పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భారత స్వాతంత్రోద్యమం:ముస్లిం మహిళలు

మహిళలు ఇలా వివిధ కాలాల్లో, విభిన్న రూపాల్లో, భిన్నపోరాటాల్లో పాల్గొన్న ముస్లిం మహిళల పాత్రల వైనం ఈ పుస్తకం ద్వారా తెలుస్తోంది. ముస్లిం మహిళలు చరిత్రలోని ప్రతి దశలోను, ప్రతి సందర్భంలోను వెల్లడించిన తమ దేశాభిమానాన్ని, స్వాతంత్య్రకాంక్షను, జాతి కోసం ప్రాణాలర్పించే త్యాగనిరతిని రచయిత ఈ పుస్తకం ద్వారా పాఠకులకు తెలియజేశారు. ఈ ప్రయత్నం దేశంలో విభిన్న వర్గాలు ఒకరి త్యాగమయ చరిత్రను మరొకరు తెలుసుకోవడానికి, ఒకరి పట్ల మరొకరు ఆదరాభిమానాలు పెంచుకోవడానికి ఎంతైనా ఉపయోగపడుతుంది. సరిగ్గా ఈ అభిప్రాయాన్నే రచయిత తన లక్ష్యంగా నిర్దేశించుకోవటం అభినందనీయం.

ఈ పుస్తకంలో పొందుపరిచిన వివిధ ముస్లిం స్త్రీల పోరాటమయ జీవిత చరిత్రలను పరిశీలిస్తే మనకు అనేక విషయాలు అవగాహనకు వస్తాయి. ప్రథమ స్వాతంత్య్రసంగ్రామంలో పాల్గొని బ్రిటీష్‌ సైన్యాలను ఎంతో వీరోచితంగా ఎదుర్కొని, ఆత్మబలిదానాలతో విముక్తి పోరాటాలను సుసంపన్నం చేసిన బేగం హజరత్‌ మహాల్‌, బేగం అజీజున్‌, తిరుగుబాటు యోధుల రహస్యాలను వెల్లడించ నిరాకరించి సజీవ దహనానికి సిద్ధపడిన ఆక్బరీ బేగం, ఆయుధాలు చేతపట్టి పోరాటంతో శత్రుసైని కులను ఎదుర్కొన్న పలువురు సామాన్య మహిళలు ఈ గ్రంథంలో మనకు దర్శన మిస్తారు. జాతీయోద్యమంలో పాల్గొన్న షఫాతున్నీసా బేగం లాంటి వారు భారత విభజనను తీవ్రంగా వ్యతిరేకించిన వైనం పుట్టినగడ్డపై వారిరకున్న మమకారాన్ని చాటిచెబుతోంది. అంతేకాదు, భారతవిభజనను అధికసంఖ్యాక ముస్లిములు ఇష్టపడలేదన్న వాస్తవాన్ని కూడా తెలియజేస్తుంది. అలాగే, సహాయనిరాకరణలో భాగంగా ప్రభుత్వ గ్రాంటులతో నడిచే విద్యాసంస్థల నుంచి విద్యార్థులను బయటకు రావాలని గాంధీజీ పిలుపు ఇచ్చినప్పుడు జాహిదా ఖాతూన్‌ షేర్వానియా లాంటి మహిళలు ఈ వైఖరిని నిరసించారు. విద్యాభ్యాసం చేయవలసిన విద్యార్థులు విద్యాలయాలను బహిష్కరిస్తే వారి చదువులు ఎలా సాగుతాయని, వారి భవిష్యత్తు ఏమిటని మహాత్ముడ్నే ప్రశ్నించారు. ఈ ప్రశ్న ఆనాటి మహిళల ముందుచూపు, అవగాహనలను మనకు పరిచయం చేస్తోంది. ఈ విధంగా స్వాతంత్య్ర సంగ్రామంలో, ప్రజాపోరాటాలలో మహత్తర పాత్రను నిర్వహించి చరిత్ర సృష్టించిన ముస్లిం మహిళల జీవితవిశేషాలు మన ముందుంచడం ద్వారా భారతీయ ముస్లిం జనసముదాయం, ముఖ్యంగా ముస్లిం మహిళల దేశాభిమానాన్ని, వారి పోరాట స్ఫూర్తిని పాఠకులకు అందించడంలో రచయిత చాలా వరకు కృతకృత్యులయ్యారు.

7