సయ్యద్ నశీర్ అహమ్మద్ 154
ఈ విధంగా దక్షిణాఫ్రికా నేత నెల్సన్ మండేలా అనుభవించిన జైలు జీవితం కంటే ఎక్కువ
కాలం, విముక్తి పోరాటంలో భాగంగా అబ్దుల్ గఫార్ ఖాన్ జైళ్ళల్లో గడిపారు.
1948లో ఖుదా-యే-ఖిద్మత్గార్ సంస్థను ముస్లింలీగ్ విలీనం చేయాల్సిందిగా
మహమ్మదాలి జిన్నా కోరాడు. జిన్నా వినతిని గఫార్ ఖాన్ తిరస్కరించటమే కాకుండా
సంస్థను కార్యకలాపాల పరిధిని పాకిస్థాన్ అంతటా వ్యాపింప చేయదలచినట్టు మే 13న
బాగ్షా ఖాన్ ప్రకటించారు. ఈ సంస్థ రాజకీయాలకు అతీతంగా స్వచ్ఛంద సేవాసంస్థగా
పనిచేస్తుందని ఆయన అన్నారు. అయినప్పటికీ పాకిస్థాన్ నాయకులు ఖాన్ గఫార్ ఖాన్
ప్రయత్నాలను వంకర దృష్టితో చూస్తూ మండిపడసాగారు. గఫార్ ఖాన్ అరెస్టు తరువాత
ప్రభుత్వం ఖుదా-యే-ఖిద్మత్గార్ సంస్థ మీద, కార్యకర్తల మీద విరుచుకుపడింది. భయంకర
రాజ్యహింస ప్రారంభమైంది. ఖుదా-యే-ఖిద్మత్గార్ సంస్థను నిషేధించింది. ఆ సంస్థ
కార్యాలయాలన్నిటి మీద దాడులు జరిగాయి. పలు ప్రాంతాలలోని సంస్థ శాఖల కార్యాలయాల
భవనాలను కూల్చి, నేలమట్టం చేశారు. అసంఖ్యాకంగా కార్యకర్తలను, సానుభూతి పరులను
అక్రమంగా నిర్భందించారు. అరెస్టు చేసారు. ఈ మేరకు పరిస్థితులు చాల విషమించాయి.
1948 ఆగస్టు 12వ తేదీన చార్సద్దా తహసీల్లోని బాబ్రా గ్రామంలోని సంస్థ
కార్యాలయం మీద దాడి జరిగింది. ఆ సమయంలో కార్యకర్తలు, ప్రజలు అక్కడి మైదానంలో
సామూహికంగా నమాజ్ చేయడానికి సిద్ధమవుతున్నారు. పోలీసులు అకస్మాత్తుగా వచ్చిపడ్డారు.
మరతుపాకుల అగ్నివర్షం ప్రారంభమైంది. ప్రజల మీద విచక్షణా రహితంగా పోలీసులు
కాల్పులు జరిపారు. ఈ కాల్పులలో పలువురు గాయపడ్డారు. తుపాకి గుండ్లు దూరకుండా
మిగిలిన దేహం అంటూ లేదని, ప్రార్ధన చేస్తున్నవారు చేస్తున్నట్టుగానే కూలిపోయారని, ఈ
దుస్సంఘటన గురించి చెబుతూ గఫార్ ఖాన్ తెలిపారు. ఈ కాల్పులలో 15 మంది
చనిపోయారని, 50 మంది గాయపడ్డారని ప్రభుత్వం ప్రకటించింది. ప్రత్యక్ష సాక్షులు మాత్రం
ఖురాన్ మీద ప్రమాణం చేసి, మృతుల సంఖ్య రెండు వేలకుపైగా ఉండవచ్చని స్పష్టంచేసారు.
ఈ కారణంగా ఆ గ్రామం పక్కన అతి పెద్ద మరుభూమి ఏర్పడిందని ప్రజలు తెలిపారు.
ఈ ప్రాణాంతక పరిస్థితులలో ఖుదా-యే-ఖిద్మత్గార్లను బలిచేయటం, పోరాటం
సాగించటం ఇష్టంలేని గఫార్ ఖాన్ 1947 సెప్టెంబర్ మాసంలో పాకిస్థాన్ ప్రభుత్వాన్ని
అంగీకరిస్తూ, ఆ మేరకు అప్రమత్తులై మెలగవలసిందిగా కార్యకర్తలను కోరారు.
తోడేళ్ళ పాల్జేసారు
భారత విభజనను భారత జాతీయ కాంగ్రెస్ అంగీకరించగానే ఆవేదనకు లోనైన
ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్, ఆ తరువాత ఉత్పన్నమైన ప్రతికూల పరిస్థితులను గమనించి '
మమ్మల్ని తోడేళ్ళ పాల్జేసారని ' మహాత్మాగాంధీతో అన్నారు. ఈ మాటను స్వీకరించి 'తోడేళ్ళ
పాలుచేసారు ' అను శీర్షికతో మహాత్మా గాంధీజీ వద్ద వ్యక్తిగత కార్యదర్శిగా బాధ్యతలు
నిర్వహించిన శ్రీ ప్యారేలాల్, సరిహద్దు గాంధీ ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ జీవిత చరిత్రను
రాసారు. ఆనాటి గఫార్ ఖాన్ మాటలను నిజం చేస్తూ, పాకిస్థాన్ పాలకులు తోడేళ్ళల్లాగా
వ్యవహరించి అబ్దుల్ గఫార్ ఖాన్ను వెంటాడి జీవిత చరమాంకం వరకు వేధించారు.