పుట:భీమేశ్వరపురాణము.pdf/147

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

షష్ఠాశ్వాసము129


వ.

తొల్లి జలంధరగంధగజపుండరీకాంధకాసురాదు లగుమహాదెత్యులు భువనత్రయం బాక్రమించిన శక్రుండు భయభ్రాంతుండై దేవగణదేవమునిసిద్ధసాధ్యవిద్యాధరోరగగరుడగంధర్వకిన్నరకింపురుషాదులం గూర్చుకొని బ్రహ్మకు విన్నవించిన విరించియు వారిం దోడ్కొని పాలమున్నీటిలో ఫణిరాజతల్పంబుపైఁ బవ్వళించిన పాంచజన్యధరునకు విన్నపంబు చేసి సంస్తుతించినఁ గైటభారి హాటకగర్భుని విన్నపం బవధరించి చింతాభరంబున నొక్కింతదడ వూరకుండి పుండరీకాసనుం జూచి యిట్లనియె.

57


తే.

వీరభద్రుండు చక్రంబు విఱిచి దక్ష
యాగమున నాఁడు భక్షించె నాగ్రహమునఁ
జెఱకు శర్కరపాకంబు చేసినట్టి
చక్కిలముఁబోలె ఛటఛటా శబ్ద మొప్ప.

58


ఉ.

కోపము చిచ్చునం బడిన కూరిమితల్లి ఋణంబు దీఱ ను
ద్దీపతరాగ్రహంబునను దేవతలం గడుభంగ పెట్టఁగా
నేపున నేను మార్కొని పయిం బఱతెంచిన మంతమాత్రలో
జాపరమేశ్వరా యనుచుఁ జక్రము మ్రింగిన నోహటించితిన్.

59


తే.

తెగువ దక్షునికంఠంబు ద్రెవ్వనేసి, వ్రేల్చెఁ దల వధ్వరాగ్నిని వీరభద్రుఁ
డాప్రజాపతి మెడమీఁద నక్షణంబ, నగుచుఁ బొట్టేలితలఁ దెచ్చి నాటుకొలిపె.

60


వ.

అప్పు డవ్వీరభద్రుని తేజోవిశేషంబును గనుఁగొనఁ గన్నులు మిఱుమిట్లు గొన వెఱచఱచి యెలుంగు డించి తొలంగితి నాఁటనుండియు.

61


శా.

పట్టంగైదువులేక విన్న నయి నా బాహార్గళుల్ చూడుఁడా
యిట్టుంగాక సురేంద్ర! బాధపడి మీ రిబ్భంగి దుఃఖింపఁగాఁ
గట్టాపో యిటు మిన్నకుండుదునె శీఘ్రంబిప్డు భీమేశ్వరున్
ముట్టంగొల్చెదఁ జక్రలాభమునకై ముగ్ధేందుచూడామణిన్.

62


వ.

అని పలికి నలినసంభవేంద్రాదు లగునిర్జరులం గూడి సరోరుహాక్షుండు దక్షారామంబునకు వచ్చి శివగంగాకూపంబునఁ ద్రిషవణస్నానంబు చేసి భస్మోద్ధూతగాత్రుండును, ద్రిపుండ్రాంకితమస్తకుండును, రుద్రాక్షమాలికాధరుండును, జటావల్కలసంయుతుండునునై నిత్యంబును సహస్రపద్మంబులఁ బూజఁ గావించుచు భీమనాథేశ్వరేశ్వరు సేవించుచుండె నంతఁ గొంతకాలంబునకు.

63


క.

ఈభంగి వేయుదమ్ముల, నాభుజగాభరణు నెప్పు డర్చన సేయన్
శ్రీభీమేశుండు కమల, నాభుని మనమరయ నొక్కనలినము దాఁచెన్.

64