Jump to content

పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం ప్రజా పోరాటాలు.pdf/145

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సయ్యద్ నశీర్ అహమ్మద్ 142

ఉత్తర్వులను తిరస్కరించి 1857 నాటి సైనిక తిరుగుబాటును గుర్తుకు తెచ్చి, తెల్ల పాలకుల గుండెల్లో ఘర్వాల్ రైఫిల్స్ (Garhwal Rifles సైనికులు గుబులు పుట్టించారు. పెషావర్లో విజృంభణకు సిద్ధమవుతున్న ప్రజలను అణచివేయడానికి భారతీయ సైనికులు గల ఘర్వాల్ రైఫిల్స్ దళాన్ని ప్రభుత్వం పిలిపించింది. ప్రజల మీద కాల్పులు జరపమని ఆదేశించగా, కాల్పులు జరపడానికి నిరాకరించిన సైనిక దళం నాయకుడు శ్రీ ఠాకూర్ చంద్రసింగ్, నిరాయుధులైన మా సోదరుల మీద కాల్పులు జరపం.... భారత సైన్యం బయటి శతృవుతో పోరాడటానికి మాత్రమే. మీరు మమ్మల్ని ఫిరంగులతో పేల్చి వేసినా అందుకు మేము సిద్దం' అని స్పష్టం చేసాడు. ఈ తిరస్కార వైఖరితో మండిపడిన అధికారులు కఠిన శిక్ష అనుభవించాల్సి వస్తుందని హెచ్చరించినా, శిక్షలకు సిద్ధం తప్ప కాల్పులు జరిపే ప్రసక్తి లేదంటూ హిందూ-ముస్లింల మధ్యనున్న సోదరభావాన్ని, బంధాన్ని స్పష్టంగా చాటాడు.
ఈ సంఘటన తర్వాత ఘర్వాల్ రైఫిల్స్ దళం మీద సైనిక విచారణ జరిపి, శ్రీ సింగ్కు 14 సంవత్సరాలు, ఆయన సహచరులకు 10 సంవత్సరాలు జైలుశిక్ష విధించారు. అనంతరం గాంధీ-ఇర్విన్ల మధ్యన కుదిరిన ఒప్పందం వలన శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొన్న వారందరి శిక్షలను రద్దు చేసినప్పటికీ ఘర్వాల్ రైఫిల్స్ దళంలోని దేశభక్తుల శిక్షలను రద్దు చేయలేదు. ఘర్వాల్ రైఫిల్స్ సైనికుల వైఖరిని క్రమశిక్షణారాహిత్యంగా పరిగణిస్తూ మహాత్మాగాంధీ కూడా వ్యతిరేకించారు. రౌండ్ టేబుల్ సమావేశాలకు వెళ్ళిన ఆయనతో ఓ ఫ్రెంచి విలేకరి ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ, ఘర్వాల్ రైఫిల్స్ సైనికుల విడుదలను మీరు ఎందుకు కోరలేదని అడిగాడు. అందుకు గాంధీజీ సమాధానం చెబుతూ, 'నేను ప్రభుత్వ ఉద్యోగులకు, సైనికులకు ప్రభుత్వ ఆజ్ఞల్ని ధిక్కరించమని చెప్పను. ఎందుకంటే ప్రభుత్వం మన చేతుల్లోకి వచ్చిన తర్వాత మేమూ ఉద్యోగుల చేత, సైనికుల చేత పని చేయించవలసి ఉంటుంది. ఇప్పుడు వాళ్ళని ప్రభుత్వ ఆజ్ఞల్ని భంగపర్చమని ప్రోత్సహించానే అనుకోండి రేపు నా ఆజ్ఞల్ని కూడా వారు భంగపరుస్తారు కదా!' అన్నారు. ఈ సమాధానం పలువురి విమర్శలకు గురైంది.
అటు పెషావర్లో ఖుదా-యే-ఖిద్మత్గార్, కాంగ్రెస్-ఖిలాఫత్ కార్యకర్తలు, బ్రిటీషర్ల కిరాతక అణచివేతను ఓర్పుతో ఎదుర్కొంటుండగా, ఇటు ఉత్తమంజాయ్ గ్రామంలో పాలకుల చర్యలకు నిరసన తెలిపేందుకు ప్రజలు సమావేశం కాసాగారు. ఈ విషయం తెలుసుకున్న డాక్టర్ ఖాన్ సాబ్ పెషావర్ చేరుకొనేసరికి, ఒకవైపు ప్రజలు మరోవైపు సైనిక బలగాలు మోహరించి ఉన్నాయి. సమావేశస్థలి నుండి వెళ్ళిపోకపోతే కాల్పులు జరపగలమని సైనికాధికారులు హెచ్చరించినా, ఖుదా-యే-ఖిద్మత్గార్లు స్థిర నిశ్చయంతో నిలబడి ఉన్నారు. ఆ సమయంలో అతి చాకచక్యంగా మాట్లాడి అహింసాయుతంగా శాసనోల్లంఘనను విజయవంతం చేయమని ప్రజలకు నచ్చజెప్పి డాక్టర్ ఖాన్ సాబ్ పెను ప్రమాదాన్ని తప్పించారు. అటు పెషావర్ లోనూ, ఇటు ఉత్తమంజాయ్లాలో ఖుదా-యే-ఖిద్మత్ గార్లు స్థిరచిత్తంతో సాగించిన శాసనోల్లంఘనోద్యమం తీరును గమనించిన బ్రిటీష్ అధికారులు గందరగోళంలో పడిపోయారు. ' అరివీర భయంకరుడైన పఠాన్ కంటే అహింసావాది పఠాన్ ' అంటేనే అధికారులు భయంతో వణికిపోసాగారని (The British feared a non-