Jump to content

పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం ప్రజా పోరాటాలు.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సయ్యద్ నశీర్ అహమ్మద్ 36

1823 ప్రాంతంలో ఆయన హజ్ యాత్రకు మక్కా వెళ్ళారు. ఆ సమయాన సయ్యద్ అహమ్మద్ బర్వేలి, ఫరైజీ ఉద్యమ నాయకుడు షరియతుల్లా కూడా మక్కాలో ఉండటం తటస్థించింది. ఈ నాయకులు ముగ్గురూ కలుసుకోవటమేకాక, స్థానిక వహాబీ నాయకులతో కూడా సంబంధాలు ఏర్పర్చుకున్నారు. మక్కా నుండి తిరిగి వచ్చాక కొంతకాలం కలకత్తాలో గడిపి సర్కేల్బరియా సమీపాన గల హైదర్ పూర్ వెళ్ళి స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్నారు. వహాబీ తత్త్వప్రచారం తన జీవితాశయంగా నిర్ణయించుకుని, ఆ దిశగా ప్రయాణం ప్రారంభించారు. గ్రామాలు, పట్టణాలు తిరుగుతూ ప్రజలకు నైతిక, ధార్మిక బోధనలు చేయసాగారు. ఈ బోధనలు త్వరలోనే ప్రజలను ఆకర్షించాయి. పేద రైతులు, చేతి వృత్తులవారు, చేనేత పనుల వారు ఆయన వెంట నడుస్తూ, వహాబీ సంప్రదాయానికి అనుగుణంగా తమ జీవితాలను మార్చుకున్నారు. పరిసర ప్రాంతాలలో ఆయనకు పెద్ద అనుచర వర్గం ఏర్పడింది. ఆయన మార్గం అనుసరించే వారంతా ఒక ప్రత్యేక సమూహంగా తయారయ్యారు. ఈ పర్యటనల సందర్భంగానే నిస్సార్ అలీ సామాన్య ప్రజానీకం పడుతున్న బాధలను గమనించారు. కంపెనీ అధికారులు, జమీందారులు, మహాజనులు సాగిస్తున్న దోపిడీని చూసారు. ప్రజల ఆక్రందనలు విన్నారు. వలస పాలకుల దోపిడీని నిరోధించాలనుకున్నారు. ఆ దిశగా ఆయన ఆలోచనలు సాగుతున్న సమయంలో వాయవ్య సరిహద్దు ప్రాంతాలలో సయ్యద్ అహమ్మద్ బర్వేలి విజయాలు ఆయనను ఉత్తేజపరిచాయి. ఆ బాటలో ప్రజలను సమాయత్తం చేసేందుకు తనతో కలసి వచ్చిన ఫకీర్లతో పలు పర్యటనలు జరిపారు. ఈ పర్యటనలు రానున్న కాలంలో ప్రారంభం కానున్న పోరాటాలకు ఊపిరిపోశాయి.
⁠ఈ పరిస్థితులు ఇలా ఉండగా కంపెనీ పాలకులు ముస్లింల జీవితాలను పెనుమార్పులకు గురిచేయగల పలు చర్యలను అమలులోకి తెచ్చారు. రాజభాగం ఏమీ ఆశించకుండా పూర్వపు పాలకులు ధార్మిక సంస్థలకు ఉచితంగా ఇచ్చిన భూములను కంపెనీ పాలకులు తిరిగి స్వాధీనం చేసుకున్నారు. ఆ కంపెనీ పాలకుల అడుగులకు మడుగులొత్తే నూతన జమీందారులను రంగంలోకి తీసుకురావటంతో పాత జమీందారులు ఒక్కసారిగా బజార్న పడ్డారు. రాజ భాషగా వెలిగిన పర్షియన్ భాష స్థానంలో ఆంగ్ల భాషను ప్రవేశపెట్టడంతో ముస్లిం విద్యావంతులు పెద్ద సంఖ్యలో నిరుద్యోగులయ్యారు. అప్పటివరకూ న్యాయస్థానాలలో ముస్లింలు చలాయించిన ఆధిక్యతను కోల్పోయారు. ఈ పరిణామాల మూలంగా ముస్లిం సమాజంలో తీవ్ర నిరాశ నిస్పృహలు వ్యాపించాయి. కంపెనీ పాలకులు ప్రవేశ పెట్టిన శాశ్వత సెటిల్మెంట్ రెవిన్యూ విధానంతో రైతు భూమి మీద హక్కులను కోల్పోయాడు. పంటలో అత్యధిక భాగాన్ని రాజభాగంగా కంపెనీకి తొత్తులైన జమీందారుల పరం చేయాల్సి వచ్చేసరికి రైతుకు కష్టం నష్టం తప్ప మిగిలేది ఏమీ లేకపోయింది. ఆ పరిస్థితులు సృష్టించిన నిరాశ నిస్పృహల నేపథ్యంలో మీర్ నిస్సార్ అలీ బోధనల వలన, బెంగాల్లోని పలు జిల్లాల్లో వహాబీల ప్రాబల్యం బాగా పెరిగింది. వహాబీలంతా ఒక జట్టు కట్టు కావటంతో, తామంతా ఒకే సమూహమన్న చైతన్యం పెరిగి, పీడనకు, దోపిడికి వ్యతిరేకంగా పోరాడాలన్న ఆలోచనలు అంకురించాయి.