Jump to content

పుట:భాస్కరరామాయణము.pdf/604

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రామరావణుల తృతీయయుద్ధము

చ.

రథవరనేమిఘట్టనతురంగఖురక్షతధూళి గ్రాలఁగాఁ
బృథివి పగిల్చి [1]బంగరపుఁబింజలయమ్ములు లీల నేయుచుం
గ్రథనతలాతినిష్ఠురత రాఘవుఁ డెంతయు మెచ్చునట్లుగాఁ
బ్రథితసముద్ధతిన్ మెఱసి రాక్షసముఖ్యుఁడు పోరె నెంతయున్.

2005


మ.

జలదాకారుఁడు రాఘవుండు విపులజ్యానాదగర్జారవా
కులితానేకకులాచలుం డయి చలత్కోదండపాండిత్య మి
మ్ములఁ బెంపారఁగ బాణవర్షముల నంభోజాసనాండంబు నిం
డ లసద్విక్రమ మొప్పఁగాఁ గురిసె నీడంబోక యాదైత్యుపైన్.

2006


చ.

పటుతరసాహసుం డగునృపాలకుఁ డేయుశిలీముఖంబు లొ
క్కట వడితోడ నేఁగి దశకంఠుముఖాంబుజషండమున్ సము
త్కటభుజకాననంబును నుదంచితహృత్కమలాంతరంబుఁ బ్ర
స్ఫుటతరభంగిఁ జెండె సురపూగము సంతస మంది చూడఁగన్.

2007


మ.

అసురాధీశ్వరుఁ డేయుబాణములు సర్పాకారఘోరంబు లై
విసరత్తీవ్రవిషానలంబు లెగయన్ విఖ్యాతఫూత్కారని
శ్వసితారావము భూనభోంతరముఁ బర్వం జేరఁగా వచ్చి య
వ్వసుధావల్లభువైనతేయవిశిఖవ్రాతంబులం దూలఁగన్.

2008


క.

ఆగ్రహమున భువనత్రయ, నిగ్రహకరుఁ డైనయామినీచరుసుమహ
ద్విగ్రహము గాఁడ నేసెను, విగ్రహదక్షుఁడు రఘుప్రవీరుం డలుకన్.

2009


క.

క్షుణ్ణారితూణసుషిరని, షణ్ణాస్త్రభుజంగమములు జనపతిమేనన్
షణ్ణవతిసంఖ్య నేసె వి, షణ్ణత యొదవంగ రాక్షసప్రభుఁ డంతన్.

2010


చ.

రథగతుఁ డై తనర్చి సమరంబు నుదగ్రతఁ జేయురావణుం
బృథివిఁ బదాతి యై యరివిభీషణుఁ డై యని నిల్చు రాఘవుం
బృథుతరవిస్మయక్రమము [2]పెం పొనరంగను జూచి దిక్పతి

  1. “హేమమయపుంఖశరంబుల' వ్రా. ప్ర.
  2. ‘పొంపిరివోవఁగఁ జూచి' వ్రా. ప్ర. ఈకవి ఋకారముతోడ నుకారమునకు యతిమైత్రి పాటించినట్లు చూపట్టుచున్నది. ఈ కాండముననె 1895వ పద్యమునఁ 'గృతకోదంచితమత్స్యమై యతఁ డతిక్రూరాత్ము నాక్రవ్యభుక్పతి' అని యున్నది. 'అతిక్రూరాత్ము' ననుటను 'అతిక్లేశాత్ము' నని పండితులు దిద్దిరి. 1930వ సీసమున 'వరవసంతుఁడు లేని వనలక్ష్మికైవడి, ద్రుమముతోఁ బాసినతీఁగఁ బోలి' అని యున్నది 'ధృతిఁ దరువును బాయుతీఁగ యనఁగ' నని మార్పఁబడినది. 2005వ చంపకమునఁ 'బృథిని పగిల్చి హేమమయపుంఖశరంబుల' నని యున్నది. ఇది 'పగిల్చి బంగరపుఁబింజలయమ్ముల' నని మార్పఁబడెను, 2011వ చంపకంబునఁ 'బృథుతరవిస్మయక్రమము పొంపిరివోవఁగ' నని యున్నది 'క్రమము పెంపొనరంగ' నని మార్పఁబడెను.