77 భారత స్వాతంత్య్రోద్యమం-ముస్లిం ప్రజాపోరాటాలు
పలు ప్రత్యేకతలను సంతరించుకుని దృఢమైన సోదరభావం పెంపొందించుకున్న కారణంగా
ఫరాజీలలో అద్భుతమైన ఐకమత్యం ఉనికిలోకి వచ్చింది. ఈ ఐకమత్యమే అంగబలం,
అర్ధబలం, ఆయుధబలం గల బ్రిటిషర్లను, బ్రిటీషర్ల తొత్తులను పలు పోరాటాలలో
మట్టికరిపించింది.
ఈ విధంగా ఫరాజీలకు ప్రధానబలంగా మారిన ధార్మిక సిద్ధాంతాలు, ఆచరణలే
ఫరాజీల ప్రధాన బలహీనతగా కూడా మారాయి. సామాన్య ప్రజలను ఆకట్టుకోవటంలో
ఫరాజీలకు అవరోధాలెదురయ్యాయి. ఫరాజీలను సామాన్య ముస్లిం జనసముదాయాల నుండి
వేరుచేసాయి. ధార్మికంగా సనాతన ముస్లింల నుండి ఫరాజీలు పూర్తి వ్యతిరేకతను
ఎదుర్కొన్నారు. తాము మాత్రమే అసలు సిసలైన ముస్లింలని ఫరాజీలు ప్రకటించుకుని,
తమకు బలంగల ప్రాంతాలలోని ఇతర ముస్లింల పట్ల చిన్నచూపు చూడటం, తమ
సంప్రదాయానికి చెందని ముస్లిం ప్రజానీకం పట్ల అనుచితంగా, అవమానకరంగా
ప్రవర్తించటం ఫరాజీలకు నష్టదాయకమైంది.
భారతీయ విప్లవకారులకు స్ఫూర్తి ప్రదాతలు
దార్మిక రంగంలో ఫరాజీల ప్రగతి ఎలా ఉన్నా, 19వ శతాబ్దాంతం వరకు అటు
బ్రిటీషర్లను, ఇటు జమీందారులను ఎదుర్కొంటూ సింహాల్లా పోరాడి, రైతాంగ తిరుగుబాట్లను
విజయవంతం చేయటమేకాక, ప్రజలలో స్వేచ్ఛాకాంక్షను, స్వాతంత్ర్య భావాలను
ఉద్దీపింపచేయడంలో ఫరాజీలు కృతకృత్యులయ్యారు. సుమారు అర్థ శతాబ్దికి పైగా ఉధృతంగా
సాగి, మరో అర్థశతాబ్ది పాటు సమాజాన్ని ప్రభావితం చేసిన ఫరాజీ ఉద్యమం చరిత్రలో
ప్రముఖ స్థానం సంపాదించుకుంది. భూమి కోసం, భుక్తి కోసం, మాతృభూమి విముక్తి
కోసం, ఫిరంగీల మీద సాయుధులై తిరగబడి, అనితరసాధ్యమైన ధైర్య సాహసాలతో
భారత స్వాతంత్య్ర సంగ్రామంలోని విప్లవకారులందరికీ ఫరాజీలు స్ఫూర్తిదాయకమయ్యారు.
బ్రిటీష్ దాస్య శృంఖలాల నుండి స్వేచ్ఛ కోసం సాగిన మహత్తర పోరాట చరిత్రలోనూ
తమదైన ముద్రతో బలమైన స్థానాన్ని సొంతం చేసుకుని, ప్రజల హృదయాంతరాళాలలో
ఫరాజీ యోధులు సజీవులుగా మిగిలిపోయారు.