Jump to content

పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం ప్రజా పోరాటాలు.pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సయ్యద్ నశీర్ అహమ్మద్ 70

వరకు అర్ధం చేసుకోవచ్చు.
విజృంభించిన ఫరాజీలు
దూదు మియా గృహం మీద దాడి జరపటంతో, ఈ చర్య తమ అందరికి అగౌరవంగా భావించిన ఫరాజీలు కోపోద్రేకంతో రెచ్చిపోయారు. ఆయుధాలను చేతపట్టి డన్లప్ ఫ్యాక్టరీ మీద దాడి చేసారు. ఈ దాడులలో పలువురి ప్రాణాలు పోయాయి. ఈ సంఘటన తరువాత ఫరాజీల మీద హత్య, దోపిడీ, దాడి లాంటి కేసులు నమోదయ్యాయి. అనంతరం పలు అవాంఛనీయ సంఘటనలు జరిగాయి. ప్రతిచర్యగా ఫరాజీలు కంపెనీ పాలకుల మీద, జమీందారుల మీద, కంపెనీ మద్దతుదారుల మీద విరుచుకుపడ్డారు. ప్రతి దాడిలో దూదు మియా ఫరాజీ బలగాల వెంట ఉండటం వలన ఆయన నేతృత్వంలో ఫరాజీలు మరింతగా విజృంభించారు. అమాయకులకు, స్త్రీలకు, వృద్ధులకు, ఎటువంటి ఇక్కట్లు కలగకుండా దూదు మియా చర్యలు తీసుకోవటంతో గ్రామీణుల మద్దతు అపారంగా లభించింది. మతాలతో ఏ విధంగాను సంబంధం లేకుండా అన్ని మతాలకు చెందిన పేద ప్రజలు, రైతులు ఆయనకు అండదండలుగా నిలిచారు.
ఈ సంఘటనలతో పాలకులు ఫరాజీల మీద, ప్రజల మీద ఉక్కుపాదం మోపటంతో, ఆ ప్రాంతాలలో బ్రిటీష్ వ్యతిరేకత పెద్ద ఎత్తున ప్రజర్విల్లింది. పోలీసు అధికారులకు కూడా ప్రాణభయం పట్టుకుంది. ఇండిగో ప్లాంటర్లు, కంపెనీ అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్ళారు. ఈ తిరుగుబాట్లను, దాడులను నిరోధించటం కష్టంగా మారిందని, ప్రతి సంఘటనలో, పెద్ద సంఖ్యలో ఫరాజీలు గ్రామీణులు పాల్గొంటున్నందున, వారిని నిలువరించటం సాధ్యం కావటం లేదని పోలీసు అధికారులు కంపెనీ ఉన్నతాధికారుల వద్ద మొరపెట్టుకున్నారు.
గ్రామాల మీద సైనిక బలగాలు దాడులు జరిపి ఫరాజీలను పెద్ద సంఖ్యలో నిర్బంధించాయి. ప్రజల మీద దాష్టీకాలకు పాల్పడ్డాయి. దూదు మియాను అరెస్టు చేసాయి. అధికారులు ఆయనను మిగతా ఫరాజీల నుండి వేరుచేసి ప్రత్యేక గదిలో ఏకాంతంగా ఉంచారు. ఆయన పట్ల అత్యంత అవమానకరంగా, క్రూరంగా వ్యవహరించారు. దూదు మియా మీద పాలకవర్గాలు సాగించిన దుశ్చర్యలు సహజంగా సంచలనం కలిగించాయి. ఉద్రిక్త వాతావరణానికి కారణమయ్యాయి. ఈ సంఘటనల తరువాత అధికారులు వ్యవహరించిన తీరు తెన్నుల మీద విచారణ జరిపిన ఆంగ్ల అధికారులు కూడా పోలీసు అధికారులను తప్పుపట్టారు. అయినప్పటికీ దూదు మియాకు ఫరాజీల మీద వున్నపట్టు, ప్రజలలో గల పలుకుబడిని గమనించిన అధికారులు, ఆయన సమస్యాత్మకం కాగలరని భావించారు. దూదు మియాను బెంగాల్ నుండి మాత్రమే కాదు భారతదేశం నుండి బహిష్కరించటం మంచిదని ఢాకా కమీషనర్ సలహానిచ్చాడు. ప్లాంటర్ డన్లప్ తన కుతంత్రాలను మానలేదు. 1838లో ప్రారంభించిన ఆ కుయుక్తులను కొనసాగించాడు. 1841, 1846, 1857లలో కూడ ఫరాజీలు, దూదు మియాల మీద అనేక కేసులను బనాయించాడు. ఆతడు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ప్రజల అండదండలు, పటిష్టమైన వ్యవస్థ గల ఫరాజీలను పరాజితులను చేయటం అతనికి సాధ్యం కాలేదు. అతని ఎత్తులు పలుమార్లు