Jump to content

పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం ప్రజా పోరాటాలు.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

39 భారత స్వాతంత్య్రోద్యమం-ముస్లిం ప్రజాపోరాటాలు

చేయి అయ్యింది. ఈ దాడిలో దేవనాధ్ అను వ్యక్తి మరణించగా పలువురు గాయపడ్డారు. ప్రధమ దశ దాడుల తరువాత వహాబీలు తమ కేంద్ర స్థావరం నర్కేబల్ బరియా చేరుకున్నారు. అక్కడ నుండి తిరిగి రామచంద్రపూర్ తదితర గ్రామాలలోని జమీందార్లు, కంపెనీ పాలకులు, ధనిక సంపన్నులైన వడ్డీ వ్యాపారుల మీద దాడులు జరిపారు. ఈ దాడులను నిరోధించగల స్థాయి ప్రతిఘటన కంపెనీపాలకుల, జమీందారుల నుండి లేకపోవటంతో వహాబీలలో ఆత్మస్థైర్యం బాగా పెరిగింది.
ఈ సందర్భంగా ముస్లిమేతర జన సముదాయాల మీద వహాబీలు దాడులకు పాల్పడటం పలు విమర్శలకు గురయ్యింది. పంజాబ్కు చెందిన మోల్లా మిష్కిన్ షా అను వ్యక్తి దుర్భోధల వలన రెచ్చిపోయిన వహాబీలు తొలి దశలో అవాంఛనీయ దాడులకు పాల్పడ్డారు. (".. It is probable that during intermediary stage of revolt some excesses were committed by the followers of Titu Mir under the instigation of Mollah Mishkin Shah, a native from Punjab.." - Freedom Movement and Indian Muslims, Dr. Santimoy Ray, PPH, 1983) ఈ పరిస్థితిని గమనించిన నిస్సార్ అలీ ప్రతిఘటించిన వారిని తప్ప ఇతర ప్రజలకు ఏవిధంగా నష్టం కల్గించరాదని స్పష్టమైన ఆదేశాలు జారీచేసారు. ఆ ఆదేశాలు ఖచ్చితంగా అమలు జరిగేట్టుగా ఆయన పలు చర్యలు తీసుకున్నారు.
ఆచార సంప్రదాయాలను అవమానపర్చారన్న కసితో ప్రారంభమైన దాడులు క్రమంగా దిశను మార్చుకున్నాయి. ప్రజల సామాజిక, ఆర్ధిక కడగండ్లను మీర్ నిస్సార్ అలీ పరిగణనలోకి తీసుకున్నారు. ఈ మార్పు వలన, మతాలతో సంబంధం లేకుండా క్రమక్రమంగా అన్ని మతాల, వర్గాల, జాతుల పేద ప్రజానీకం మహమ్మద్ నిస్సార్ అలీ బలగాలలో చేరారు. భారీసంఖ్యలో బలగాలు చేకూరటంతో, సర్కేల్ బరియాలో వెదురు కర్రలతో పటిష్టమైన, విశాలమైన కోటను నిర్మించారు. ఈ కోటలలో ఒక్కొక్క విభాగానికి ఒక్కొక్క ప్రత్యేక గది ఏర్పాటుచేశారు. ఆయుధాల గది, ఆహారపదార్థాల గది, కార్యాలయ గది, తదితర ప్రత్యేక ఏర్పాట్లను కల్పించారు. ఆయుధాలను, ఆహారపదార్థాలను భారీగా సేకరించారు. బలగాలకు పోరాటంలో మంచి శిక్షణ ఇప్పించారు.
ఈ మేరకు ఆరంభంలో మతపరమైన సంస్కరణల దిశగా దృష్టిసారించిన ఉద్యమం, స్థానిక పరిస్థితుల నేపధ్యంలో త్వరితగతిన ఆర్థిక, రాజకీయ లక్ష్యాల వైపుగా దిశను మార్చుకుంది. ఈ లక్ష్య సాధన దిశగా సాగుతున్న మీర్ నిస్సార్ అలీకి, లక్ష్యసాధన కోసం పోరుబాటను ఎంచుకున్న వహాబీలకు బెంగాల్లోని గ్రామీణ ప్రజల, రైతుల, చేతి, కుల వృత్తిదారుల తోడ్పాటు అపారంగా లభించింది. అధికారులను పరుగులెత్తించిన వహాబీలు
మీర్ నిస్సార్ అలీ దాడులను తొలుత కంపెనీ అధికారులు పట్టించుకోలేదు. పూర్వా గ్రామం మీద దాడి జరుగక ముందే దాడి సమాచారం అధికారులకు తెలిపినా ఫలితం లేకుండా పోయింది. ఆ తరువాత క్రమక్రమంగా తిరుగుబాటు దళాలు బలపడే కొద్ది పోలీసు అధికారుల నుండి, బ్రిటీష్ ప్లాంటర్ల నుండి ఫిర్యాదులు రావటంతో కంపెనీ