పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌నశీర్‌అహమ్మద్‌

మతసామరస్యం కోసం తీవ్రంగా కృషిచేసిన బేగం మజీదా బానో, హింద్‌ పత్రికను నడుపుతూ జాతీయభావాలను ప్రోత్సహించిన బేగం ఖుర్షిద్‌ ఖ్వాజా మన హైదరాబాది మహిళ కావడం మనకు గర్వకారణం. బ్రిటీష్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన ఈ ధీరవనిత జీవితవిశేషాలు నేటి తరానికి స్ఫూర్తినిస్తాయని నిస్సందేహంగా చెప్పవచ్చు. పత్రికలు నడిపిన నాటి ముస్లిం మహిళల్లో మరొకరు బీబీ అమతుస్పలాం. ఆమె హిందూస్తాన్‌ పత్రికను స్థాపించి జాతీయసమైక్యత, సమగ్రతల కోసం విశేష కృషిచేశారు. వివిధరంగాల్లో తమదైన ప్రత్యేకతను నిలుపుకుంటూ, దేశసేవ చేసిన ఈ మహిళల జీవితగాధలను పాఠకులకు అందించడం ద్వారా రచయిత, దేశంలోని వివిధ వర్గాల మధ్య సదవగాహనకు తోడ్పడే పుస్తకాన్ని ప్రచురించారు. అంతేకాదు, ముస్లిం మహిళలు ఇంటి నాలుగు గోడలకే పరిమితం అన్న అపోహను కూడా ఈ పుస్తకం పటాపంచలు చేస్తుంది.

ఈ విధంగా మన పూర్వీకులు జీవితవిశేషాలను అందించే రచనల్లో చారిత్రక సమాచారంతోపాటుగా పాఠకులకు విసుగు లేకుండా చదివించగల చక్కని రచనా శైలి చాలా అవసరం. ఈ రెండు అంశాలు ఈ గ్రంథంలో పుష్కలంగా కన్పిస్తున్నాయి. చదువరులను కట్టిపడేసే ప్రవాహశీల శైలితో సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ ఈపుస్తకం లోని సమాచారాన్ని పాఠకులకు అందించారు. అవసరమైన చిత్రాల ద్వారా అదనపు సమాచారాన్ని కూడా అందివ్వడం రచయితగా ఆయనకున్న నైపుణ్యానికి నిదర్శనం. సరికొత్త సమాచారం, చక్కని అరుదైన చిత్రాలు, ఫోటొలతో కూడిన ఈ చరిత్ర గ్రంథం మూడవ ముద్రణగా వెలుగు చూస్తుందంటే చరిత్ర గ్రంథాలకు పాఠకుల ఆదరణ తక్కువనే అభిప్రాయం తప్పన్పిస్తుంది. ఈ పుస్తకం మూడవసారి పాఠకుల చెంత చేరటం ద్వారా పాఠకాదరణ ఏ మేరకు లభించిందో వేరేగా చెప్పనక్కర్లేదు. ఈ నూతన గ్రంథానికి కూడా అంతకంటె అత్యధిక ఆదరణ తప్పక లభించగలదని ఆకాంక్షిస్తూ, ఉత్తమ అభిరుచి గల పాఠకులు ఆ ఆకాంక్షను తప్పక నెరవేర్చగలరని ఆశిస్తాను. భారత స్వాతంత్య్ర సంగ్రామంలో ముస్లింల మహత్తర పాత్రను వివరిస్తూ శరపరంపరగా చరిత్ర గ్రంథాలను రాస్తున్న శ్రీ సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ కలం ద్వారా ఇలాంటి ఉపయుక్త గ్రంథాలు మరెన్నో వెలువడాలని, తెలుగు భాషలో చరిత్రపరిశోధనకు ఆయన గ్రంథాలు కొత్త అధ్యాయాన్ని లిఖించాలని, ఆ గ్రంథాలు స్వాతంత్య్ర సంగ్రామ చరిత్రకు సంబంధించిన సాహిత్యాన్ని మరింతగా సుసంపన్నం చేయాలని కోరుతూ ఆ దిశగా సాగుతున్న ఆయన ప్రయత్నాలను మనసారా అభినందిస్తున్నాను.

8