Jump to content

పుట:భీమేశ్వరపురాణము.pdf/145

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

షష్ఠాశ్వాసము

127


తే.

వర్తనం బెల్ల శంభుసేవావ్రతంబు, మాలలెల్లఁ బంచాక్షరీమంత్రరాశి
భోగమోక్షనివాసైకభూమియైన, దక్షపురినున్న జనుల కోతలిరుఁబోణి.

40


వ.

దక్షారామమాహాత్మ్యం బవాఙ్మానసగోచరంబు. భీమనాథ మహాదేవ దివ్యశ్రీపాదపద్మసేవావ్రతంబువలన నెట్టి పాపకర్ముండును భోగమోక్షపదవీసామ్రాజ్యపట్టాభిషేకమహాదివ్యపదవి నొందు. సర్వశాస్త్రసిద్ధాంతమతాంతరంబులకు సమ్మతంబైన యిమ్మహాస్థానం బేకవటీభూతంబు సద్యోముక్తిప్రదంబు సద్యఃపరిజ్ఞానసదనంబు సద్యఃకళాసమృద్ధిప్రదంబై యుండునని దయార్ద్రమానసుండై వృషభధ్వజుం డాదేవి నుద్దేశించి పార్వతీ నీవడిగినయర్థంబు సర్వంబు సమర్థించితి. చిత్తంబున నవధాసంబు సేయుమనినం పతికిఁ గరంబులు మొగిడిచి మ్రొక్కి భవాని హర్షోత్కర్షంబు నొందె. నీరహస్యం బేనును గురుముఖంబున నెఱిఁగి ప్రసంగవశంబునం బ్రహ్మవేదులగు మీకు నుపదేశించితి.

41


శా.

సద్యోముక్తిప్రదంబు దక్షనగరీస్థానంబు విశ్వేశ్వరుం
డాద్యుం డవ్యయుఁ డానతిచ్చె నిది వేదార్థంబు; సద్యోవిము
క్త్యుద్యోగం బనుపేక్షయైన నది నుం డొండొక్కతీర్థంబు పు
ష్పోద్యానం బనఁ గాల మందుఁ గడుపన్ యోగంబు భావింపఁగన్.

42


వ.

మఱియు భీమలింగమాహాత్మ్యంబు భవకలుషనాశనంబు బ్రహ్మవిష్ణుపురందరాదులకుఁ గల్పకోటిశతంబులనైన వచియింపనలవిగాదు. అయినను నా నేర్చువిధంబున నింక వర్ణించెద.

43


తే.

భువనములమూఁటియందును బొబ్బవిడుచు, నంతదాఁకనె యితరతీర్థాదులెల్ల
నపుడు భేదంబు లేదని రవనిమీఁద, దక్షవాటీపురీభీమధామమహిమ.

44


సీ.

దక్షుండు పొట్టేలితల ధరించినయప్డు, భారతి ముక్కు గోల్పడినయపుడు
పూషార్కువదనంబు బోసివోయినయప్డు, విష్ణునిచక్రంబు విఱిగినపుడు
అగ్నినాలుక లేడు నౌడుమాసినయప్పు, డుడురాజు పొట్టిగు జ్జుఱికినపుడు
జన్నంపుటిఱ్ఱిమస్తకము ద్రెళ్ళినయప్డు, వడిదక్షుతల చిచ్చువడినఁయపుడు


తే.

ప్రాణభయమున ముక్తిసంభ్రమము మెఱయ
నమ్మహోత్పాతకాలంబునందు మునులు
దైవగంధర్వసిద్ధవిద్యాధరులును
నేమమున గొల్తు రెవ్వాని నెమ్మనమున.

45


సీ.

దుగ్ధాబ్ధిమంథనోద్భూతహాలాహల, జ్వలనమేచకకంఠ శరణు శరణు
గిరిచాపనిష్ఠ్యూతహరిశిలీముఖదగ్ధ, పురగోపురాట్టాల శరణు శరణు
సింధురాంధజలంధరాంధకవ్యాఘ్రాది, సురకంటకధ్వంస శరణు శరణు
విలయసంధ్యాకాలవికటతాండవకేళి, జర్జర బ్రహ్మాండ శరణు శరణు