పుట:భీమేశ్వరపురాణము.pdf/112

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

92

శ్రీ భీమేశ్వరపురాణము


తే.

సంస్మితం బైనమదనశాసనునిముఖము
చూచి యానందమునఁ బొంది సురలు మునులు
రాక్షసకృతావరోధసంరంభ మింకఁ
దమకు లేదని తెలిసిరి తత్త్వబుద్ధి.

157


శా.

కారాగారనిబద్ధ లైనదివిషత్కాంతాజనుల్ వారికిం
గారా మైనతనూజులున్ బతులు దుఃఖం బాఱ గోదావరీ
వారిం దీర్థములాడి కాంచిరి జగద్వంద్యుం బురారాతి ద
క్షారామాధిపు భీమనాయకుఁ ద్రిలోకాహ్లాదసంధాయకున్.

158


వ.

తదనంతరం బాభరద్వాజాదిమహామునులు శివున కర్ఘ్యపాద్యాచమనీయార్థంబు భీమనాథమహాదేవునిసమీపంబున గోదావరీవాహినిం బ్రవహింపఁజేయువారై ప్రారంభించి.

159


సీ.

పంచభూతముయంబు పరమపంచబ్రహ్మ, తత్త్వతేజస్సముద్భాసితంబు
పంచాక్షరీమహాపరమమంత్రమూలంబు, శాశ్వతం బజరం బనశ్వరంబు
భైమేశ్వరంబు శోభన మాదిమధ్యాంత, శూన్యంబు సకలంబు శుద్ధబుద్ధ
మనవద్య మదచ్ఛ్యే మక్షోభ్య మఖిలది, గ్దేశకాలాపరిక్షీణ మనఘ


తే.

మంబరము మోచి యున్నలింగంబుఁ జూచి, సంప్రతిష్ట యొనర్పంగ సమ్మతించి
కాల మీక్షించి తగినలగ్నంబుఁ జూచి, సకలసంభారనిచయంబు సంగ్రహించి.

160


తే.

గౌతమీగంగఁ బాపి యిక్కడికి నొక్క, సిద్ధవాహినిఁ బ్రవహింపఁజేసి కాని
లింగసంస్థాపనంబుఁ గల్పింపమనుచుఁ, బరమసంయము లేడ్వురుఁ బ్రతినవట్టి.

161


సీ.

ఆలగ్నవేళకు నమృతదివ్యస్వయం, భూమహాలింగైకమూర్తియైన
శ్రీభీమనాథుని శీతాంశుశేఖరు, నభిషేక మొనరింప నభిలషించి
కదలి సప్తర్షులు గౌతమాదులు శిష్య, సహితంబు కడుభక్తిసంభ్రమమున
దక్షవాటీపురస్థానంబునందుండి, యేగి యంతంతఁ గట్టెదురఁ గనిరి


తే.

గౌతమీగంగ నాలోలఘనతరంగఁ, గేలిడోలావిహారసంక్రీడమాన
చక్రవాకబకక్రౌంచసారసాళి, హంసకారంఢవాదిమాద్యద్విహంగ.

162


క.

గౌతమకన్యాతటినిన్, బ్రీతిఁ బయఃపాన మాచరించిన మనుజ
వ్రాత మొనర్పదు మరల, న్మాతృపయోధరపయఃకణాస్వాదనమున్.

163


వ.

అని మునీంద్రులు తమలోన వెండియు నొండొరులం గనుంగొని.

164


తే.

కంటిరే ఘోరపాతకౌఘముల నెల్లఁ, గడిమి జంకించుచున్నది గంగ యిపుడు
వీచికాహస్తవిన్యాసవిభ్రమముల, ఘుమఘుమధ్వానహుంకారఘోష మెసఁగ.

165