సయ్యద్ నశీర్ అహమ్మద్ 88
అయినప్పటికీ చివరిదాకా పోరాటంలో పాల్గొంటానని, అధర్మం మీద సాగే పోరులో
ప్రాణాలను తృణప్రాయంగా భావించి అర్పించగలనని సహచరులకు వాగ్దానం చేస్తాడు.
చివరి రక్తపు బొట్టు నేలమీద పడేంతవరకు శత్రువును నిలువరిస్తూ పోరాడతానని, ఎటువంటి
స్థితిలో కూడా శత్రువు చేత చిక్కనని ప్రతిజ్ఞ చేస్తాడు. శత్రువు చేత చిక్కే పరిస్థితి వస్తే
ఆత్మాహుతికి సిద్ధమని ప్రకటిస్తాడు. బలమైన శత్రువును తొడగొట్టి సవాల్ చేసి, కవ్వించి
కదన రంగానికి రప్పించి, ద్వంద్వ యుద్ధం చేయటం, రణభూమిలో శత్రువుకు వెన్ను
చూపకుండా, ఆత్మార్పణకు సిద్ధం కాడానికి అంగీకారం తెలుపుతూ ధార్మిక ప్రతిజ్ఞ చేయడాన్ని
మౌలూద్ అన్నారు. ఒక రకంగా చూస్తే మౌలూద్ కూడా నేర్చా లాంటి మరో రకమైన
ప్రతినగా పరిగణించవచ్చు.
అమరత్వం అంతిమ లక్ష్యం
అక్రమంగా భూమి లాక్కున్న భూస్వాములను, అన్యాయంగా, అధర్మంగా వసూళ్ళు
చేస్తున్న భూస్వామి ప్రతినిధులను శిక్షించేంతవరకు మాత్రమే మోప్లాలు సఫలీకృతులయ్యేవారు.
అంతవరకే తమ లక్ష్యాలను నిర్దేశించుకునేవారు. ఆ తరువాత పోరాటంలో అమరత్వం
పొందటం చివరి గమ్యంగా నిర్ణయించుకునేవారు. ప్రజా కంటకుడైన జెన్మిని, అతనికి వత్తాసు
పలుకుతూ ప్రజలను పీడిస్తున్న మద్దతుదారులను అంతం చేసాక, ఈ శక్తులకు అన్నివిధాల
అండదండలందిస్తున్న ప్రభుత్వం తమను ఊరికే వదలి పెట్టదని, తమ చర్యల పట్ల తీవ్రంగా
వ్యవహరిస్తుందన్న విషయం మోప్లాలకు తెలుసు. అందువలన తొలుత జెన్మిల భరతం
పట్టేవారు. ఆ తరువాత అతనికి అండగా నిలచిన వత్తాసుదారుల, సంపన్న ధనికవర్గాల
వారి మీద దృష్టి సారించేవారు. చివరకు ప్రభుత్వం పంపించే పోలీసు-సైనిక బలగాలను
ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యేవారు.
ప్రధాన లక్ష్యాన్ని సాధించుకున్నాక, అంతిమ మజిలీ కోసం ఎదురు చూడటం మోప్లాల
తదుపరి కార్యక్రమం. ఈ దశ ఎంతో త్యాగపూరిత దశ. ఉద్వేగభరితంగా సాగే ఈ దశ
మోప్లాల పోరాట క్రమంలో ప్రత్యేకం. భరతగడ్డ మీద బ్రిటీషర్లకు వ్యతిరేకంగా సాగిన పలు
పోరాటాలకు భిన్నంగా ఉండటం ఈ కార్యక్రమం విశేషం. శత్రువు బలవంతుడని, తమకు
అంతిమంగా మరణం తప్పదని తెలిసినా, అన్నిటికీ సిద్ధమైన మోప్లా వీరులు అంతిమ
ఘడియ కోసం ఎదురుచూస్తూ గడుపుతారు. శత్రువును తునుమాడటం లేదా తమను
తాము అంతం చేసుకోవడానికి సమాయత్తమౌతారు.
జెన్మిల మీద ప్రతీకారచర్యలో పాల్గొన్న మోప్లా యోధులు, జెన్మిల విలాసవంతమైన
భవనాన్నో, శత్రువును ప్రతిఘటించేందుకు అనువుగా ఉన్న మరో స్థావరాన్నో, లేక విశాలంగా
ఉన్న ప్రార్థనాలయాన్నో ముందుగా ఎంపిక చేసుకుంటారు. ఈ ఎంపిక విషయంలో పలు
జాగ్రత్తలు తీసుకుంటారు. పోరాటంలో మరణించడానికి ఇష్టపడే మోప్లాలు, ఎలాంటి
పరిస్థితులలో శత్రువు చేత చిక్కకుండా ఉండాలన్న దృఢ సంకల్పబద్ధులై ఉంటారు కనుక,
తమ స్థావరాన్ని కూడా అందుకు అనుకూలంగా ఉన్నదాన్నే ఎంచుకుంటారు. ఆ విధంగా
ఎంపిక చేసిన స్థావరంలోకి తరలి వెడతారు. అన్నపానీయాలు, ఆయుధాలు స్థావరంలోకి
చేర్చుకుంటారు. ఆ స్థావరంలో విడిదిచేసి శత్రువు రాకకోసం ఎదురుచూస్తూ గడుపుతారు.