పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/106

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విముక్తి పోరాటంలో అరెస్టయిన తొలి ఢిల్లీ మహిళ

మహబూబ్‌ ఫాతిమా

పరదా చాటున జీవితాలు గడిపే కులీన వర్గానికి చెందిన ముస్లిం ఆడపడుచులు బ్రిటిష్‌ వ్యతిరేక పోరాటాలలో బహిరంగంగా రంగం మీదకు రావటం జాతీయోద్యమ ప్రారంభ దినాలలో చాలా విశేషం. ఆనాడు ఏ సాంఫిుక జనసముదాయానికి చెందిన మహిళలైనా జైలుకు వెళ్ళడానికి అంతగా ముందు కొచ్చేవారు కారు. అటువంటి వ్యతిరేక వాతావరణంలో శ్రీమతి మహబూబ్‌ ఫాతిమా ఢిల్లీలో అరెస్టయ్యి జైలుకెళ్ళి సంచలనం సృషించారు.

జాతీయోద్యమం పరవళ్ళుతొక్కుతున్న సమయమది. మాతృభూమి విముక్తి పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములవుతున్న కాలమది. ఆ వాతావరణంలో ఫాతిమా ఇంట్లో కూర్చోని ఉండలేకపోయారు. ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలలో ఆమె పాల్గొన్నారు. ఆనాడు మహిళలు అరెస్టులు కావటం, జైలు కెళ్ళటం విశేష వార్త. అటువంటి విసేషమైన వార్తకు ఆమె కారకులయ్యారు.

1919లో జనరల్‌ డయ్యర్‌ జలియన్‌ వాలాబాగ్‌లో వందాలాది దేశభక్తులను బలి తీసుకున్నాడు. ఆ కిరాతక చర్యకు బలైన అమరయోధులను స్మరించుకుంటూ, ప్రతి ఏడాదిలా 1932 ఏప్రిల్‌21న జలియన్‌వాలాబాగ్‌ అమరవీరుల దినోత్సవం జరిగింది. ఆ రోజును పురస్కరించుకుని ఢిల్లీలోని చాందినీ చౌక్‌లో కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమంలో పాల్గొన్న మహబూబ్‌ ఫాతిమా ప్రభుత్వ వ్యతిరేక నినాదాలిచ్చారు. అందుకు ఆగ్రహించిన పోలీసులు ఆమెను అరెస్టుచేసి కోర్టులో హాజరుపర్చారు.

బ్రిటిష్‌ కోర్టులో న్యాయపోరాటం చేయడానికి ఫాతిమా తిరస్కరించగా ఆమెకు ఆరు మాసాల జైలు శిక్ష, 50 రూపాయల జరిమానా విధించారు. ఈ వార్తను బిజనోర్‌ నుండి ప్రచురితమయ్యే 1932 ఏప్రిల్‌ 25 నాటి మదీనా అను ఉర్దూ పత్రిక శిక్షకు గురైన తొలి ఢిల్లీ ముస్లిం మహిళ శీర్షికతో ప్రత్యేకంగా ప్రచురించింది.

103