సయ్యద్ నశీర్ అహమ్మద్ 140
ఆ ప్రక్కనున్న సందుల్లో, గొందుల్లో చేరిన ప్రజల మీదకు నేరుగా పలుమార్లు కాల్పులు
జరిపారు. ఉదయం పదకొండు గంటలకు ప్రారంభమైన ఈ కాల్పుల పర్వం సాయంత్రం
అయిదు గంటల వరకు సాగింది. ఖిస్సా ఖ్వాని బజార్ శవాల దిబ్బగా మారింది. మృతవీరుల
భౌతికకాయాల నుండి స్రవించిన రక్తపు ధారలతో పెషావర్ తడిసి ముద్దయ్యింది. బ్రిటీష్
పోలీసులు కిరాతకత్వానికి పరాకాష్టగా నిలిచిన ఈ సంఘటనలో సుమారు మూడు వందల
మంది అమరులయ్యారు. వందలాది ఉద్యమకారులు గాయపడ్డారు. గాయపడిన పలువురు
ఆ తరువాత మృతి చెందారు.
ఈ సందర్భంగా ఖుదా యే-ఖిద్మత్గార్లు, కాంగ్రెస్ కార్యకర్తలు, ఖిలాఫత్
ఉద్యమకారులు ఖిస్సాఖ్వాని బజారు సందుల్లో విసిరివేసినట్టుగా పడి ఉన్న 60 మృతదేహాలను
సేకరించి, ఒకచోటకు చేర్చి గౌరవప్రదంగా అంత్యక్రియలు జరిపారు. గాయపడిన
ఉద్యమకారులకు, ప్రజలకు డాక్టర్ ఖాన్ సాబ్ చికిత్స చేయించారు. బ్రిటీష్ పోలీసులు
కల్పించిన ఆటంకాల వలన గాయపడిన వారికి సక్రమంగా చికిత్స జరగకపోవటంతో
పలువురు ప్రాణాలు కోల్పోయారు. అమరవీరుల మృతదేహాలను కదల్చడానికి కూడా
అంగీకరించని అధికారులు, సైనిక దళాలు రాత్రికి రాత్రే పలు వాహనాలలో మృతదేహాలను
గుట్టుచప్పుడు కాకుండా గుర్తు తెలియని ప్రాంతాలకు తరలించి, ఆ దేశభక్తుల భౌతిక
కాయాలను అనాధ శవాల్లా అంత్యక్రియలు జరిపి చేతులు దులుపుకున్నారు.
నరకం చూసిన పెషావర్ ప్రజలు
ఈ విధంగా రంగ ప్రవేశం చేసి, పెషావరు శ్మశానం చేసిన సైనిక దళాలు
పట్టణాన్ని పూర్తిగా తమ అదుపులోకి తీసుకున్నాయి. మూడు రోజుల పాటు అక్కడ సైన్యం
రాజ్యమేలింది. ప్రజల ధన మాన ప్రాణాలకు ఏ మాత్రం రక్షణ లేకుండా పోయింది.
పట్టణాన్ని ఆక్రమించుకుని రాక్షస పాలన సాగించారు. ఖుదా-యే-ఖిద్మత్ గార్, భారత
జాతీయ కాంగ్రెస్ సహా అన్ని సంస్థల నాయకుల, కార్యకర్తల గృహాల మీద దాడులు
చేశారు. అస్తిపాస్తులను విధ్వంసం చేసారు. దోచుకున్నారు. ప్రజానీకం నరకాన్ని చవిచూసారు.
అత్యంత క్రూరంగా వ్యవహరిస్తూ, నరకాన్ని కూడా మరపింపచేసిన సైనిక దళాలు ఏప్రిల్
26న పట్టణాన్ని ఖాళీచేసి హఠాత్తుగా వెళ్ళిపోయాయి. సైనిక దళాలు పట్టణాన్ని ఖాళీచేసి
వెళ్ళిపోవటం వలన ప్రభుత్వ పాలన కనుమరుగైంది. ఆ సమయంలో ఖుదా- యే-
ఖిద్మత్గార్లు, ఖిలాఫత్ కార్యకర్తలు పట్టణంలో శాంతిభద్రతలను కాపాడటానికి ప్రజల ఆస్తులకు,
ప్రాణాలకు రక్షణగా నిలిచారు.
అమరవీరుల్లో కొందరు
వాయ్యవ సరిహద్దు ప్రాంత చరిత్రలో ప్రత్యేక అధ్యాయాన్ని సృష్టించిన ఈ
సంఘటనలలో అసువులు బాసిన వారిలో కొందరి పేర్లను Dr. Santimoy Roy తన
గ్రంథం Freedom Movement and Indian Muslims లో ఉటంకించారు. ఆ ప్రకారం
ఆనాటి సంఘటనలో అమరులైన వీరులలో అబ్దుల్ అహమ్మద్, అబ్దుల్ గఫార్ ఖాన్, అబ్దుల్
జలీల్, అబ్దుల్లా, అఘా ఖాన్, అఘా మహమ్మద్ అలియాస్ తలంగే, అహమ్మద్ సరూర్,
అక్రంఖాన్, అబ్దుల్లా చౌదరీ, దిలావర్, ఫకీర్ మహమ్మద్, ఫజలుద్దీన్, ఫజల్ మహమ్మద్,