పుట:భీమేశ్వరపురాణము.pdf/154

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

136

శ్రీభీమేశ్వరపురాణము


క్షేత్రంబున ద్వాదశవార్షికపరిమితం బైన సత్రయాగంబునఁ గూడినశౌనకాది మహామునులు, యజ్ఞావసానసమయంబున శ్రీమన్మహాదేవుని సందర్శింపం జనిరి. ఇది పంచాశత్ఖండమండితంబును, సనత్కుమారసంహితాది బహుసంహితాసంధానంబును నైన స్కాందపురాణంబునందు గోదావరీఖండంబునందుఁ జెప్పంబడిన భీమఖండంబు, భీమేశ్వరమాహాత్మ్యంబును, భీమేశ్వరపురాణం బనంబరఁగు నిమ్మహాప్రబంధంబు వ్రాసిన, బఠించిన, వినినఁ, బుస్తకం బర్చన చేసిన, నారాధించిన, శ్రీభీమనాథేశ్వరుం డాయురారోగ్యైశ్వర్యంబులు, శాశ్వతమోక్షపదంబును గృప సేయు.

107ఉ.

వైభవపాకశాసన! సుపర్వమహీధర ధైర్యవర్తి! గే
యోభయవంశదీపక! సముద్ధితవీరవిరోధిమండల
క్షోభకరప్రతాప! ఫణికుండలభక్తనిధీ! దిగంతగం
ధేభకటద్వయద్వయసహృద్యయశఃపరిరంభ నిర్ఝరా.

108


క.

రామాంబానందన! సం, గ్రామజితధనంజయా! పరాక్రమరామా
స్వామిద్రోహరగండ! మ, హామాత్యకిరీటశేఖరామాత్యమణీ.

109


భుజంగప్రయాతము.

ప్రధూత్కార్యసామంతరక్షాధురీణా
విధూత్తంససేవాప్రవృత్తాంతరంగా
మధూళీమదాసారమాధుర్యవాక్యా
బుధారాధనాసార, భోజావతారా.

110


గద్య.

ఇది శ్రీమత్కమలనాభపౌత్ర మారయామాత్యపుత్ర సుకవిజనవిధేయ సకలవిద్యాసనాథ శ్రీనాథనామధేయప్రణీతం బైనశ్రీభీమేశ్వరపురాణం బనుమహాప్రబంధంబునందుఁ సర్వంబును షష్ఠాశ్వాసము.

శ్రీమాణిక్యాంబాసమేత శ్రీభీమేశ్వరార్పణమస్తు.
శ్రీరామార్పణమస్తు.