Jump to content

పుట:భాస్కరరామాయణము.pdf/633

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


పరఁగ నెప్పటిహవిర్భాగముల్ చెందఁ [1]గాం, చుటను దివౌకులస్రుక్కు దీరె
యక్షకిన్నరగుహ్యకయాతుధాన, పక్షిఖేచరచారణపన్నగాదు
లరయ నూఱటఁ బొంది రత్యనుపమాన, సమ్మదామృతరసపూరసహితు లగుచు.

2244


వ.

మదీయజనకుం డైనమయుండును మహితమాయామతి యగుమారీచుండును
హితోపదేశగుణవంతుం డగుమాల్యవంతుండును బరమార్థభాషణుం డగువిభీష
ణుండును స్వామిభక్తిపవిత్రు లగుమిత్రులును భవదేకశరణ నగునేనును జెప్పినట్టిహి
తవాక్యంబులు వినవయితి వది యేల తప్పు నని యడలుచు డెందంబున నెవ్వగ
నివ్వటిల్ల సైరింపంజాలక పయిం బడి మూర్ఛిల్లి తెలిసి పతిహస్తంబులు తన
యురస్స్థలంబునం గదియించుచుఁ దదీయకపోలసమాఘ్రాణంబు సేయుచుఁ
దన్మస్తకంబులు దనయంకంబునం దిడుచు విశిఖవిశకలితం బగుతదీయోరస్స్థ
లంబునందుఁ దనయురం బదుముచు నో యసురేశా మదిరామదఘూర్ణాయ
మాననేత్రకమలంబులును జాటువాదచతురంబులును మందస్మితసుందరంబు
లును గనత్కనకమణికుండలమండితంబులును మత్పీతలలితాధరామృతంబులు
ను మద్విరచితహరిచందనకస్తూరికాఘనసారరుచిరతిలకలలాటంబులుం గలుగు
మొగంబులు వాంచి నాకు మొగమీక మొగమోట దక్కం దగునే దిక్కరిక
రాకారంబులును బందీకృతబృందారకసందోహదారకచభారమందారకుసుమ
మకరందబిందుపరాగరాగరూషితంబులును సకలసురాసురవిజయమహాక్రతు
యూపంబులును గైలాససముద్ధరణవిలాసవిలసితంబులును మదీయకబరీసుర
భికుసుమసురభీకృతకరరుహంబులును ద్రిభువనవిజయశ్రీవిహారాగారమూల
స్తంభంబులును సమస్తప్రహరణకృతశ్రమంబులును వీరలక్ష్మీవేణికాభిరామ
జ్యాఘాతకిణశ్రేణిసనాథంబులు నగుకరంబులు రామశరనికృత్తంబు లై నేలం
గూలెఁ గుంఠీకృతవజ్రపాణిప్రముఖదిగీశసురాసురదివ్యాస్త్రంబును దళితైరావ
ణాదిహరిత్కరిదంతకాండప్రకాండంబును నతివిపులంబును నగునురస్స్థలం బ
త్యంతరణశ్రీపరిరబ్ధం బయ్యె నక్కటా నీయట్టిశూరాగ్రేసరునకును [2]నిట్టివి
ధంబు గలిగె నింక నెవ్వరి ననవచ్చు నాతోఁ గూడి వీరె చూచితే విజిత
చతుర్దశభువనుండును రాక్షసకులసార్వభౌముండును నగునీదుకాంత లంతిపు
రంబు వెడలి సకలజనంబునుం జూడ నిట వచ్చియున్నవారు వీరల నభ్యంత
రంబులకుం బొం డని వీడ్కొలుపం దగదే పవనాతపస్పర్శంబు లనుభవింపని
మేనులకు నిప్పు డవి దొరకొనియె నెట్లు సైరింపవచ్చు నానతి లేక వచ్చినా
రని కినిసి యీశ పలుక నొల్లవొకొ యని మఱియు ననేకవిధంబుల విలపించు
చున్నమందోదరిం జూచి విభీషణుం డడలు గడలు కొన బాష్పపర్యాకులనయ
నుం డై యేడ్చుచు గద్గదస్వరంబున ని ట్లనియె.

2245
  1. గాంచుటకు దిక్పాలురస్రుక్కు దీఱె
  2. నిట్టినిధనంబు .... నెవ్వరి నమ్మవచ్చు