పుట:భీమేశ్వరపురాణము.pdf/107

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము

87


రించిన చందంబున నందం బగుమందాకినీసలిలపూరసంభరితం బైనశాతకుంభకుంభంబునుఁబోని కిరీటకటాహంబును, జంద్రఖండంబులుమూఁగినభంగి నంగీకరించిన యకించన శశాంకరేఖాలంకారంబును, జెంగలువ ఱెక్కడాలుఁ జక్కనేలిన కేలి యంగుటంబునం జనమత్ఖురపుటంబుల మోపి నింగికి నెగయ నంజచాఁచులీలాకురంగశాబకంబును గనుపట్టు సర్వకళారూపంబు ధరియించి సర్వమంగళాకుచకలశలేపనానైపుణ్య కుంకుమాంగరాగవాసనాసనాథంబును, గరళకూటపావకోత్పత్తినిరస్త మణికులప్రశస్తంబును నైన శ్రీహస్తంబు విస్తరించి యభయంబు ప్రసాదించి సజలజలధరధ్వానగంభీరోదారంబైన కంఠస్వనంబున నిట్లని యానతిచ్చె.

123


మ.

అరవిందాసనతార్క్ష్యవాహనసహస్రాక్షాదిబృందారకుల్
చిరకాలంబును బడ్డపాట్లు మదిలోఁ జింతించుచున్నాఁడ ని
ర్భరదర్పోద్ధతులం బురాసురుల నే భంజించెదన్ మీరునుం
బరిపాటిన్ ననుఁ గొల్చి రండు సమరప్రారంభసన్నద్ధులై.

124


ఆ.

అని ముహూర్తమాత్ర మద్దేవతాచక్ర, వర్తి దక్షువాటివల్లభుండు
మనమునందుఁ దలఁచె మననాంధకారాతి, శత్రునగరవిజయసాధనంబు.

125


వ.

అనంతరంబ తదభిజ్ఞానప్రభామహామహిమంబునఁ దదాజ్ఞాతిశయంబున.

126


సీ.

జలరాశిమేఖలావలయంబు రథ మయ్యె, రవియుఁ జందురుఁడుఁ జక్రంబు లైరి
శారదాజీవితేశ్వరుఁడు సారథి యయ్యె, శ్రుతులు నాలుగును వారువము లయ్యెఁ
బ్రణవమంత్రైకాక్షరము ప్రతోదం బయ్యెఁ, దారకావీధి పతాక మయ్యె
రత్నసానుధరాధరము ధనుర్లత యయ్యె, నాగప్రధానుండు నారి యయ్యె


తే.

గంధవాహంబు లేడును గఱులు గాఁగ, విలయకాలానలజ్వాల ములికి గాఁగ
లచ్చిచనుదోయికుంకుమబచ్చనయుగఁ, బాలమున్నీటియల్లుండు బాణ మయ్యె.

127


వ.

ఇవ్విధంబున సకలసాధనంబులు సన్నిహితంబు లైనక్షణంబ దక్షారామంబున నయనాభిరాముండు భీమేశ్వరుండు త్రిపురవిజయార్థంబు దివ్యస్యందనం బెక్కె నప్పుడు.

128


సీ.

సరిబ్రాహ్మి మొదలైన సప్తమాతృకలు ద, న్గూడ సేసలు చల్లె గోఁగులమ్మ
పసిఁడివేత్రము పట్టి పాతాళభైరవుం, డందంద సందడి నపనయించె
దివ్యదుందుభినాదదీర్ఘగర్జితముతోఁ, గురిసె మిన్నుననుండి కుసుమవృష్టి
జయజయధ్వని దేవ సంయమీశ్వరకోటి,సంఘటించెఁ గరాంబుజంబు నొసలఁ


తే.

ద్రిపురసంహార మొనరింప దీక్ష చేసి, భీమనాథేశ్వరేశ్వరస్వామి శివుఁడు
దక్షవాటీవిభుఁడు మేరుధనువు వట్టి, యేచి పంటవలంతితే రెక్కు నపుడు.

129