Jump to content

పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం ప్రజా పోరాటాలు.pdf/137

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సయ్యద్ నశీర్ అహమ్మద్ 134

సాగించారు. విద్యా-వికాస కార్యక్రమాల ముమ్మరం చేశారు. ఖుదా-యే-ఖిద్మత్గార్ సంస్థను, ఆయన ప్రారంభించిన యితర సంస్థలను పటిష్టం చేసి, ఆయా రంగాలలో ప్రగతి కోసం శ్రమించారు. ఆ సమయంలో దేశంలో మతకలహాలు తలెత్తాయి. వలసపాలకులు ఆ కలహాలను మరింతగా రెచ్చగొట్టారు. మత దురహంకార శక్తులకు వత్తాసు పలికారు. ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ లాంటి శాంతిదూతల వలన మతోన్మాద రాక్షసి వాయవ్య సరిహద్దు ప్రాంతాల వరకు తన విద్వేషపు నీడను చాచలేకపోయింది. అన్ని మతాల సారాంశం ఒక్కటేనని నమ్మిన గఫార్ ఖాన్ మతం పేరుతో ఘర్షణ పడాల్సిన అవసరం లేదని బోధించారు. జాతీయ భావాలను ప్రచారం చేసి, జాతీయ ఆలోచనలకు ప్రాణప్రతిష్ట చేసారు.
ఖుదా-యే-ఖిద్మత్గార్ సంస్థ క్రమక్రమంగా వాయవ్య సరిహద్దు ప్రాంతమంతా విస్తరించసాగింది. మహాత్మాగాంధీ ఆలోచనలతో ప్రభావితమైన ఖాన్ గఫార్ ఖాన్ అహింసా మార్గాన పోరాడేందుకు జనులను సిద్ధం చేసారు. భారత జాతీయ కాంగ్రెస్ పిలుపు కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఖుదా-యే- ఖిద్మత్గార్లకు అందించిన రాజకీయ చైతన్యంతో ఈ భగవత్సేవకులంతా భారత జాతీయ కాంగ్రెస్ ఆజ్ఞలను శిరసావహించే సుశిక్షిలైన కార్యకర్తలుగా తయారయ్యారు. గఫార్ ఖాన్ ఆపాటికే భారత జాతీయ కాంగ్రెస్ సభ్యత్వం స్వీకరించి, వాయవ్య సరిహద్దు ప్రాంతాలకు జాతీయ కాంగ్రెస్ ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు. ఈ వాతావరణంలో ఖుదా యే-ఖిద్మత్రై భారత జాతీయ కాంగ్రెస్ కార్యకర్తలుగా పరిణామం చెందారు.
ఆత్మార్పణల పరంపర ప్రారంభం
1929 డిసెంబర్ 31వ తేదీన లాహోర్ లో జరిగిన సమావేశంలో పూర్ణ స్వరాజ్యం ' డిమాండ్ చేస్తూ, స్వరాజ్య సాధనకు తగిన ఉద్యమాన్ని ప్రారంభించాల్సిందిగా భారత జాతీయ కాంగ్రెస్ గాంధీజీని కోరింది. గాంధీజీ కొంతకాలం వరకు మౌనంగా ఉన్నా, మౌలానా హసరత్ మెహాని లాంటి నాయకులు ఎప్పట్నించో కోరుతున్న' పూర్ణ స్వరాజ్యం' తీర్మానానికి ఆయన నుండి గ్రీన్ సిగ్నల్ లభించడంతో ప్రజలలో జాతీయ కాంగ్రెస్ నాయకులలో, కార్యకర్తలలో, ఉద్యమకారులలో ఉత్సాహం ఉరకలెత్తింది.
ఈ సందర్భాన్ని పురస్కరించుకుని 1930 జనవరి ఒకటవ తేదీన, లాహోర్ నగరం ' పూర్ణ స్వరాజ్యం ' సంబరాలు చేసుకుంది. పఠాన్లు త్రివర్ణ పతాకాలు ఎగురవేసారు. అన్ని మతాల, వర్గాల ప్రజలు అమితోత్సాహంతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజలలో కన్పించిన ఈ ఉత్సాహ ఉధృతి అధికారులలో ఆందోళనకు, ఆగ్రహానికి కారణమైంది. సంపూర్ణ స్వరాజ్యం తీర్మానం చేసిన కాంగ్రెస్, స్వరాజ్యాన్ని సాధించేందుకు చేపట్టాల్సిన ఆందోళనా మార్గాన్ని నిర్ణయించాల్సిందిగా గాంధీజీని కోరగా, బ్రిటీష్ శాసనాలను ఉల్లంఘించమని గాంధీజీ పిలుపునిచ్చారు.
ఈ నిర్ణయం మేరకు వాయవ్య సరిహద్దు ప్రాంతాలలో విభిన్న రూపాలలో చట్టాలను ఉల్లంఘించటం ప్రారంభమైంది. ప్రజలను నియంత్రించటం అధికారులకు సాధ్యంకాలేదు. ప్రశాంతంగా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడకుండా ప్రజలు ఉద్యమించటం అధికారులకు మింగుడు పడలేదు. సమరశీలురైన పఠాన్లు సహనంతో వ్యవహరిస్తున్న