Jump to content

పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం ప్రజా పోరాటాలు.pdf/156

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

153 భారత స్వాతంత్య్రోద్యమం-ముస్లిం ప్రజాపోరాటాలు

అన్నట్లుగానే పాకిస్థాన్ పాలకవర్గాలు, ఆ పాలకవర్గాల తొత్తులు గఫార్ ఖాన్ అనుచరవర్గం పట్ల అత్యంత క్రూరంగా ప్రవర్తించారు.
⁠1947 జులైలో మౌంట్ బాటన్ వాయవ్య సరిహద్దు రాష్ట్రంలో ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని నిర్ణయించాడు. ఖాన్ సోదరుల ప్రాబల్యం గల ఈ ప్రాంతం ఆనాడు కాంగ్రెస్ ఆధిపత్యంలో ఉంది. ఆ ప్రాంతాన్ని పాకిస్థాన్లో కలపాలని ముందుగా నిర్ణయించుకున్నందున ప్రజాభిప్రాయం అను నాటకాన్ని మౌంట్ బాటన్ ప్రకటించాడు. ఈ చర్య వెనుకనున్న దురుద్దేశాన్ని, ప్రజాభిప్రాయాన్ని సేకరణ జరిగితే ఉత్పన్నమయ్యే హింసాత్మక పరిణామాలను గ్రహించిన ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ ప్రజాభిప్రాయ సేకరణను బహిష్కరించమని ఖుదా యే- ఖిద్మత్గార్లకు, రాజకీయంగా తన వెంటనున్న ప్రజలకు పిలుపునిచ్చారు.
⁠ఈ పరిస్థితులను ఆసరాగా చేసుకుని అటు ప్రభుత్వ అధికారులు, ఇటు ముస్లింలీగ్ నేతలు ఏకమై వాయవ్య సరిహద్దు రాష్ట్ర ప్రజలు పాకిస్థాన్లో చేరేందుకు సమ్మతించినట్టుగా ప్రకటించారు. ముస్లింలు అత్యధికంగా గల ఉత్తర ప్రాంతంలోని బెంగాల్, కాశ్మీర్, అస్సాం, పంజాబ్, సింద్, బలూచిస్థాన్, వాయవ్య సరిహద్దు రాష్ట్రం కలసి ' పాకిస్థాన్ ' ఏర్పడగలదని అందువలన తమతో సహకరించమని, హిందువుల రాజకీయాలను చిత్తుచేయడానికి సహాయపడమని, ముస్లిం లీగ్ గఫార్ ఖాన్ ను కోరింది. ఆ అభ్యర్ధన తిరస్కరిస్తూ, ముస్లింలకు ప్రధాన శత్రువు బ్రిటీష్ పాలకులు మాత్రమేగాని, హిందువులు ఏ మాత్రం కాదని, బ్రిటీషర్లు దేశం వదలి వెళ్ళాక పలు శతాబ్దాలుగా కలసిమెలసి సహజీవనం చేస్తున్న హిందూ- ముస్లింలు స్వతంత్ర భారతదేశంలో కూడా సామరస్యంగా జీవించగలరని సరిహద్దు గాంధీ ఆశాభావం వ్యక్తం చేశారు.
⁠అబ్దుల్ గఫార్ ఖాన్ ఎంతగా పాకులాడినా భారత విభజన తప్పలేదు. 1947 ఆగస్టు మాసంలో భారతదేశం ఇండియా-పాకిస్థాన్లుగా చీలిపోయింది. వాయవ్య సరిహద్దు రాష్ట్రం పాకిస్థాన్లో విలీనమైంది. పాకిస్థాన్ ఏర్పడగానే ముస్లింలీగ్ కార్యకర్తలు, నాయకులు, పాలకవర్గాలు ఖుదా-యే-ఖిద్మత్గార్ల మీద విరుచుకుపడ్డారు. డాక్టర్ ఖాన్ నేతృత్వంలో గల కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పాకిస్థాన్ ప్రభుత్వం రద్దు చేసింది. గఫార్ ఖాన్ పత్రిక 'పుష్టున్' ను నిషేధించింది. ఈ నిషేధంతో పుష్టున్ శాశ్వతంగా మూతపడింది. పుషున్ లేక ఫక్తూన్ జాతి పఠాన్ల ప్రాంతాన్ని పుష్టునిస్థాన్ లేక ఫక్తూనిస్థాన్ గా నామకరణంచేసి ప్రత్యేక ప్రాంతంగా ప్రకటించాల్సిందిగా డిమాండ్ చేసినందు వలన ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ మీద పాకిస్థాన్ పాలకులు మండిపడసాగారు.
⁠ఆ ఆగ్రహం హద్దులు మీరి 1948 జూన్ 15వ తేదీన అబ్దుల్ గఫార్ ఖాన్ను దేశద్రోహం నేరం క్రింద అరెస్టు చేసారు. ఈ విధంగా ప్రారంభమైన అరెస్టులు ఆయన మరణించేంత వరకు సాగి, సరిహద్దు గాంధీ జీవితంలో మరో 15 సంవత్సరాలను మింగేసాయి. ఈ 15 సంవత్సరాలే కాకుండా మరో ఆరు సంవత్సరాలు ప్రవాసంలో ఆయన జీవితం గడిచిపోయింది. ఈ మేరకు అటు బ్రిటీషర్ల పాలనలో 15 సంవత్సరాలు, ఇటు పాకిస్థాన్లో మరో 15 సంవత్సరాలు ఆయన జైలు జీవితాన్ని రుచి చూడాల్సి వచ్చింది.