతాం
బూలపుమోవి మోవిపయి మోపుచు రాధకు నిచ్చు ధూర్తగో
పాలుఁడు ప్రోచుఁగావుత మపారకృపామతి మంత్రియన్ననిన్. 3

సీ. రాజీవభవుని గారాపుఁబట్టపు దేవి, యంచ[4]బాబా నెక్కు నలరుఁబోణి
పసిఁడికిన్నెరవీణెఁ బలికించు నెలనాఁగ, పదునాల్గువిద్యల పట్టుగొమ్మ
[5]యీరేడుభువనంబు లేలుసంపదచేడె, మొలకచందురుఁదాల్చుముద్దరాలు
వెలిచాయకొదమరాచిలుకనెచ్చెలికత్తె, ప్రణవపీఠిక నుండుపద్మగంధి

  1. శ్రీస్తన…త్రయుఁడు = విష్ణువునే బాణముగాఁ బ్రయోగించి త్రిపురంబుల నాశనము చేసినవాఁడు; ఆహార్యము=పర్వతము (ఇచట మేరువు)
  2. అంతరాయసంతానము=విఘ్నపరంపర; ఘనాఘనము=మేఘము
  3. బాలిక=కన్యక, ఇచట రాధ
  4. బాబా = గుఱ్ఱము
  5. ఈరేడు = పదునాలుగు