99 భారత స్వాతంత్య్రోద్యమం-ముస్లిం ప్రజాపోరాటాలు
ప్రమాదకరంగా పరిణమించాయని ఆరోపించి కేసులు నమోదయ్యాయి. ఆ తరువాత
విచారణ తంతు నడిపించి ఆరు మాసాల జైలు శిక్ష విధించారు.
ఈ చర్యలతో మోప్లాలు మండిపడ్డారు. మలబారు మోప్లాల హృదయాలలోని బడబాగ్ని
బద్దలైంది. ఆ సమయంలో ప్రముఖ మోప్లా నాయకుడు, ఖిలాఫత్ కమిటీ అగ్రనేత మౌల్వీ
అలీ ముస్సలియార్ను (MOULI ALI MUSSALIYAR) అరెస్టు చేయాల్సిందిగా మద్రాసు
జిల్లా కలెక్టర్ ఇ.యం. థామస్ ఆదేశాలు జారీచేసాడు. ఆయనను అరెస్టు చేస్తే మోప్లాల
ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని, ఆ ఉద్రేకాన్ని నియంత్రించలేమన్న భయంతో అప్పటికి
అధికారులు మిన్నకుండిపోయారు.
ప్రజల నిరసన ఒకవైపు తీవ్రతరం అవుతుండగా మరోవైపు అధికారులు నిషేధాలను,
నిర్బంధాలను మరింత ఎక్కువ చేసారు. ప్రత్యేక చట్టాల నిబంధనలను అమలులోకి తెచ్చి
ప్రముఖ జాతీయ నాయకులు యాకూబ్ హసన్ లాంటి వారిని అరెస్టు చేసారు. మౌల్వీ
ఇర్నికున్నమ్ అలీ ముస్సలియార్ నాయకత్వాన తిరుంగాడి పట్టణానికి చెందిన ఖిలాఫత్
కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ప్రదర్శనలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలు రానున్న తుపానును
సూచించసాగాయి. ఒకవైపు ఈ నిరసన జ్వాలలు ప్రజ్వరిల్లుతున్న సమయంలోనే పశ్చిమ
ఎర్నాడు ప్రాంతంలో పొన్నాని పట్టణంలో ఏర్పడిన ఖిలాఫత్ వ్యతిరేక కమిటీ సభ్యులు,
అధికారుల అండదండలతో జూలై మొదటి వారంలో సభను నిర్వహించడానికి సాహసించారు.
ఈ కార్యక్రమాన్ని ఖిలాఫత్ కార్యకర్తలు ఎదుర్కొన్నారు. మోప్లాలు విరుచుకుపడ్డారు. ఈ
సందర్భంగా విరుచుకు పడిన మోప్లాల ధాటికి పోలీసులు నిలువలేకపోయారు. పోలీసుల
పలాయనం మోప్లాలో ఆత్మవిశ్వాసాన్ని ఇనుమడింపచేయటమేకాక, పోలీసు బలగాలంటే
చిన్నచూపుకు కారణమైంది.
ఈ సంఘటన తరువాత ఖిలాఫత్ వ్యతిరేకులు, ప్రభుత్వ అనుకూల వర్గాల మీద
ఖిలాఫత్ కార్యకర్తలు దాడులు ప్రారంభించారు. ఈ దాడులలో మతం, కులం, వర్గం,
వర్ణం అడ్డురాలేదు. 1921 ఆగస్టు ప్రారంభంలో తిరుంగాడి ప్రాంతంలో సహాయ నిరాకరణ
ఉద్యమాన్ని మోప్లాలు మరింత వేగవంతం చేసారు. తాగుడుకు వ్యతిరేకంగా ప్రచారాన్ని
తీవ్రతరం చేసారు. ఈ ప్రచార కార్యక్రమాలను పోలీసులు అడ్డుకోవడంతో శాంతి భద్రతలకు
భంగం ఏర్పడింది. పలుచోట్ల హింసాకాండలు చోటుచేసుకున్నాయి. ఆ సమయంలోనే
పుక్కుటూర్ మెట్లలు, బ్రిటీషర్ల వత్తాసుదారుడైన భూస్వామికి సంబంధించిన భవనాన్ని
ఆక్రమించుకున్నారు. ఆ భవనాన్ని తమ ప్రార్థనాలయంగా మార్చుకున్నారు. ఆ జెన్మి పక్షాన
వచ్చిన బలగాలను ఎదుర్కొన్నారు. బలగాలు పలాయనం చిత్తగించాయి. ఈ సంఘటన
తరువాత దాదాపు 3 వారాల పాటు అక్కడ మోప్లాల రాజ్యం సాగింది. జూలై 29న మరో
మోప్లా నాయకుడు పుక్కుటూర్ ఖిలాఫత్ కమిటీ కార్యదర్శి వడక్కేవిట్టిల్ మహమ్మద్
VADAKKE-VITTIL MUHAMAD ) ఇంటి మీద దాడి జరిగింది. పుక్కుటూర్ జెన్మి
అరవ తిరుముల్పాద్ ఇంటి నుండి తుపాకిని దొంగతనం చేసాడన్న ఆరోపణల మీద
పొలీసులు దాడి చేసారు. ఈ చర్యలో పోలీసులకు తుపాకీ దొరకలేదు. మహ్మద్ను అరెస్టు
చేయడానికి పోలీసులు ప్రయత్నించగా ప్రజలు అడ్డుకుని ఆ ప్రయత్నాలను వమ్ముచేసారు.
పోలీసులు ఉత్తచేతులతో తిరుగుముఖం పట్టారు.