Jump to content

పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం ప్రజా పోరాటాలు.pdf/79

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సయ్యద్ నశీర్ అహమ్మద్ 76

1879లో జమీందారు బాబు పూర్ణచంద్ర రాయ్ మీద ఫరాజీలు తిరుగుబాటు చేసారు. ఆ తిరుగుబాటును అణచివేయడానికి జమీందారు క్రూరంగా వ్యవహరించాడు. ఆ పరిస్థితులలో ఒక పధకం ప్రకారంగా ఫరాజీలు దాడి చేసి జమీందారును అంతంచేసి సంచలనం. సృష్టించారు. ఈ చర్యతో ఆత్మస్థైర్యం పెరిగిన ఫరాజీలు మరింతగా విజృంభించారు. చరిత్ర పునరావృతమైంది. ఫరాజీలు మరింత బలపడి ప్రజావ్యతిరేక చర్యలన్నిటినీ ఎదుర్కొనసాగారు.
⁠తూర్పు బెంగాల్లోని అనేక ప్రాంతాలలో ఫరాజీలు కార్మిక సంఘాల పద్ధతిలో బలపడసాగారు. సంఘంలోని ఏ ఒక వ్యక్తికి నష్టం జరిగినా, కష్టం వచ్చినా, అది అందరిదిగా భావించేవారు. సంప్రదాయక ధార్మిక సంఘాల స్థాయి నుండి కార్మికోద్యమానికి సారధ్యం వహించే కార్మిక సంఘాల స్వరూపాన్ని ఫరాజీలు సంతరించుకోవడం వలన ఫరాజీల ప్రభావం అధికమవుతుందని, ఆంగ్లేయ అధికారులు సమర్పించిన నివేదికలు పేర్కొన్నాయి. మాల్గా న్యాయమూర్తి 1870లో నిర్వహించిన విచారణ తరువాత తయారుచేసిన నివేదికలో, ".. There is strong combination, like a trade union in England, among all villagers to resist the oppressions by all means legal and illegal..." అని పేర్కొన్నాడు. పటిష్టమైన కార్మిక సంఘాలు అంతర్గతంగా తమలో తాము ఎంతటి గట్టి సంబంధాలను కలిగి ఉంటాయో అంతకంటే పటిష్టమైన సంబంధాలు కలిగి, ప్రతి ఒక్కరి సమస్యను తమ సమస్యగా పరాజీలు భావించారు. ఈ సోదర భావనే ప్రతికూల పరిస్థితులలో కూడా ఫరాజీలు బలం పుంజుకోవడానికి తోడ్పడింది. బలపడ్డ ఫరాజీలు ఫిరంగీల పాలనను అంతంచేయాలన్న లక్ష్యంగా ముందుకు సాగినందున, ఆంగ్లేయ అధికారులు తమ నివేదికలో ఆ విషయాలను వివరంగా చర్చిస్తూ, ఫరాజీలకు స్పష్టమైన రాజకీయ లక్ష్యం ఉందన్నారు. రాజకీయ పార్టీ స్వరూపాన్ని ధార్మిక సంస్థ ముసుగులో ఫరాజీలు నిర్మించారని ప్రకటించారు.
⁠ఫరాజీలు గణనీయమైన సంఖ్యలో గల ప్రాంతాలలో ఫరాజీ కాలనీలను ఏర్పాటు చేసుకున్నారు. ఈ కాలనీలను 'ఫరాజీ వరాస్' (Farazi Paras) అని పిలిచేవారు. ఈ కేంద్రాల నుండే ఫరాజీలు తమ ప్రత్యేక అస్థిత్వాన్ని కాపాడుకున్నారు. ఫరాజీలు ధార్మిక, ఆర్థిక, రాజకీయరంగాలలో ప్రత్యేకతను చాటుకున్నా, రైతుల ఉమ్మడి సమస్యలు వచ్చినప్పుడు, ఇతర సాంఘిక జనసముదాయాలతో కలిసి పోరాటాలలో పాల్గొనటంతో, ఆయా వర్గాల ప్రేమాభిమానాలను చూరగొన్నారు.
⁠స్వరూప స్వభావాలలో ప్రత్యేకతలు నిలుపుకునేందుకు ధార్మిక, ఆచార సంప్రదాయాల విషయంలో కఠినంగా వ్యవహరించటం వలన, సాధారణ ముస్లిం జన సముదాయాల నుండి ఫరాటీలు వేరుపడిపోయారు. ఫరాజీల వ్యక్తిగత ఆచరణే ఇస్లామిక్ ఆచరణగా ప్రకటించి, అందుకు భిన్నంగా వ్యవహరించేవారు అసలు ముస్లింలు కారని దుమ్మెత్తిపోయటంతో సాధారణ ముస్లింలు కూడా మతపరంగా ఫరాజీలను అనుసరించ లేకపోయారు. ఫరాజీల ఉద్యమం ప్రధానంగా ధార్మిక ఆచారాలు, సంప్రదాయాలలో మార్పులు కోరుకుంటూ, 'శుద్ధ ఇస్లాం' అనుసరణ ఆధారంగా ఉనికిలోకి వచ్చింది. ఈ రకమైన అభిప్రాయాలే ఫరాజీల సంఖ్య తామరతంపరగా పెరగడానికి తోడ్పడ్డాయి. ఈ ధార్మిక సూత్రాలు, కఠిన ఆచరణ ప్రధానశక్తిగా మారి ఫరాజీలకు ఆనాడు సహకరించాయి.