పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/197

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌నశీర్‌అహమ్మద్‌

నర్సరీలు, ఖాదీ కార్ఖానాలు, కుటీర పరిశ్రమలు, చేతివృత్తులలో శిక్షణ ఇచ్చే శిక్షణాలయాలను స్థాపించారు. ఈ కార్యక్రమాల వలన వేలాది అవసరార్థులకు పని లభించింది. ఎంతో మంది మంచి శిక్షణ పొంది ఆర్థిక పరిస్థితులను మెరుగుపర్చుకోవటం స్వయంగా గమనించిన ఆమె తన తలితండ్రుల ద్వారా లభించిన ఆస్తిపాస్తులు ఇంతమంది జీవితాల్లో వెలుగు నింపుతున్నందుకు ఎంతో సంతోషించారు.

జాతి సమైక్యత, సమగ్రతలను పటిష్ట పర్చేందుకు, హిందూ ముస్లింల మధ్యన ఐక్యతా భావనలను ప్రచారం గావించేందుకు, సస్నేహపూరిత వాతావరణం పటిష్టం చేయాలని సంకల్పించిన ఆమె హిందూస్థాన్‌ అను ఉర్దూ పత్రికను నడిపారు. ఈ పత్రిక ద్వారా గాంధేయ సిద్ధాంతం మహాత్ముని ఉపదేశాల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారకార్యక్రమంలో భాగంగా ఆమె పలు రాష్ట్రాలలో పర్యటించటం మాత్రమే కాకుండ జపాన్‌ లాంటి దేశాలకు కూడ వెళ్ళివచ్చారు. ఈ సందార్భంగా మాతృభాష ఉర్దూ కాకుండ పంజాబీ, ఒరియా, బెంగాలి, తెలుగు, తమిళం, ఆంగ్లం, జపానీస్‌ భాషలను ఆమె నేర్చుకున్నారు.

1961లో తొలిసారిగా భారత దేశం వచ్చిన ఖాన్‌ అబ్దుల్‌ గఫార్‌ ఖాన్‌ వెంట ఉండి ఆయనకు సేవలందాచేశారు. ఆయనతోపాటు దేశవ్యాప్త పర్యటనలో పాల్గొన్నారు. 1962లో చైనాతో యుద్ధం వచ్చినప్పుడు దత్త కుమారుడు సునీల్‌ కుమార్‌ సహాయంతో మన వీర జవానులకు సేవలందించారు. హెలికాప్టర్‌ ద్వారా నేఫా తదితర ప్రాంతాలు పర్యటించి ఆహారం, దుస్తులు, మందులు అందచేశారు. 1965 నాటి పాకిస్థాన్‌ యుద్ధం సందార్భంలో కూడ ఆనారోగ్యాన్ని కూడ లెక్కచేయక లద్దాఖ్‌ ప్రాంతంలో ఉన్న మన సైనిక యోధులకు ఆహారం, దుస్తులు తదితర సదుపాయాలను కలుగజేశారు.

ఈ మేరకు ఒకవైపున నిరంతరం అనారోగ్యంతో పోరాటం సాగిస్తూ మరోవైపున బ్రిటిషు పాలకులతో పోరులో ముందుకు సాగుతూ, ఆ తరువాత సామాజిక సమస్యల పరిష్కారం కోసం శ్రమిస్తూ జీవిత చరమాంకం వరకు గాంధేయ మార్గంలో సమరశీల జీవితాన్ని గడిపిన బీబీ అమతుస్సలాం 1985 అక్టోబర్‌ 29న కన్నుమూశారు.

194