Jump to content

పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం ప్రజా పోరాటాలు.pdf/111

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సయ్యద్ నశీర్ అహమ్మద్ 108

బలగాలు పొట్టన పెట్టుకున్నాయని మరొక అధికారిక నివేదిక తెలిపింది. బ్రిటీష్ అత్యున్నత అధికారి లార్డ్ రావిల్సన్ నివేదిక ప్రకారంగా సైనికులతో పోరాడుతూ 4 వేల మంది తిరుగుబాటుదారులు మరణించగా, 169 మంది సైనికులు హతమయ్యారు. తిరుగుబాటు ఫలితంగా 462 హత్యలు, 5941 దోపిడీలు, 352 గృహదహనాల సంఘటనలు జరిగాయని Prof. CONARD WOOD పేర్కొన్నాడు.
⁠బ్రిటీష్ రాజ్యం స్థానంలో మోప్లాలు ఖిలాఫత్ రాజ్య స్థాపనను చేయాలని అనుకుంటున్నారని భావించిన పాలకులు మోప్లాల పట్ల చాలా క్రూరంగా వ్యవహరించారు. మార్షల్ లా ప్రకటించిన తరువాత 252 మంది మోప్లాలను కోర్టు మార్షల్ చేసి కాల్చివేసారు. 502 మందికి జీవిత కారాగార శిక్ష విధించారు. వేలాది మందిని సంవత్సరాలపాటు జైళ్ళపాట్టేసారు. పదిమంది పట్టే జైలులో వంద మందిని ఉంచి, కనీస వసతులు కూడా లేకుండా చేసి, కడుహీనమైన పరిస్థితులను మోప్లాలు అనుభవించేట్టుగా చేసారు.
బళ్ళారి రైలు విషాదాంతం
⁠ఈ సందర్భంగానే మలబారు పోరాట చరిత్రలో అత్యంత కిరాతక చర్యగా చరిత్ర పుటలకెక్కిన బళ్ళారి రైలు సంఘటన జరిగింది. ఈ సంఘటన ఆంగ్లంలో 'ట్రైన్ ట్రాజెడీ' గా పిలువబడింది. కలకత్తా చీకటి కొట్టులో బ్రిటీష్ అధికారులను, సైనికులను కుక్కి దారుణంగా చంపాడని సిరాజుద్ధాల ఆనాడు విమర్శలకు గురయ్యాడు. ఆ సంఘటనను 'కలకత్తా ట్రాజెడి' గా బ్రిటీషర్లు ప్రచారం చేసారు. ఈ విషయాలను పాఠ్య పుస్తకాలలో చేర్చి పసి హృదయాలను బాగా ప్రభావితం చేసారు. ఈ సంఘటన మీద విదేశీ చరిత్రకారుల్లో కూడా ఏకాభిప్రాయం లేదు. అటువంటి వివాదాస్పద అంశానికి రంగులు పూసి జనంలో ప్రచారం చేసిన బ్రిటీష్ చరిత్రకారులు 'బళ్ళారి రైలు విషాదాంతాన్ని' మాత్రం ఉద్దేశ్యపూర్వకంగానే మరచిపోయారు. కలకత్తా సంఘటనకు సిరాజుద్దాలా కారణమయ్యాడో లేదో కాని 'ట్రైన్ ట్రాజెడీ' కి మాత్రం బ్రిటీష్ అధికారులు కారణమయ్యారు.
⁠1921 ఆగస్టులో ప్రారంభమైన తిరుగుబాటు పలు అంతర్గత, బహిర్గత కారణాల మూలంగా నవంబరు మాసాంతానికి బలహీనపడసాగింది. మోప్లా నాయకులు ఒక్కొక్కరుగా అంతం కావటం, ఉద్యమకారులు సైనికుల తుపాకిగుండ్లకు బలికావటం, అత్యధిక సంఖ్యలో కార్యకర్తలు, ప్రజలు జైళ్ళ పాలవటం, బ్రిటీష్ సైనిక బలగాలు మోప్లాల ఆధిపత్యం గల ప్రాంతాలలోని ప్రతి అంగుళాన్ని ఆక్రమించుకోవడం, మార్షల్లో ప్రకటించిన ప్రభుత్వం పోలీసులు, సైనిక బలగాలతో పల్లె, పట్టణ ప్రాంతాలన్నిటినీ అడుగడుగున సోదాలు నిర్వహించి, భారీగా అరెస్టులు సాగించటం లాంటి చర్యలు ఉద్యమం నీరసపడడానికి కారణమయ్యాయి. ఈ చర్యలకు తోడుగా పాలక వర్గాలు సామదాన భేదోపాయాన్ని ఆచరణలోకి తెచ్చాయి. ఉద్యమకారుల పట్టుగలిగిన గ్రామాలకు సామూహిక జరిమానాలు విధించారు. ఉద్యమకారులు లొంగిపోయినట్లయితే క్షమిస్తామని, శిక్షల తీవ్రత ఉండదని ప్రకటించారు. ఉద్యమనేతలకు సహకారం ఇవ్వనట్టయితే ఆ గ్రామాలకు విధించిన సామూహిక జరిమానాలను రద్దు చేస్తామన్నారు. ఈ మేరకు పలు గ్రామాల మీద మొత్తం 30 వేల