Jump to content

పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం ప్రజా పోరాటాలు.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సయ్యద్ నశీర్ అహమ్మద్ 40

అధికారులు మేల్కొన్నారు. ఈ తిరుగుబాటును అణచివేయడానికి బరాసత్ జాయింట్ మేజిస్ట్రేట్కు కలకత్తా కమీషనర్ ప్రత్యేక ఆదేశాల్ని పంపారు. వహాబీలను ఎదుర్కోనే సంగతి తరువాత, అసలు నిలువరించటమే చేతకాక, అధికారి పలాయనం చిత్తగించాడు.
ప్రారంభ దశలో లభించిన విజయాల ఉత్సాహంతో ఉన్న మీర్ నిస్సార్ అలీ బలగాలు ఆత్మవిశ్వాసంతో మరింత విజృంభించాయి. ఈ అనుకూల వాతావరణానికి, మీర్ నిస్సార్ అలీ, ఆయన అనుచరుల ధైర్య సాహసాలు తోడుకావటంతో తిరుగుబాటు దళాలకు అడ్డూ ఆపూ లేకుండాపోయింది. ఆత్మ విశ్వాసం నిండిన బలగాలు విజయ పరంపరను కొనసాగించాయి. కంపెనీ పాలకులచే పంపబడిన పోలీసు అధికారులు, కంపెనీ సాయుధ బలగాలు, తుపాకులు, ఫిరంగులతో దాడులు చేసినా వహాబీ దళాలు విక్రమించి పోరాడాయి. కంపెనీ బలగాలను, అధికారులను తరిమికొట్టాయి. తిరుగుబాటును అణచివేయడానికి వచ్చిన కంపెనీ అధికారి అలెగ్జాండర్ చావు తప్పి కన్నులొట్టపోయి బ్రతుకు జీవుడా అంటూ పారిపోయాడు. ఈ తిరుగుబాటు దళాల ధైర్య సాహసాలను వర్ణిస్తూ, 'కంపెనీ బలగాలు పెద్ద సంఖ్యలో దాడి చేసి తుపాకులు ఎక్కుపెట్టినా, తిరుగుబాటు వీరులు వెనుకంజ వేయకుండా, ముందుకు దూసుకు వచ్చేవారని నాడియా జిల్లా మేజిస్ట్రేట్ ఆశ్చర్యం వ్యక్తం చేసిన సంఘటనలు తిరగబడిన గ్రామీణుల శౌర్యపరాక్రమాలకు అద్దం పడతాయి. ("..they approached within the reach of our fire in a most bold and determined way, nor did the fall of one or two of their foremost by our shot, deter the rest from advancing...", --Wahabi and Farazi Rebels of Bengal, Shri Narahari Kaviraj, Page 48 ) అంతేకాదు తన బలగాలు పారిపోయాయని, తాను కూడా పలాయనం చిత్తగించి ప్రాణాలు కాపాడుకోవడం జరిగిందని, తరుముకువస్తున్న తిరుగుబాటుదారుల నుండి తప్పించుకోవటానికి 5 మైళ్ళు పరిగెత్తానని ఆ ఆంగ్ల అధికారి ఉన్నతాధికారులకు రాసుకున్న నివేదికలో స్వయంగా వివరించాడు. ("...almost every person on my side was run- ning away and I also obliged to run for my life, the insurgents pursuing me with drawn swords. After running 5 miles ..." - Wahabi and Farazi Rebels of Bengal, page 40)
ఒకవైపు బ్రిటీషర్ల దాడులను ఎదుర్కొంటూనే, గ్రామీణ ప్రజల మీద జులుం ప్రదర్శిస్తున్న ప్లాంటర్ల మీద తిరుగుబాటు దళాలు దాడులు ప్రారంభించాయి. బలమైన రక్షణ వ్యవస్థ కలిగిన ప్లాంటర్లు, తిరుగుబాటు దళాలను ఎదుర్కొనలేక ఆత్మ రక్షణార్ధం కర్మాగారాలు, విలాసవంతమైన తమ భవనాలు వదిలి సమీప నగరాలకు పారిపోయారు. జమీందారులు, ప్లాంటర్లు మాత్రమే కాకుండా బ్రిటీషర్లకు, జమీందారులకు మద్దతిస్తున్న గ్రామంలోని ధనిక వర్గాల పట్ల కూడ మీర్ నిస్సార్ అలీ నిర్దాక్షిణ్యంగా వ్యవహరించారు. ఈ సందర్భంగా హిందూ-ముస్లిం తేడాలను పూర్తిగా విస్మరించారు. ప్రారంభదశలో మతపరమైన సంబంధాలు తిరుగుబాటు వీరుల మీద కొంత మేరకు ప్రభావం చూపినా, పోరాటం ఉదృతమై, విస్తరించే కొద్ది ఆ సంబంధాలు రూపు మాసిపోయాయి. ఒక సందర్భంలో షేర్పూర్ గ్రామానికి చెందిన యార్ మొహమ్మద్ అను సంపన్నుడు, జమీందారుకు వత్తాసు పలుకగా ఆయన ఇంటిమీద దాడి జరిగింది. మరో సందర్భంలో నిస్సార్ అలీతో