పుట:భీమేశ్వరపురాణము.pdf/10

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

vi

వ్రత మొకటికలదు. అది యేదియందురేని మేము ప్రకటించు గ్రంథములయం దాయా గ్రంథకర్త లేపదములు ప్రయోగించియుందురో వానిని సాధ్యమైనంతవఱకు నూహించి వేయవలయుననేకాని మాకుం దెలియనిచోట్ల నుండు నక్షరములఁదీసి పాఱవైచి మాకవిత్య మిఱికింపఁగూడ దనుటయే. ఈ నిర్బంధమునకు లోనైన మే మీవినాయకస్తుతింగల పద్యముంగూర్చి పడినకష్ట మా వినాయకునకే యెఱుక. ఇట్టి కష్టము లీగ్రంథమం దెన్నియో యుండినవి. వానినెల్ల శ్రీజ్ఞానప్రసూనాంబ కరుణచేతను బెద్దలసహాయమువలనను గడచి నేఁటి గ్రంథముఁ బ్రకటింపఁ గంటిమి.

ఇది పంచాశత్ఖండమండితం బగు స్కాందంబులోని యొక ఖండము. భీమఖండము నాఁబడు. గోదావరిజిల్లాలోని దక్షారామము లేక భీమేశ్వరం బనునొకశివస్థలమాహాత్మ్యముం దెలుపునది. ఆస్థలంబునకు దక్షిణకాశియను సంజ్ఞయుఁ గలదు. అది భోగమోక్షదం బని ప్రసిద్ధిఁ గాంచినది. దేవభాషయందు ముప్పదిరెండు సర్గలుగా విభజింపఁబడి యించుమించుగా రెండువేల శ్లోకములుగల యీ గ్రంథమును నాంధ్రంబున శ్రీనాథుఁ డను మహాకవి యాఱాశ్వాసముల గ్రంథముగ విరచించె.

శ్రీనాథుఁడు పాకనాటి నియోగిబ్రాహణుఁడు. భారద్వాజసగోత్రుఁడు నాపస్తంబసూత్రుఁడు బ్రాహీవరప్రసాదలబ్ధుఁడును శివపూజారతుండు. ఈయన తల్లిదండ్రులు భీమాంబయు మారయయు. తాత పద్మపురాణంబును రచించిన కమలనాభామాత్యుఁడు. వీనికిం బ్రమాణంబు లెవ్వియనిన:—


శా.

భారద్వాజపవిత్రగోత్రుని శుభాపస్తంబసత్సూత్రు వి
ద్యారాజీవభవుండు మారయకుఁ బుణ్యాచార భీమాంబకు
న్గారామైనతనూజు న న్ననఘు శ్రీనాథాఖ్యునిం బిల్చి స
త్కారం బొప్పఁగ గారవించి పలికె న్గంభీరవాక్ప్రౌఢిమన్.

నైషధము


శా.

బ్రాహ్మీదత్తవరప్రసాదుఁడ వురుప్రజ్ఞావిశేషోదయా
జిహ్మస్వాంతుఁడ వీశ్వరార్చనకళాశీలుండ నభ్యర్హిత
బ్రహ్మాండాదిమహాపురాణచయతాత్పర్యార్థనిర్ధారిత
బ్రహ్మజ్ఞానకళానిధానమవు నీభాగ్యంబు సామాన్యమే.

నైషధము


మ.

కనకక్ష్మాధరధీరు వారిధితటీకాల్పట్టణాధీశ్వరున్
ఘనుని న్బద్మపురాణసంగ్రహకళాకావ్యప్రబంధాధిపున్
వినమత్కాకతిసార్వభౌముఁ గవితావిద్యాధరుం గొల్తు మా
యనుఁగుందాతఁ బ్రదాత శ్రీకమలనాభామాత్య చూడామణిన్.

భీమ