పుట:భీమేశ్వరపురాణము.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యుండు నీపద్యము నిదర్శనము. ఈకవి తన కావ్యములయం దేయేవిధముగ భాషను బోషింప యత్నించినదియు నీ పద్యము తెలుపును:—

సీ. వచియింతు వేములవాడ భీమనభంగి, నుద్దండలీలనొక్కొక్కమాటు
   భాషింతు నన్నయభట్టుమార్గంబున, నుభయవాక్ప్రౌఢి నొక్కొక్కమాటు
   వాక్రుత్తు తిక్కయజ్వప్రకారము రసా, భ్యుచితబంధముగ నొక్కొక్కమాటు
   పరిఢవింతు ప్రబంధపరమేశ్వరుని ఠేవ, సూక్తివైచిత్రి నొక్కొక్కమాటు.

శ్లో. "కాశీఖండ మయఃపిణ్డం నైషధం విద్వదౌషధమ్"

అనునటుల దేవభాషలో మిక్కిలి కఠినములు నాఁ బ్రసిద్ధిఁ గాంచిన కావ్యముల నీ కవిశిఖామణి సాహసించి తెనింగించెనన నీతని సామర్థ్యమునుగుఱించి వేఱుగఁ జెప్ప నక్కఱయుండదు. ఈ కవి వ్రాసిన గ్రంథములలో గొప్పవియు రసవంతములును ముద్రితములు నగు కాశీఖండము నైషధ మనునవి భాషాంతరీకరణములు తక్కినవియు నారసిచూచినఁ దఱచు దేవభాషలోని యేదో యొక గ్రంథమునం దుండి వ్రాయఁబడినట్లె యేర్పడును. ఎట్లనం బ్రకృతము శ్రీ సరస్వతియను మాసపత్రికయందు ముద్రింపఁబడుచుండు హరవిలాసమున 4-వ యాశ్వాసమున గౌరీతపస్సు, వివాహసందేశము మొదలగు పట్లం జూడుఁడు. కాళిదాసు కుమారసంభవమునకు యథాశ్లోకము భాషాంతరీకరణముగ నుండుట తెలియును. ఈ కవి వ్రాసిన భాషాంతరీకరణములు యథాశ్లోకముగ వ్రాయఁబడి యుండలేదు; ఈ విషయమున నీకాలపు భాషాంతరీకరణములగు కుమారసంభవము శాకుంతలాది నాటకములు మొదలగువానితో నివి తులఁదూఁగవు, తనతో సమకాలికుఁడైన బమ్మెరపోతనామాత్యుఁడు మూలము ననుసరించినంతమాత్రముఁగూడ నీకవి యనుసరించియుండలేదు, దృష్టాంతములం జూడుఁడు:—

23-వ పుట 13-వ పద్యమున సంతతము దేవవేశ్యాభుజంగుఁడతఁడు" అని యున్నది. దీనికి మూలము "సహిసర్వదేవరాట్" సాధ్యమైనపట్ల నెల్ల నిట్లు దేవునకేని గొప్పవారికేని యీ భుజంగత్వముఁ గల్పించుట యీ కవియొక్క గొప్పలోపము. దీనివలననే కృతిపతినింగూర్చి షష్ఠ్యంతములలో "పంచారామవధూటీ పంచాస్త్రవిహారకేలి పాంచాలునకున్" అని వ్రాసెను. ఇది యాకృతిపతికేనిఁ బంచారామవాసినులగు ఫుణ్యాంగనలకేని గౌరవజనకంబుగ మాకుఁ దోపదు.