Jump to content

పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం ప్రజా పోరాటాలు.pdf/112

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

109 భారత స్వాతంత్య్రోద్యమం-ముస్లిం ప్రజాపోరాటాలు

రూపాయల జరిమానాను విధించారని, విధించింది 30 వేలైనా వసూలు చేసింది లక్ష రూపాయలని Dr. SANTIMOY RAY తన గ్రంథం FREEDOM MOVEMENT AND INDIAN MUSLIMS లో బ్రిటీష్ అధికారులు నివేదికాంశాలను ఉటంకించారు. అడిగినంత జరిమానా చెల్లించలేక పోయిన గ్రామాలకు చెందిన వందలాది మోప్లాలను చిత్రహింసల కేంద్రాలలో బందీలను చేసారు. ఈ వాతావరణం మోప్లాల ఆలోచనలలో మార్పు తెచ్చింది. గతంలో లాగా శత్రువుతో పోట్లాడుతూ అమరత్వం పొందటం కాకుండా పోరాటం ద్వారా ఫలితాన్ని ఇహ లోకంలోనే సాధించాలన్న భావన కారణంగా వృధాగా ఆత్మార్పణలు చేయడం ఎందుకన్న ప్రశ్న ఉద్భవించింది. ఈ విషయమై పలువురు తంగల్స్, అధికారుల ప్రకటనల ప్రభావానికి మోప్లాలు లోనయ్యారు.
⁠ఈ పరిస్థితులలో పలువురు మోప్లాలు బ్రిటిష్ సైనికుల ఉచ్చులో చిక్కుకున్నారు. అలా చిక్కిన మోప్లాల బృందాన్ని తిరూర్ జైలు నుంచి బళ్ళారి జైలుకు పంపాలని నిర్ణయించారు. మోప్లాలను తరలించడానికి ఒక గూడ్స్ వ్యాగన్ ను తెప్పించారు. ఆ వ్యాగన్ 18 అడుగుల పొడవు, 9 అడుగుల వెడల్పు ఉంది. మోప్లాలు 127 మంది ఉన్నారు. అంతమంది ఆ వ్యాగన్ లో పట్టరు. ఆ విషయం అధికారులకు పట్టలేదు. మోప్లాలందరిని ఆ వ్యాగన్లో పచ్చి చేపలను కుక్కినట్లు కుక్కారు. ఆ వ్యాగన్ పట్టనప్పటికీ మరో వ్యాగన్ తెప్పించలేదు. అందర్ని కుక్కి వ్యాగన్ తలుపులు తెరుచుకోడానికి వీలు లేకుండా బిగించారు. ప్రజల
⁠1921 నవంబర్ 19న రైలు బళ్ళారికి బయలుదేరింది. రైలు బయలుదేరగానే హహాకారాలు మిన్నుముట్టాయి. తమ ఆత్మీయులను క్రూరమైన రీతిలో జైలుకు తరలిస్తున్న సంఘటన చూస్తున్న ఆప్తులకు దుఖఃం ఆగలేదు. ఏమి చేయలేని పరిస్థితి. నోరు తెరిస్తే జైళ్ళు నోళ్ళు తెరుస్తాయి. లాఠీలు వీపుల మీద నర్తిస్తాయి. ఆత్మీయుల ఆక్రందనలు వింటూ సంబంధితులు మిన్నకుండి పోయారు. వ్యాగన్ మోప్లాలు కిక్కిరిసి పోవటంతో గాలి పీల్చడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. వ్యాగన్కు కొత్తగా పెయింటింగ్ కూడా చేయటం వలన, దానికున్న చిన్నపాటి రంధ్రాలు మూసుకుపోయాయి. శ్వాస పీల్చడం కూడా కష్టమైపోయింది. రైలు సాగుతోంది. రైలు గార్డులకు మోప్లాల ఆర్తనాదాలు, హాహాకారాలు విన్పిస్తున్నా ఏమీ పట్టనట్టుగా ఉండి పోయారు.
⁠రైలు ప్రయాణం ప్రారంభంలో విన్పించిన ఆక్రందనల స్థాయి క్రమక్రమంగా సన్నగిల్లసాగింది. మంచినీళ్ళు కోరుతూ సాగిన కేకలు క్రమంగా తగ్గిపోయాయి. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కూడా విన్పించటంలేదు. భయంకర విషాదం మోప్లాలను అలుముకుంటున్నప్పటికీ సైనికాధికారులలో స్పందన రాలేదు. రైలు తిరూర్ నుండి 90 మైళ్ళ దూరంలో గల కోయంబత్తూరు చేరుకుంది. ఆ సమయంలో అసలు వ్యాగన్లో ఎవ్వరూ లేనట్టుగా, ఎటువంటి అలికిడి విన్పించలేదు. అధికారులకు అనుమానం వచ్చింది. వ్యాగన్ తలుపులు తెరిచారు. వ్యాగన్లో ఉన్న మోప్లాలలో ఎటువంటి కదలికలేదు. అంతా స్పృహ కోల్పోయారు. స్పృహ కోల్పోవటం కాదు 70 మంది మోప్లాల యోధులు మృతి చెందారు. మరొక అంచనా. ప్రకారంగా 80 మంది మృతిచెందారు.
⁠బ్రిటీష్ అధికారుల కిరాతకాన్ని వెల్లడించే ఈ సంఘటనను కప్పిపెట్టాలని అధికారులు