Jump to content

పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం ప్రజా పోరాటాలు.pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సయ్యద్ నశీర్ అహమ్మద్ 90

అను మోప్లా నాయకుని నేతృత్వంలో భూస్వామి కచ్చేరి మీద రైతులు దాడిచేయటంతో అరంభమైందనవచ్చు. ఆ దాడిలో కల్లిస్గల్ గాయపడ్డాడు. ఒకవైపు భూసమస్య, మరొకవైపు పీడన, జులుం, ఇంకొక వైపు పాలకవర్గాల అణచివేత చర్యలను ఎదుర్కొంటున్న మోప్లాలలో అధర్మం మీద పోరాటం చేయటం ధర్మబద్ధమని తంగల్స్ చేసిన ప్రచారం, వారిని మృత్యు కిరీటం ధరించి పోరుబాట నడిచేందుకు ప్రేరేపించింది. ఈ విధంగా 1837, 1839, 1840, 1841, 1843, 1849 సంత్సరాలలో మొత్తం మీద పది ప్రధాన తిరుగుబాట్లు జరిగాయి.
1849 ఆగస్టులో...
భూస్వాముల పెత్తనానికి వ్యతిరేకంగా గతంలో పలు పోరాటాలు నిర్వహించిన కుటుంబానికి చెందిన అతన్ గురుక్కల్ (ATHAN GURUKKAL) నాయకత్వంలో 1849 ఆగస్టు 25న తిరుగుబాటు ప్రారంభమైంది. రైతాంగం పట్ల క్రూరంగా వ్యవహరిస్తున్న పండిక్కడ్ నంబూద్రి జెన్మి కచ్చేరి మీదకు 15 మందితో కలసి వెళ్ళిన అతన్ గురుక్కల్, జెన్మి అక్రమ వసూళ్ళను ప్రశ్నించాడు. ఆ సందర్భంగా భూస్వామి తిన్నగా కచ్చేరి నుండి జారుకున్నాడు. ఆది గ్రహించిన మోప్లాలు మంజేరి రాజాను లక్ష్యంగా పెట్టుకుని, పండిక్కడ్ నుండి మంజేరికి పయనం కట్టారు. మోప్లాల దాడి గురించి తెలుసుకున్న బ్రిటీష్ సైనికులు, పోలీసులు కన్ననూర్, పాల్టాట్ నుండి మంజేరికి బయలుదేరాయి.
ఆ విధంగా మంజేరి చేరుకున్న మోప్లాలు ఒక ఆలయాన్ని స్థావరంగా మార్చుకుని, ప్రభుత్వ బలగాలను తరిమికొట్టారు. అనంతరం మంజేరికి 18 కిలోమీటర్ల దూరంలోనున్న అంగడిపురం గ్రామానికి 'లాంగ్ మార్చ్' ప్రారంభించారు. ఈ మధ్య మరికొంత మంది మోప్లాలు వచ్చి వారితో చేరారు. ఈ సంఖ్యతో మోప్లాలు 65 మంది అయ్యారు. మార్గం మధ్యలో మోప్లాలకు ముస్లిమేతర రైతు కుటుంబాలు, ప్రజలు సహాయ సహకారాలు అందించారు. ఆహార పదార్థాలు సమకూర్చి పెట్టారు. ఆయుధాలు సరఫరా చేశారు. ఈ మార్చ్ సాగుతుండగానే బ్రిటీష్ బలగాలు భారీ సంఖ్యలో సమీకృతమై మోప్లాల మీద దాడిచేసాయి. అసమాన ధైర్యసాహసాలతో మోర్గాలు పోరాడారు. బలగాలకు ఎదురెదురుగా నిలబడి తొడగొట్టి సవాల్ చేసి పోరు సాగించారు. వ్యవసాయ పనిముట్లు తప్ప ఎప్పుడూ ఆయుధాలు చేపట్టని రైతు బిడ్డలు అందుబాటులోనున్న సాంప్రదాయక ఆయుధాలు, కొద్దిపాటి తుపాకులతో తలపడ్డారు. ఆత్మవిశ్వాసం మాత్రమే ఆయుధాలుగా గల మోప్లాలు భీకరపోరు జరిపారు. శత్రవుతో పోరాడి నేలకొరగటమే లక్ష్యంగా గల మోప్లాలలో 64 మంది రణభూమిలోనే ఒరిగిపోయారు. ఒకరు గాయపడి శతృవుకు చిక్కారు. ఈ పోరాటంలో శత్రువర్గానికి చెంది 5గురు మరణించారు.
1849 నాటి తిరుగుబాటు తరువాత 1851, 1852, 1853, 1855, 1864, 1873, 1880, 1884, 1885 లలో జెన్మిల మీద వివిధ ప్రాంతాలలో 12 ప్రదాన తిరుగుబాట్లు జరిగాయి. ప్రతి తిరుగుబాటులో దాదాపు ఒకే రకంగా మోప్లాలు వ్యవహరించటం విశేషం. ఈ తిరుగుబాట్లు అన్నిటిలో మోప్లాలు చివరి వరకు పోరాడి అమరత్వాన్ని ఆహ్వానించారు.