పుట:భీమేశ్వరపురాణము.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

xi

యాస్థానకవులని యాసంస్థానవంశ చరిత్రమున వ్రాయఁబడి యున్నదఁటయని బ్రహ్మశ్రీ మహారాజరాజశ్రీ రాయబహుదరు కందుకూరి వీరేశలింగము పంతులవారు వ్రాయుచు దానినిఁ దాము విశ్వసింపమని తమ కవులచరిత్రములోఁ దెలిపియున్నారు. "ఈ సర్వజ్ఞ సింగమనాయఁడు కావ్యనాటకాలంకారములయందును దర్కవ్యాకరణాది శాస్త్రములయందును సమర్థుఁడై కావ్యములు వ్రాయడమునందుఁ బ్రజ్ఞకలవాఁడై సింగభూపాలీయ మనునలంకార గ్రంథమును జేసెను. ఈయన పరాక్రమశాలియై ప్రౌఢదేవరాయలవారి దినములలోఁ బ్రసిద్ధుఁడుగ నుండెను. శ్రీభాగవతముఁ దెనిఁగించిన బమ్మెరపోతరాజనే కవీశ్వరుఁ డీయనమీఁద భోగినీదండకమును జెప్పినాఁడు. నైషధముఁ దెనిఁగించిన శ్రీనాథుండను కవీశ్వరుఁడు సింగమనాయనిమీఁదఁ గొన్ని పద్యములఁ జెప్పియున్నాఁడు." అని మాత్రమె యీ వంశమువారి వంశవృక్షమునఁ గనఁబడుచున్నది. అయినను దీని నాధారముగఁ గొని యింగ్లీషు భాషలో రాజా టి. రామరావుగారిచే వ్రాయబడిన వంశచరిత్రమందుమాత్ర మిట్లని యున్నది:- "His Court is said to have been adorned by several poets among whom were Bammera Pota Raju who translated the Bhagavatam in Telugu and Sreenathudu the Telugu translator of Naishadam. Sarvagna Singama Nayudu formed the subject of a composition by the former called Bhoginee Dandakam and of some stray verses by the latter." పోతన శ్రీరామచంద్రుని యాస్థానకవియే కాని సామాన్య నరపతుల నాశ్రయించినవాఁడు కాఁడనుట లోకవిదితము. శ్రీనాధుఁడు తన గ్రంథములను రెడ్లకును వారి మంత్రులకును భాండాగారాధ్యక్షులకును నంకితం బొసఁగి లాభ మపేక్షించినవాఁడై యుండఁగ నతఁ డాస్థానకవియై యుండినచో "ఇమ్మను జేశ్వరాధముల కిచ్చి పురంబులు వాహనములున్। సొమ్ములుఁ గొన్ని పుచ్చుకొని సొక్కి శరీరము వాసి కాలుచే। సమ్మెటపోటులం బడక సమ్మతి శ్రీహరి కిచ్చి చెప్పెనీ। బమ్మెరపోతరాజొకఁడు భాగవతంబు జగద్ధితంబుగన్॥ అని నరాంకితమున కెంతేనియు విముఖుఁడై కేవల ముదాసీనుఁడై యున్న బమ్మెరపోతనామాత్యుని నెట్లో మెప్పించి భోగినీదండకముం గైకొనిన సరసుఁ డగుసింగభూపాలుఁ డితనివలన నొక గ్రంథమేనియు నంకితము నడిగియుండమికిం గారణ మేమియై యుండును? కావున నీవార్త విశ్వసనీయము కానిదే. అయినను శ్రీనాథునకును సింగభూపాలునకును సమాగమము కలిగినదియు వార లొకరియం దొకరు మిగుల గౌరవముంచియుండి రనుటయు విదితంబ, ఎట్లనిన శ్రీనాథుఁడు సింగమనాయని కొలువుకూటంబు దరియం బోవునపు డీలాగు సరస్వతిని నుతించెనఁట.