సయ్యద్ నశీర్ అహమ్మద్ 68
జాగ్రత్తలు పాటించారు. ఆయా మతస్థుల ఆచార సంప్రదాయాలకు అనుగుణంగా
తీర్పులిచ్చారు. అన్ని మతాల, సంప్రదాయాల ప్రజల సమస్యలను సానుకూలంగా
పరిష్కరించేందుకు దూదు మియా ప్రత్యేకంగా న్యాయసలహా మండలిని ఏర్పాటు
చేసుకున్నారు. ఆ మండలిలో హిందూ, క్రైస్తవుల చట్టాలు తెలిసిన హిందూ, క్రైస్తవ మతాలకు
చెందిన పండితులను, ప్రముఖులను నియమించారు. ఈ పండితులలో ఒకరు బ్రాహ్మణుడు
కాగా ఇరువురు శూద్ర కులానికి చెందిన వారుండటం విశేషం. ప్రజల వ్యక్తిగత మత
విశ్వాసాలకు ఏ మాత్రం భంగం కలగకుండా న్యాయమైన తీర్పులు ప్రకటించేందుకు దూదు
మియా పలు జాగ్రత్త తీసుకున్నారు.
రాజ్యంలో రాజ్యం
శత్రువు మీద దాడులు చేసేందుకు ప్రత్యేక బలగాలను తయారు చేసుకున్నారు.
ఆ బలగాలకు అన్నిరకాలుగా తగిన శిక్షణ ఇప్పించారు. ఆయుధాలను సమీకరించారు.
తయారు చేయించారు. శారీరకంగా బలిష్టులైన యువకులను బలగాలలోకి ఆహ్వానించారు.
శత్రువు మీద మాత్రమే దాడి చేయాలని, మిత్రులకు కించిత్తు నష్టం కల్గించరాదని ఖచ్చితమైన
ఆదేశాలు జారీచేసారు. మిత్రులను శత్రువులను గుర్తించడానికి, శత్రువుల కదలికలను
గమనించడానికి గూఢచారి వ్యవస్థను నిర్మించారు. రైతుల, ఫరాజీల న్యాయమైన హక్కులను
హరించివేయటానికి జమీందారులు, అధికారులు కక్ష సాధింపుగా కేసులు బనాయించి
కోర్టులకు లాగితే, బాధితుల పక్షాన న్యాయపోరాటం చేయడానికి, ' ఫరాజీ టాక్స్ ' అను
ప్రత్యేక పన్నును, విరాళాలను సేకరించి బాధితులను ఆదుకునే ఏర్పాట్లు చేసారు. ఈ
చర్యలతో, పటిష్టమైన సంఘనిర్మాణంతో, తగిన యంత్రాంగంతో అణచివేతకు గురవుతున్న
ప్రజలకు తిరుగులేని నాయకుడిగా దూదు మియా ఎదిగారు. స్వయంపాలనను
ప్రారంభించారు. ఫరాజీల ప్రాబల్యం గల జిల్లాలో, ఆధిపత్యంలో గల గ్రామాలలో
ప్రభుత్వ ఆజ్ఞలను ప్రజలు ఖాతరు చేయక, దూదు మియా ఆదేశాలను ఖచ్చితంగా
అమలుచేయటం గమనించిన చరిత్రకారులు ఆ వ్యవస్థను రాజ్యంలో రాజ్యంగా ( State
with in the State ) పరిగణించటం గమనించాల్సిన విశేషాంశం. కంపెనీ పాలకుల హుకుం
నామాలను కాదంటూ తమదైన ఆదేశాలను అమలు జరుపుకుంటూ ఫరాజీలు స్వంతంత్ర
ప్రభుత్వాన్ని నడపటం గమనిస్తే ఆయా ప్రాంతాలలో ఫరాజీలు ఎంతగా బలపడ్డారో అర్ధం
చేసుకోవచ్చు. ఒక సంఘ సంస్కర్తగా, ఫరాజీల పాలకునిగా, ప్రజలను వేధించవద్దని, అక్రమ
వసూళ్ళకు పాల్పడవద్దని, ఫరాజీల ఉద్యమానికి విరాళాలు అందజేయమని, పరిసర ప్రాంతాల
జమీందారులకు, ప్రముఖులకు ఆయన లేఖలు వ్రాసారు. ప్రజల మీద కిరాతకాలకు
పాల్పడవద్దని, అక్రమ కేసులను బనాయించితే సహించేది లేదని హెచ్చరికలు జారీచేసారు.
దూదు మియా ప్రాబల్యం పెరగటం, ఆయన అండదండలను చూసుకొని రైతులు
పేద వర్గాల ప్రజలు, ఫరాజీలు కంపెనీ పాలకులను గాని, జమీందారులను గాని, బేఖాతర్
అనటంతో ఆ వర్గమంతా మండిపడసాగింది. శత్రువు ఎత్తులను కనిపెడుతూ అప్రమత్తంగా
దూదు మియా వ్యవహరించసాగారు. కంపెనీ పాలకులు, అధికారులు ఆయన మీద చర్యలు
తీసుకునేందుకు అవకాశం లేకుండా పలు జాగ్రత్తలతో హెచ్చరిక లేఖలను రాయించారు.