Jump to content

పుట:భీమేశ్వరపురాణము.pdf/108

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

88

శ్రీ భీమేశ్వరపురాణము


సీ.

కమ్మినూకిననూత్నకలధౌతమునుబోలెఁ, జక్కంగ నిక్కి మై సొక్కు మానె
నంతరాంతరములం దస్థిబృందంబులు, పెళపెళమనియెడు గిలకు లెసఁగెఁ
బగిలి బీటలువాఱి శతగడెత్తెఁ గుబుసంబు, తోరంపు వెల్లుల్లితునకలట్ల
మహనీయతరఫణామండలంబులు లేఁత, చిగురుటాకులఛాయ జేగురించె


తే.

హాటకాద్రిధనుర్దండకూటకోటి, వంచి బాహావలేపదుర్వారలీలఁ
గాలకంఠుండు త్రిపురసంక్షయ మొనర్ప, నెక్కువెట్టినయపుడు భోగీశ్వరునకు.

130


క.

ముక్కంటి మేరుచాపం, బక్కిడి నారించెఁ బన్నగేంద్రగుణంబున్
మక్కువ హిమగిరికన్యక, క్రిక్కిఱిసిన కుచము లలము కేలుందమ్మిన్.

131


క.

తాటించి నిటలనయనుఁడు, హాటకగిరిచాపవల్లి నహిశింజిని నా
స్ఫోటించెఁ దత్కఠోరమ, హాటంకృతి కమలజాండ మటఁ బగులంగన్.

132


మ.

గిరిశస్థూలభుజాపరీతవిభవక్రీడాసమాస్ఫాలిత
స్థిరబాణాసనగూఢపాద్గుణలతాదీర్ఘోగ్రఘోషంబునన్
ధరణీచక్రము దిద్దిరం దిరిగెఁ బాతాళంబు ఘూర్ణిల్లె నం
బరముం దిక్కులు వ్రయ్యలయ్యెఁ బగిలెన్ బ్రహ్మాండభాండంబులున్.

133


క.

మృడుఁడు కనకాద్రిచాపము, గుడుసువడం దివియ గూడి కుశలప్రశ్నం
బడిగిరి యొండొరులను గని, కడకొమ్ముల నున్నయదితికద్రువతనయుల్.

134


క.

తెగనిండ ఫాలనయనుఁడు, నగచాపము దిగిచినపుడు నాగేంద్రుం డ
బ్బిగువున మొగంబు లదరుటఁ, బొగ లెగయఁగ విషము భుగులుభుగులనఁ గ్రక్కెన్.

135


క.

విషధరపరివృఢనాసా, సుషిరవినిశ్వాసపవనఛూత్కారరవ
ద్విషవహ్నిజ్వాలంబులు, వృషభధ్వజుచేతి కొండవింట జనించెన్.

136


క.

శ్రీకంఠకఠినభుజపరి, ఘాకృష్టసువర్ణగిరిశరాసన మౌర్వీ
కాకోదరముఖసంభవ, కాకోలానలము ముజ్జగము దరికొనియెన్.

137


క.

కటకాముఖహస్తంబున, నిటలాక్షుఁడు కొండవిల్లు నెవ్వడిఁ దివియన్
ఘటియిల్లె నురగరాజ, స్ఫటహాలాహలకృపీటభవకీల లటన్.

138


వ.

ఇవ్విధంబున భీమనాథుండు త్రిపురదమనారంభసంరంభంబున శాతకుంభకుంభినీధరకోదండం బుద్దండభుజాదంచండిమంబునఁ గుడుసుపడం దిగిచినఁ దత్సమాకృష్టభారంబున భుజంగపుంగవుండు వేయుపడగలను విషంబుఁ గ్రక్క దృక్కర్ణవదననాసారంధ్రసముదీర్ణసంభవం బయినయక్కాలకూటవిషంబు కృపీటభవజిహ్వాకలాపంబులు గ్రోయుచుఁ దోయధిమథనంబున సంభవించినహాలాహలంబునుం బోలెఁ బ్రజ్వరిల్లి సముజ్జ్వలజ్వాలాజాలంబుల ద్రైలోక్యంబు నాక్రమింపందొణంగినం దెగ యుడిపి ఖట్వాంగపాణి యుత్తమాంగంబు జాడించి